ఆఫ్ఘాన్ అదరగొట్టింది... షాహిదీ డబుల్ సెంచరీ, రెండో టెస్టులో రికార్డు స్కోరుతో...

By team teluguFirst Published Mar 12, 2021, 2:57 PM IST
Highlights

జింబాబ్వేతో జరుగుతున్న రెండో టెస్టులో ఆఫ్ఘాన్ భారీ స్కోరు...

తొలి ఇన్నింగ్స్‌లో 545/4 స్కోరు వద్ద ఇన్నింగ్స్ డిక్లేర్...

టెస్టుల్లో డబుల్ సెంచరీ చేసిన మొట్టమొదటి ఆఫ్ఘాన్ క్రికెటర్‌గా హస్మతుల్లా షాహిదీ రికార్డు...

టీమిండియా, ఇంగ్లాండ్ జట్లే 300+ స్కోరు చేయడానికి ఆపసోపాలు పడుతుంటే, నిన్నగాక మొన్న వచ్చిన ఆఫ్ఘాన్, జింబాబ్వేతో జరుగుతున్న రెండో టెస్టులో అదరగొడుతోంది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘనిస్తాన్ జట్టు 4 వికెట్ల నష్టానికి 545 పరుగుల భారీ స్కోరు చేసి, ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది.

జావెద్ అహ్మద్ 4 పరుగులకే అవుట్ కాగా రెహ్మత్ 23 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. ఓపెనర్ ఇబ్రహీం జాద్రాన్ 72 పరుగులు చేసి అవుట్ కాగా హస్మతుల్లా షాహిదీ, అస్గన్ ఆఫ్ఘాన్ నాలుగో వికెట్‌కి రికార్డు స్థాయిలో 308 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు.

ఆఫ్ఘాన్‌కి టెస్టుల్లో ఇదే అత్యధిక భాగస్వామ్యం. 257 బంతుల్లో 14 ఫోర్లు, 2 సిక్సర్లతో 164 పరుగులు చేసి ఆఫ్ఘాన్ కెప్టెన్ అస్గన్ ఆఫ్ఘాన్ అవుట్ అయ్యాడు.

55 పరుగులు చేసిన నజీర్ జమాల్‌తో కలిసి ఐదో వికెట్‌కి అజేయంగా 117 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పిన హస్మతుల్లా షాహిదీ 443 బంతుల్లో 21 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 200 పరుగులు చేసి, టెస్టుల్లో డబుల్ సెంచరీ చేసిన మొట్టమొదటి ఆఫ్ఘాన్ బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు.

జింబాబ్వే 60 ఓవర్లు ముగిసేసరికి 4 వికెట్లు కోల్పోయి 180 పరుగులు చేసింది. మొదటి టెస్టులో ఆఫ్ఘాన్, జింబాబ్వే చేతిలో 10 వికెట్ల తేడాతో చిత్తుగా ఓడడం విశేషం. 

click me!