కివీస్ పై ఓటమి: కోహ్లీ సేనపై నిప్పులు చెరిగిన కపిల్ దేవ్

By telugu teamFirst Published Feb 25, 2020, 3:03 PM IST
Highlights

కివీస్ పై చెత్త ప్రదర్శన చేస్తున్న టీమిండియాపై మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ నిప్పులు చెరిగారు. కేఎల్ రాహుల్ ను జట్టులోకి తీసుకోకపోవడంపై ఆయన ఆశ్చర్యం వ్యక్తం చేశారు ప్రణాళిక, వ్యూహం ఏదీ లేదని మండిపడ్డారు.

న్యూఢిల్లీ: న్యూజిలాండ్ పర్యటనలో టీమిండియా ప్రదర్శనపై మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. బేసిన రిజర్వ్ లో న్యూజిలాండ్ టీమిండియాపై 10 వికెట్ల తేడాతో విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కపిల్ దేవ్ భారత ఆటగాళ్లపై తీవ్రంగా మండిపడ్డారు. 

న్యూజిలాండ్ ను ప్రశంసించాల్సిందేనని, వాళ్లు మంచి క్రికెట్ ఆడుతున్నారని, మూడు వన్డేల్లోనూ తొలి టెస్టు మ్యాచులోనూ వాళ్లు అద్భుతంగా ఆడారని ఆయన అన్నారు. మ్యాచ్ ను విమర్శనాత్మకంగా విశ్లేషిస్తే అన్ని మార్పులు ఎలా చేస్తారో అర్థం కావడం లేదని, ప్రతి మ్యాచులోనూ కొత్త జట్టు ఉంటోందని, జట్టులో ఎవరు కూడా శాశ్వతంగా ఉండడం లేదని, అటగాడి స్థానంపై భద్రత లేదని, ఇది ఆటగాళ్ల ఫామ్ ను ప్రభావితం చేస్తుందని ఆయన టీమిండియాను ఉద్దేశించి అన్నారు. 

విరాట్ కోహ్లీ, ఛతేశ్వర్ పుజారా, అజింక్యా రహానే వంటి మేటి ఆటగాళ్లున్నారు. వారెవరు కూడా అంతగా రాణించడం లేదు. బ్యాటింగ్ ఆర్డర్ లో ఆ విధమైన పెద్ద పేర్లున్నాయని, రెండు ఇన్నింగ్సుల్లో కలిపి 200 పరుగులు కూడా చేయలేకపోతే  పరిస్థితులను అధిగమించలేకపోతున్నారని అనుకోవాలని, ప్రణాళికపై వ్యూహాలపై దృష్టి పెట్టాల్సి ఉంటుందని ఆయన అన్నారు. 

టెస్టు జట్టులోకి కేఎల్ రాహుల్ ను తీసుకోకపోవడంపై ఆయన ఆశ్చర్యం వ్యక్తం చేశారు. తనకేమీ అర్థం కావడం లేదని, నువ్వేమీ ఆడావు... ఏం జరుగుతుందనే వాటికి మధ్య చాలా తేడా ఉంటుందని ఆయన అన్నారు. జట్టును పటిష్టం చేయాలనుకుంటే ఆటగాళ్లకు విశ్వాసం కలిగించాలని, మార్పులు ఎక్కువగా చేస్తున్నప్పుడు దానికి అర్థం ఉండదని ఆయన అన్నారు. 

ఫార్మాట్ స్పెసిఫిక్ ప్లేయర్స్ పై మేనేజ్ మెంట్ విశ్వాసం పెడుతోందని, రాహుల్ గొప్ప ఆటగాడైనా బయట కూర్చుంటున్నాడంటే అందులో అర్థం లేదని కపిల్ దేవ్ అన్నారు. ఆటగాడు ఫామ్ లో ఉన్నప్పుడు అతనితో ఆడించాలని ఆయన అన్నాడు.

click me!