చైనాలో విధించిన కఠినమైన లాక్ డౌన్ వల్ల ఎంతో మంది ఇబ్బంది పడుతున్నారు. చైనాలో ప్రధాన ఆర్థిక నగరమైన షాంఘైలో దాదాపు 28 మిలియన్ల ప్రజలు ఆహారం, ఇతర కనీస వస్తువుల కోసం అవస్థలు పడుతున్నారు.
కఠినమైన కోవిడ్-19 లాక్‌డౌన్ కారణంగా చైనాలోని ప్రధాన ఆర్థిక కేంద్రమైన షాంఘైలో సూపర్ మార్కెట్‌లను మూసివేశారు. అయితే కేవలం హోమ్ డెలివరీలకు మాత్రమే పరిమితం చేశారు. దీంతో షాంఘైలోని 26 మిలియన్లకు పైగా ప్రజలు ఆహారం, సరుకుల కోసం తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు.
ఈ నగరంలో ప్రస్తుతం అత్యధిక స్థాయిలో కరోనా వైరస్ కేసులు నమోదు అవుతున్నాయి. దీంతో ఆ నగర అధికార యంత్రాంగం లాక్ డౌన్ విధించింది. అయితే అక్కడి అధికారులు బుధవారం (ఏప్రిల్ 6, 2022) ఓ ప్రకటన విడుదల చేశారు. సిటీవైడ్ కోవిడ్-19 టెస్టింగ్ ప్రోగ్రామ్ పూర్తయ్యే వరకు ఆంక్షలను ఎత్తివేయబోమని తెలిపారు.
undefined
దాదాపుగా అన్ని రకాల కార్యకలాపాలు రెండు వారాలుగా లాక్ డౌన్ లోనే ఉన్నాయి. దీంతో ఆయా ప్రాంతాల్లో నివసించే ప్రజలకు పరీక్షలు, ఆహారం, ఇతర అవసరాలు సరిగా లభించడం లేదు. దీంతో ఇక్కడి ప్రజలు తీవ్రంగా విసుగు చెందుతున్నారు. చాలా మందికి కోవిడ్ -19 కేసుల్లో లక్షణాలు లేవు. అయితే వారిని కూడా ఇంట్లో నిర్భంధంగా ఉంచాలని అధికారులు సూచించారు. అలాగే కరోనా వైరస్ సోకిన పిల్లలను వారి తల్లిదండ్రుల నుంచి వేరు చేయాలని నిర్ణయించారు. అయితే ఈ రెండు నిర్ణయాలు ఆందోళన రేకెత్తించాయి.
రెండు సంవత్సరాల క్రితం మహమ్మారి చెలరేగినప్పటి నుంచి ఇప్పుడు షాంఘైలో కేసులు అధికంగా ఉన్నాయని ఆ నగర ఆరోగ్య కమిషన్ అధికారి వు కియాన్యు బుధవారం తెలిపారు. షాంఘై వాణిజ్య కమిషన్ వైస్-హెడ్ లియు మిన్ మాట్లాడుతూ.. అధికారులు అడ్డంకులను పరిష్కరించడానికి, జనాభా ప్రాథమిక జీవన అవసరాలను తీర్చడానికి తీవ్రంగా కృషి చేస్తున్నారని చెప్పారు. ఇతర ప్రావిన్సుల నుండి షాంఘైకి ఆహారం, ఇతర అవసరాలను రవాణా చేయడానికి ప్రయత్నాలు జరుగుతాయని చెప్పారు. కూరగాయల సరఫరాను మెరుగుపర్చేందుకు నగరం, చుట్టుపక్కల అత్యవసర సరఫరా స్టేషన్లను కూడా నిర్మిస్తామని చెప్పారు.
అయితే ఇళ్లకు డెలివరీలు చేయడమే అతిపెద్ద సవాలుగా మారిందని ఆమె తెలిపారు. నగరంలోని ప్రధాన ఇ-కామర్స్ ప్లాట్‌ఫారమ్‌ల కోసం పనిచేస్తున్న 11,000 మంది రైడర్‌లు రోజువారీ కోవిడ్ -19 నెగిటివ్ పరీక్ష ఫలితాలను సమర్పించినట్లయితే వారు పనికి వెళ్లవచ్చని లియు మిన్ తెలిపారు. షాంఘై డెలివరీ సామర్థ్యాన్ని పెంచేందుకు కృషి చేస్తుందని చెప్పారు.
షాంఘై నగరం మంగళవారం రికార్డు స్థాయిలో 16,766 కొత్త అసింప్టోమాటిక్ కరోనా వైరస్ కేసులను చూసింది. దాని కంటే ముందు రోజు 13,086 కేసులు ఉన్నాయి. లక్షణాలున్న కేసులు కూడా బాగానే పెరిగాయి. అంతకు ముందు రోజు 268 కేసులు ఉండగా.. ఇప్పుడవి 311కి పెరిగాయి.
చైనా దేశవ్యాప్తంగా ఏప్రిల్ 5వ తేదీ నాటికి 1,415 కొత్త కోవిడ్ -19 కేసులు నమోదు అయ్యాయి. దాని కంటే ముందు రోజు 1,235 కోవిడ్ -19 కేసులు ఉన్నాయి. కొత్త లక్షణ రహిత కేసుల సంఖ్య చైనాలో విడిగా లెక్కిస్తున్నారు. ఈ కేసులు ఏప్రిల్ 4వ తేదీన చైనా వ్యాప్తంగా 15,355 గా నమోదు అవ్వగా.. మరుసటి రోజు 19,199 కేసులు నమోదయ్యాయి. ఇదిలా ఉండగా చైనా విధించిన ఈ కఠినమైన లాక్ డౌన్ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపుతుందని విశ్లేషకులు చెబుతున్నారు. ప్రస్తుతం చైనా అంతటా దాదాపు 200 మిలియన్ల మంది ప్రజలు ఒక విధమైన లాక్‌డౌన్‌లో ఉన్నారు.