దంచుడే దంచుడు! తొలి టెస్టులో ఇంగ్లాండ్ రికార్డుల మోత... రెండో రోజు కమ్‌బ్యాక్ ఇచ్చిన పాకిస్తాన్‌...

By Chinthakindhi RamuFirst Published Dec 2, 2022, 1:14 PM IST
Highlights

తొలి ఇన్నింగ్స్‌లో 657 పరుగులకి ఆలౌట్ అయిన ఇంగ్లాండ్... సెంచరీలు బాదుకున్న నలుగురు ఇంగ్లాండ్ బ్యాటర్లు... బ్యాటర్లపైనే భారం వేసిన పాకిస్తాన్... 

పాక్ పర్యటనలో తొలి టెస్టును ఇంగ్లాండ్ ఘనంగా ప్రారంభించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లాండ్ జట్టు, తొలి ఇన్నింగ్స్‌లో 101 ఓవర్లలో 657 పరుగులు చేసి ఆలౌట్ అయ్యింది. బ్యాటింగ్‌కి అద్భుతంగా అనుకూలిస్తున్న ఫ్లాట్ పిచ్‌పై ఇంగ్లాండ్ బ్యాటర్లు చెలరేగిపోయారు...

జాక్ క్రావ్లే 111 బంతుల్లో 21 ఫోర్లతో 122 పరుగులు చేయగా డక్లెట్ 110 బంతుల్లో 15 ఫోర్లతో 107 పరుగులు చేశారు. ఇద్దరూ తొలి వికెట్‌కి 233 పరుగుల భారీ భాగస్వామ్యం నెలకొల్పారు. అయితే సెంచరీలు పూర్తి చేసుకున్న వెంటవెంటనే అవుట్ అయ్యారు డక్లెట్,క్రావ్లే. వన్‌డౌన్‌లో వచ్చిన ఓల్వీపోప్ 104 బంతుల్లో 14 ఫోర్లతో 108 పరుగులు చేశాడు.

గత ఏడాది రికార్డు లెవెల్లో సెంచరీల మోత మోగించిన జో రూట్ 31 బంతుల్లో 3ఫోర్లతో 23 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. అయితే ఐదో స్థానంలో బ్యాటింగ్‌కి వచ్చిన హారీ బ్రూక్ 116 బంతుల్లో 19 ఫోర్లు, 5 సిక్సర్లతో 153 పరుగులు చేసి ఇంగ్లాండ్ ఇన్నింగ్స్‌లో టాప్ స్కోరర్‌గా నిలిచాడు...  హారీ బ్రూక్, ఓల్లీ పోప్ కలిసి నాలుగో వికెట్‌కి 176 పరుగుల భారీ భాగస్వామ్యం నమోదు చేశారు. 

తొలి రోజు ఆటలో ఒకే ఓవర్‌లో ఆరుకి ఆరు ఫోర్లు బాది 24 పరుగులు రాబట్టిన హారీ బ్రూక్,  రెండో రోజు 6, 4, 4, 4, 6, 3 పరుగులు చేసి 27 పరుగులు రాబట్టి రికార్డులు క్రియేట్ చేశాడు. 

కెప్టెన్ బెన్ స్టోక్స్ 18 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సర్లతో 41 పరుగులు చేసి నసీం షా బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు. 576 పరుగుల వద్ద ఏడో వికెట్ కోల్పోయింది ఇంగ్లాండ్. ఈదశలో విల్ జాక్స్, ఓల్లీ రాబిన్‌సన్ కలిసి 8వ వికెట్‌కి 65 పరుగులు జోడించారు. 29 బంతుల్లో 4 ఫోర్లతో 30 పరుగులు చేసిన విల్ జాక్స్‌ని మహ్మద్ ఆలీ అవుట్ చేయగా51 బంతుల్లో 3ఫోర్లు, ఓ సిక్సర్‌తో 37 పరుగులు చేసిన ఓల్లీ రాబిన్‌సన్,జహీద్ మహమూద్ బౌలింగ్‌లో పెవిలియన్ చేరాడు...

జేమ్స్ అండర్సన్ 6 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. 101 ఓవర్లలో 6.5 రన్ రేటుతో పరుగులు చేసిన ఇంగ్లాండ్ జట్టు, టెస్టు మ్యాచ్ ఇన్నింగ్స్‌లో 6+ రన్ రేట్‌తో పరుగులు చేసిన జట్టుగా రికార్డు క్రియేట్ చేసింది. తొలి రోజు 4 వికెట్లు మాత్రమే పడగొట్టి 506 పరుగులు సమర్పించిన పాక్ బౌలర్లు, రెండో రోజు మంచి కమ్‌బ్యాక్ ఇవ్వగలిగారు. మిడిల్ ఆర్డర్‌తో పాటు లోయర్ ఆర్డర్‌కి స్వల్ప స్కోర్లకే పెవిలియన్ చేర్చగలిగారు. రెండో రోజు 151 పరుగులు మాత్రమే చేసి మిగిలిన ఆరు వికెట్లు కోల్పోయింది ఇంగ్లాండ్.. 

click me!