యూఏఈలో ఆసియా కప్ 2023 మ్యాచులు పెట్టకపోవడానికి కారణం ఇదే! బీసీసీఐ సెక్రటరీ జై షా వివరణ...

By Chinthakindhi Ramu  |  First Published Sep 5, 2023, 7:54 PM IST

యూఏఈ వేదికగా ఆసియా కప్ 2018 టోర్నీ, టీ20 వరల్డ్ కప్ 2021, ఆసియా కప్ T20 2022 టోర్నీ... వన్డే వరల్డ్ కప్‌లో యూఏఈలో మ్యాచులు ఆడేందుకు అభ్యంతరం చెప్పిన సభ్యదేశాలు.. 


పాకిస్తాన్‌లో జరగాల్సిన ఆసియా కప్ 2023 టోర్నీ హైబ్రీడ్ మోడల్‌లో 4 మ్యాచులు పాక్‌లో, 9 మ్యాచులు శ్రీలంకలో జరగబోతున్నాయి. మొదటి మ్యాచ్‌ ముల్తాన్‌లో ఆడిన పాకిస్తాన్, రెండో మ్యాచ్ కోసం శ్రీలంకకి వచ్చింది. మళ్లీ సూపర్ 4 మ్యాచ్ కోసం లాహోర్‌కి వెళ్లింది.. 

శ్రీలంకలో జరగాల్సిన మ్యాచులకు వర్షం అంతరాయం కలిగిస్తోంది. ఇండియా - పాకిస్తాన్ మధ్య జరగాల్సిన మ్యాచ్ వర్షం కారణంగా ఫలితం తేలకుండానే రద్దు అయ్యింది.. దీంతో యూఏఈలో మ్యాచులు ఎందుకు నిర్వహించలేదనే ప్రశ్న ఎదురవుతోంది..

Latest Videos

undefined

ఇండియాలో జరగాల్సిన ఆసియా కప్ 2018 టోర్నీతో పాటు టీ20 వరల్డ్ కప్ 2021 టోర్నీకి, శ్రీలంకలో జరగాల్సిన ఆసియా కప్ 2022 టోర్నీకి యూఏఈ వేదికగా మారింది. ఆసియా కప్ 2023 టోర్నీ వేదికగా యూఏఈని పాక్ క్రికెట్ బోర్డు ప్రస్తావించినా.. ఆసియా క్రికెట్ కౌన్సిల్ అందుకు ఒప్పుకోలేదు..

‘ఆసియా కప్‌లో ఆడుతున్న ఐదు జట్లతో పాటు మీడియా రైట్స్ హోల్డర్లు, ఇన్‌-స్టేడియ హక్కుదారులు కూడా పాకిస్తాన్‌లో పూర్తి టోర్నమెంట్‌ పెట్టేందుకు అంగీకరించలేదు. పాకిస్తాన్‌లో ఉన్న పరిస్థితుల కారణంగా సెక్యూరిటీ కారణాలతో పాటు ఆర్థిక సంక్షోభాన్ని కూడా కారణంగా చెప్పారు. 

ఏసీసీ ప్రెసిడెంట్‌గా ఉన్న నేను, అందరికీ ఆమోదయోగ్యమైన హైబ్రీడ్ మోడల్ తీసుకురావడమే దీనికి పరిష్కారంగా భావించాను. అందుకే పాక్ క్రికెట్ బోర్డు ఈ ప్రతిపాదన తేగానే మేం అంగీకరించాం. పీసీబీలో కూడా మేనేజ్‌మెంట్ చాలా సార్లు మారింది..

ఆసియా కప్ 2022 ఎడిషన్, యూఏఈలో టీ20 ఫార్మాట్‌లో నిర్వహించాం. టీ20 ఫార్మాట్‌, వన్డే ఫార్మాట్ ఒక్కటి కాదు. యూఏఈలో ఉన్న వేడికి, 100 ఓవర్ల పాటు క్రీజులో ఉండడం అసాధ్యమని మిగిలిన బోర్డులు భావించాయి. అదీకాకుండా వన్డే వరల్డ్ కప్‌ టోర్నీకి ముందు ప్లేయర్లు గాయపడే అవకాశం ఉందని అభ్యంతరాలు వ్యక్తం అయ్యాయి..

అందుకే ప్లేయర్ల క్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని, యూఏఈలో కాకుండా శ్రీలంకలో మ్యాచులు నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నాం. వన్డే వరల్డ్ కప్ టోర్నీకి ముందు ఉపఖండ దేశంలో మ్యాచులు నిర్వహించడం వల్లే మ్యాచ్ ప్రాక్టీస్ కూడా దొరుకుతుందనే ఉద్దేశంలో ఈ నిర్ణయ తీసుకున్నాం..’ అంటూ తెలిపాడు బీసీసీఐ సెక్రటరీ, ఆసియా క్రికెట్ కౌన్సిల్ అధ్యక్షుడు జై షా.. 

షెడ్యూల్ ప్రకారం కొలంబోలో సూపర్ 4 మ్యాచులతో పాటు ఫైనల్ జరగాల్సి ఉంది. అయితే కొలంబోలో కుంభపోత వర్షాలు కురుస్తుండడంతో మ్యాచుల నిర్వహణపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. కొలంబో నుంచి హంబన్‌తోటకి మార్చాలని ఆసియా క్రికెట్ కౌన్సిల్ భావించింది. అయితే పాకిస్తాన్, హంబన్‌తోటలో ఆసియా కప్ 2023 మ్యాచులు నిర్వహించడానికి పాకిస్తాన్ ఒప్పుకోలేదు. దీంతో సూపర్ 4 మ్యాచులను రిజర్వు డేతో నిర్వహించాలని ఆలోచిస్తోంది ఏసీసీ.. 

click me!