ఐపీఎల్ 2023 అయ్యాక విండీస్ టూర్‌కి టీమిండియా... ఆ తర్వాత ఐర్లాండ్‌కి! వన్డే వరల్డ్ కప్ ముందు...

By Chinthakindhi RamuFirst Published Mar 26, 2023, 1:00 PM IST
Highlights

మార్చి 31 నుంచి ఐపీఎల్ 2023 సీజన్.. ఆ తర్వాత శ్రీలంక లేదా ఆఫ్ఘాన్‌తో వన్డే సిరీస్.. అటు నుంచి వెస్టిండీస్ పర్యటనకు, ఆ తర్వాత ఐర్లాండ్‌కి... వన్డే వరల్డ్ కప్‌కి ముందు బిజిబిజీగా టీమిండియా.. 

ఆస్ట్రేలియాతో టెస్టు, వన్డే సిరీస్‌లను ముగించిన టీమిండియా, ప్రస్తుతం ఐపీఎల్ మూడ్‌లోకి వచ్చేసింది. టీమిండియా కోచ్ రాహుల్ ద్రావిడ్‌తో పాటు మిగిలిన సహాయక సిబ్బంది హాలీడేస్‌లోకి వెళ్లపోగా క్రికెటర్లు, ఇప్పుడు తమ తమ ఫ్రాంఛైజీ క్యాంపుల్లో చేరిపోయారు.. 

మార్చి 31న మొదలయ్యే ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2023 సమరం, రెండు నెలల పాటు నిర్విరామంగా సాగి మే 28న జరిగే ఫైనల్ మ్యాచ్‌తో ముగియనుంది. ఐపీఎల్ 2023 ఫైనల్ ముగిసిన తర్వాత వారం రోజుల గ్యాప్‌లో ఆస్ట్రేలియాతో ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ ఆడనుంది టీమిండియా...

లండన్‌లో ది ఓవల్ స్టేడియంలో జరిగే ఐసీసీ డబ్ల్యూటీసీ 2023 ఫైనల్ మ్యాచ్, జూన్ 7న మొదలవుతుంది. ఇంగ్లాండ్‌లో కురిసే వర్షాలను దృష్టిలో పెట్టుకుని, ఫైనల్‌లో రిజల్ట్ తేల్చేందుకు ఓ రిజర్వు డేని కూడా కేటాయించింది ఐసీసీ..

ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ ఆడిన తర్వాత శ్రీలంక లేదా ఆఫ్ఘనిస్తాన్‌తో వన్డే సిరీస్ ఆడాలనుకుంటోంది టీమిండియా.. అయితే ఈ రెండు దేశాల్లో ఎవరితో వన్డే సిరీస్ ఆడాలని విషయంపై ఇంకా స్పష్టత రాలేదు. ఐపీఎల్ ప్రారంభమయ్యాక షెడ్యూల్‌ని ఫిక్స్ చేయబోతోంది బీసీసీఐ...

‘ఐసీసీ డబ్ల్యూటీసీ ఫైనల్ తర్వాత శ్రీలంక లేదా ఆఫ్ఘాన్‌లతో మూడు వన్డేల సిరీస్ ఉంటుంది. అయితే ఇంకా ప్రత్యర్థిని నిర్ణయించలేదు... ’ అని బీసీసీఐ అధికారి తెలియచేశారు. ఇతర క్రికెట్ బోర్డులతో చర్చలు జరుపుతున్న బీసీసీఐ, త్వరలో పూర్తి షెడ్యూల్‌ని విడుదల చేయనుంది...

బీసీసీఐతో బ్రాడ్ కాస్టింగ్ హక్కుల సొంతం చేసుకున్న స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్ ఒప్పందం త్వరలో ముగియనుంది. వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ ముగిసిన తర్వాత షార్ట్ టర్మ్ బ్రాడ్‌కాస్టర్‌తో ఒప్పందం కుదుర్చుకోనుంది భారత క్రికెట్ బోర్డు...

వెస్టిండీస్ పర్యటనలో భారత జట్టు 10 మ్యాచులు ఆడనుంది. ఇందులో 2 టెస్టులు, మూడు వన్డేలతో పాటు ఐదు టీ20 మ్యాచులు ఆడనుంది. ఇంతకుముందు 3 టీ20 మ్యాచులే ఆడాలని అనుకున్నా, మరో 2 మ్యాచులు ఆడాలని తాజాగా ఐసీసీ మీటింగ్స్‌లో ప్రతిపాదించడంతో సిరీస్ పెరగనుంది...

జూలై 10 లేదా 12 తేదీల్లో ఇండియా- వెస్టిండీస్ మధ్య టెస్టు సిరీస్ ప్రారంభం కానుంది. వచ్చే నెలలో ఈ పర్యటనకు సంబంధించిన పూర్తి షెడ్యూల్‌ని విడుదల చేయబోతోంది బీసీసీఐ. విండీస్ పర్యటన ముగించుకునే టీమిండియా, అటు నుంచి ఐర్లాండ్‌కి వెళ్లి మూడు టీ20ల సిరీస్ ఆడుతుంది... 2022లో ఐర్లాండ్ పర్యటనకి వెళ్లిన టీమిండియా, వరుసగా రెండో ఏడాది కూడా పసికూనతో సిరీస్ ఆడనుంది.

ఆ తర్వాత సెప్టెంబర్‌లో ఆసియా కప్ 2023 టోర్నీ ఆడి, స్వదేశానికి తిరిగి వస్తుంది. ఆసియా కప్ 2023 వేదికపై ఇంకా అధికారిక ప్రకటన రాలేదు. పాకిస్తాన్‌లో ఆసియా కప్ 2023 వన్డే టోర్నీ మ్యాచులు జరిగినా భారత్ ఆడే మ్యాచులు మాత్రం శ్రీలంక లేదా ఓమన్ లేదా యూఏఈలో జరగవచ్చని సమాచారం. ఐసీసీ వన్డే వరల్డ్ కప్‌ 2023 టోర్నీకి ముందు ఆస్ట్రేలియాతో మూడు వన్డేల సిరీస్ ఆడుతుంది. 

click me!