బుమ్రా తర్వాత ముంబై ఇండియన్స్ కు మరో ఎదురుదెబ్బ.. కీలక బౌలర్‌కు సర్జరీ.. ఐపీఎల్ నుంచి ఔట్..!

Published : Mar 11, 2023, 03:31 PM IST
బుమ్రా తర్వాత ముంబై ఇండియన్స్ కు మరో ఎదురుదెబ్బ..  కీలక బౌలర్‌కు సర్జరీ.. ఐపీఎల్ నుంచి ఔట్..!

సారాంశం

IPL 2023: వచ్చే ఐపీఎల్ సీజన్  లో ముంబై ఇండియన్స్ కు  వరుస షాకులు తాకుతున్నాయి.   ఆ జట్టు  బౌలర్లంతా సర్జరీల బాట పడుతున్నారు.  

ఐపీఎల్ లో అత్యంత విజయవంతమైన జట్టుగా ఉన్న ముంబై ఇండియన్స్ గతేడాది పాయింట్ల పట్టికలో  చిట్ట చివరి స్థానంలో నిలిచిన విషయం తెలిసిందే. ఈ ఏడాదైనా   మెరుగైన ప్రదర్శన చేసి ఘనంగా కమ్  బ్యాక్ ఇవ్వాలని ఆ జట్టు ఉవ్విళ్లూరుతోంది.  కానీ  పరిస్థితులు మాత్రం అందుకు ఏమాత్రం అనుకూలంగా లేవు.   ముంబై జట్టుకు బౌలర్లు కరువవుతున్నారు. ఇదివరకే బుమ్రా   వెన్నునొప్పి గాయానికి సర్జరీ చేయించుకోగా తాజాగా మరో  ప్లేయర్ కూడా  మంచం పట్టాడు. 

ఐపీఎల్ లో ముంబై తరఫున ఆడుతున్న   ఆస్ట్రేలియా పేసర్  జై రిచర్డ్‌సన్   కూడా  సర్జరీ చేయించుకున్నాడు.  కొంతకాలంగా వేధిస్తున్న  మోచేతి గాయానికి సర్జరీ చేయించుకున్నట్టు తెలుస్తున్నది.  

తాజాగా అతడు ఇదే విషయాన్ని  తన సోషల్ మీడియా వేదికగా వెల్లడించాడు.   సర్జరీ చేయించుకున్న ఫోటోను   ట్విటర్ లో షేర్ చేస్తూ.. ‘క్రికెట్ లో గాయాలు    చాలా కీలక పాత్ర పోషిస్తాయి.  అది ఎవరూ కాదనలేని వాస్తవం.  చాలా చిరాకుగా ఉంది. కానీ  నేను  తిరిగి మెరుగైన  ప్రదర్శనలు చేయడానికి సిద్ధమవుతానన  ప్రామిస్ చేస్తున్నా. ఒక అడుగు వెనక్కి.. రెండు అడుగులు ముందుకు అన్న చందంగా  నేను ముందుకు సాగుతా...’అని  ట్వీట్ చేశాడు.  

రిచర్డ్‌సన్ ను గత వేలంలో  ముంబై రూ. 1.50 కోట్లకు కొనుగోలు చేసిన విషయం తెలిసిందే.   కాగా  ఈ సీజన్ లో  బుమ్రా లేకపోవడం తో జోఫ్రా ఆర్చర్ తో  కలిసి రిచర్డ్‌సన్ కొత్త బంతిని పంచుకుంటాడని  ముంబై ఫ్యాన్స్ ఆశించారు.  కానీ వాళ్ల ఆశలపై నీళ్లు చల్లుతూ రిచర్డ్‌సన్ ట్విటర్ లో పోస్ట్ చేయడం గమనార్హం.  ప్రస్తుతం సర్జరీ నుంచి కోలుకోవడానికి  సుమారు రెండు నెలల నుంచి   మూడు నెలల  సమయం పట్టొచ్చని  తెలుస్తున్నది.  దీంతో అతడు ఐపీఎల్ నుంచి దాదాపుగా తప్పుకున్నట్టే.   ఐపీఎల్ తో పాటు   ఆ తర్వాత ఇంగ్లాండ్ లో ఆస్ట్రేలియా ఆడబోయే యాషెస్ లో అయినా అతడు ఆడతాడా..? లేదా..? అన్నది అనుమానమే. 

 

ఈ ఏడాది జనవరి నుంచి   రిచర్డ్‌సన్ క్రికెట్ కు దూరంగా ఉన్నాడు.  బిగ్ బాష్ లీగ్ లో పెర్త్ స్కాచర్స్ కు ప్రాతినిథ్యం వహించే అతడు జనవరి 4న గాయపడ్డాడు.  వాస్తవానికి భారత్  తో ఆస్ట్రేలియా మూడు వన్డేల సిరీస్ లో  అతడు కూడా భాగంగా ఉన్నాడు.  కానీ  సర్జరీ కారణంగా ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు  అతడి స్థానంలో   నాథన్ ఎల్లీస్ ను తుది జట్టులోకి తీసుకుంది. ఆస్ట్రేలియా తరఫున ఈ యువ పేసర్ ఇప్పటివకు  3 టెస్టులు,  15 వన్డేలు, 18 టీ20లు ఆడాడు. 

కాగా  వెన్నునొప్పి గాయం కారణంగా బుమ్రా ఇటీవలే న్యూజిలాండ్ లో శస్త్రచికిత్స చేసుకున్న విషయం తెలిసిందే. ఈ సర్జరీ విజయవంతమైందని  బీసీసీఐ వర్గాలు తెలిపాయి.  సర్జరీ తర్వాత బుమ్రా సుమారు  ఆరు నెలల పాటు క్రికెట్ కు దూరంగా ఉండనున్నాడు.  
 

PREV
click me!

Recommended Stories

Rohit Sharma : షాకింగ్.. అసలు విషయం చెప్పిన రోహిత్!
కోహ్లీ నిర్ణయంతో రోహిత్ యూటర్న్.. ఇంతకీ అసలు మ్యాటర్ ఏంటంటే.?