చివరి ఓవరులో పేసర్ షమీ తడాఖా: సూపర్ రో'హిట్'

By telugu teamFirst Published Jan 29, 2020, 4:51 PM IST
Highlights

న్యూజిలాండ్ పై సూపర్ ఓవరులో రోహిత్ శర్మ భారత్ కు విజయాన్ని అందించాడు. రెండు బంతులకు పది పరుగులు కావాల్సిన స్థితిలో వరుసగా రెండు సిక్స్ లు బాది మ్యాచ్ నే కాదు, సిరీస్ ను కూడా భారత్ కు అందించాడు.

హామిల్టన్: న్యూజిలాండ్, భారత్ మధ్య హామిల్టన్ లో జరిగిన కీలకమైన మూడో మ్యాచ్ ఉత్కంఠ భరితంగా సాగింది. భారత్ నిర్దేశించిన 180 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో మ్యాచ్ టై అయింది. ఒక బంతికి ఒక్క పరుగు కావాల్సిన స్థితిలో న్యూజిలాండ్ మొహమ్మద్ షమీ వేసిన చివరి ఓవరులో రెండు వికెట్లు కోల్పోయింది.

చివరి బంతికి షమీ రాస్ టైలర్ వికెట్ తీయడంతో మ్యాచ్ టై అయింది. అంతకు ముందు షమీ న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ వికెట్ తీశాడు. మ్యాచ్ ను ఒంటి చేత్తో గెలిపించడానికి సిద్దపడిన విలియమ్సన్ వికెట్ పడగొట్టడం కీలకంగా మారింది. 48 బంతుల్లో అతను 95 పరుగులు చేశాడు. న్యూజిలాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 179 పరుగులు చేసింది. 

Also Read: కివీస్‌పై ‘సూపర్‌’ విన్, సిరీస్ సొంతం: విలియమ్సన్ శ్రమ వృథా

మ్యాచ్ విజేతను నిర్ణయించడానికి ఆ తర్వాత సూపర్ ఓవర్ జరిగింది.  సూపర్ ఓవరులో తొలుత బ్యాటింగ్ చేసిన కివీస్ 17 పరుగులు చేసింది. భారత్ 18 పరుగులు చేయాల్సిన అవసరం ఏర్పడింది. 

లక్ష్యాన్ని ఛేదించడానికి బ్యాటింగ్ కు దిగిన రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్ విజయాన్ని అందించారు. చివరి రెండు బంతుల్లో 10 పరుగులు చేయాల్సిన స్థితిలో రోహిత్ శర్మ వరుసగా రెండు సిక్స్ లు బాది విజయాన్ని అందించాడు. 

Also Read: బెన్నెట్ కు చుక్కలు చూపించిన రోహిత్: ఒక్క ఓవరులో 26 పరుగులు

సూపర్ ఓవరులో కేన్ విలియమ్సన్, గుప్తిల్ బ్యాటింగ్ కు దిగారు. జస్ ప్రీత్ బుమ్రా వేసిన సూపర్ ఓవరు తొలి బంతికి న్యూజిలాండ్ బ్యాట్స్ మన్ విలియమ్సన్ ఒక్క పరుగు తీశాడు. రెండో బంతికి గుప్తిల్ ఒక్క పరుగు తీశాడు.  ఆ తర్వాతి బంతిని సిక్స్ గా మలిచాడు. నాలుగో బంతికి నాలుగు పరుగులు చేశాడు.ఐదో బంతికి ఒక్క పరుగు బైగా వచ్చింది. బుమ్రా వేసిన ఆరో బంతిని గుప్తిల్ బౌండరీ దాటించాడు. దీంతో న్యూజిలాండ్ 17 పరుగులుచేసింది.

ఆ తర్వాత భారత బ్యాటింగ్ లో సౌథీ వేసిన తొలి బంతికి రోహిత్ శర్మ రెండు పరుగులు తీశాడు. ఆ తర్వాతి బంతికి ఒక్క పరుగు మాత్రమే తీశాడు. మూడో బంతిని రాహుల్ బౌండరీ దాటించాడు. నాలుగో బంతికి ఒక్క పరుగు తీశాడు. ఈ స్థితిలో రోహిత్ శర్మ స్ట్రైకింగ్ ఎండ్ కి వచ్చాడు. రెండు బంతుల్లో పది పరుగులు కావాల్సి ఉండగా, వరుసగా రెండు సిక్శ్ లు బాదాడు. 

Also Read: కివీస్ వర్సెస్ ఇండియా: ఓపెనర్ గా రోహిత్ శర్మ మరో రికార్డు

రోహిత్ శర్మ మ్యాన్ ఆఫ్ ద మ్యాచుగా ఎన్నికయ్యాడు. రోహిత్ శర్మ రెండు వరుస సిక్స్ లతో విజయాన్ని అందించగానే కెప్టెన్ విరాట్ కోహ్లీతో సహా భారత క్రికెటర్లు మైదానంలోకి పరుగులు తీశారు. మ్యాచ్ మాత్రమే కాకుండా సూపర్ ఓవరు కూడా ఉత్కంఠభరితంగా సాగింది. మొత్తంగా, కేన్ విలియమ్సన్ ను దురదృష్టం వెంటాడింది.

click me!