కోవిషీల్డ్ రెండు డోసుల మధ్య వ్యవధిని 8-16 వారాలకు తగ్గించండి - ఎన్‌టీఏజీఐ సిఫార్సు

By team telugu  |  First Published Mar 21, 2022, 3:36 PM IST

పలు దేశాల్లో కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో రిస్క్ ఎక్కువగా ఉండే వారికి వీలైనంత తొందరగా బూస్టర్ డోసులు అందించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ క్రమంలోనే కోవిషీల్డ్ రెండు డోసులకు మధ్య ఉన్న వ్యవధిని తగ్గించాలని ఎన్‌టీఏజీఐ సిఫార్సు చేసింది. 


కోవిషీల్డ్ (Covishield) వ్యాక్సిన్ రెండు మోతాదుల మధ్య అంతరాన్ని 12-16 వారాల నుండి 8-16 వారాలకు తగ్గించాలని ఇమ్యునైజేషన్‌పై నేషనల్ టెక్నికల్ అడ్వైజరీ గ్రూప్ (NTAGI) ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. అయితే ఈ సిఫార్సుల‌పై ప్రభుత్వం ఇంకా ఎలాంటి నిర్ణ‌యం తీసుకోలేద‌ని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వర్గాలు తెలిపాయి. ఈ విష‌యంలో త్వ‌రలోనే నిర్ణ‌యం వెలువ‌డుతుంద‌ని అధికారులు తెలిపారు. 

గత ఏడాది మే 13వ తేదీన యునైటెడ్ కింగ్‌డమ్ (United Kingdom) నుంచి వ‌చ్చిన రియ‌ల్ లైఫ్ ఎవిడెన్స్ ప్ర‌కారం Covishield వ్యాక్సిన్ రెండు డోసుల మ‌ధ్య విరామాన్ని కేంద్రం 12-16 వారాలకు పెంచింది. అంతకు ముందు కోవిషీల్డ్ రెండు డోసుల మ‌ధ్య వ్య‌వ‌ధి 6-8 వారాలుగా ఉండేది. 

Latest Videos

undefined

ప్ర‌స్తుతం ప‌లు దేశాల్లో మ‌ళ్లీ క‌రోనా కేసులు పెరుగుతున్నాయి. దీంతో కేంద్ర ప్ర‌భుత్వం అప్ర‌మ‌త్త‌మైంది. ఈ నేప‌థ్యంలో 60 ఏళ్లు పైబ‌డిన వృద్ధుల‌కు, ఆరోగ్య సంరక్షణ అధికారులు, ఫ్రంట్‌లైన్ వర్కర్లు, ధీర్ఘకాలిక వ్యాధుల‌తో బాధ‌ప‌డేవారికి బూస్ట‌ర్ డోసు (booster dose) వేయాల‌ని ప్ర‌భుత్వం భావిస్తోంది. ఈ నేప‌థ్యంలో ఎక్కువ మంది ల‌బ్దిదారుల‌కు ఈ డోసు చేరాల‌నే ఉద్దేశంతో కోవిడ్-19 వర్కింగ్ గ్రూప్ ఈ వ్య‌వ‌ధి త‌గ్గించాల‌ని సిఫార్సు చేసింది. గ‌తంలో నిర్దేశించిన విధంగా మొదటి రెండు డోస్‌ల మ‌ధ్య లాంగ్ గ్యాప్ కార‌ణంగా  ఇప్పటి వ‌ర‌కు 2.17 కోట్ల మంది లబ్ధిదారులకు మాత్రమే ముందుజాగ్రత్తగా మూడో డోస్‌ను అందించారు. కాగా కోవిషీల్డ్ యొక్క రెండు డోస్‌ల మధ్య గ్యాప్‌ని 8-16 వారాలకు తగ్గించడం వల్ల తొంద‌ర‌గా ఎక్కువ మందికి ఈ డోసును అంద‌జేయ‌వ‌చ్చు. 

ఇదిలా ఉండ‌గా.. 60 సంవత్సరాల కంటే త‌క్కువ వ‌య‌స్సు ఉన్న జ‌నాభా కు కూడా మూడో డోసు ఇచ్చే విష‌యంలో శాస్త్రీయ ఆధారాలపై NTAGI ప్రస్తుతం చ‌ర్చిస్తోంది. త్వ‌రలోనే ఈ నిర్ణ‌యం కూడా వెలువ‌డే అవ‌కాశం ఉంది. కాగా గత వారం నుంచి ఆసియా, ఐరోపాలోని కొన్ని ప్రాంతాలలో కేసుల పెరుగ‌ద‌ల క‌నిపిస్తోంది. ఈ నేప‌థ్యంలో కోవిడ్ -19 క‌ట్ట‌డి విష‌యంలో జాగ్ర‌త్త‌గా వ్య‌వ‌హ‌రించాల‌ని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ రాష్ట్రాలను కోరింది.

కేంద్ర ఆరోగ్య కార్యదర్శి రాజేష్ భూషణ్ (Union Health Secretary Rajesh Bhushan) అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు ఇటీవ‌లే లేఖ రాశారు. కోవిడ్ నియంత్ర‌ణ కోసం ఐదు ద‌శల వ్యూహాన్ని అనుస‌రించాల‌ని సూచించారు. ‘టెస్ట్, ట్రాక్, ట్రీట్, వ్యాక్సినేట్, COVID-19 ప్రవర్తన’ అనే ఐదు దశల వ్యూహానికి కట్టుబడి ఉండాలని చెప్పారు. కొత్త వేరియంట్‌లను సకాలంలో గుర్తించేలా త‌గిన‌న్ని శాంపిల్స్‌ను ప‌రీక్షించాలే చూడాల‌ని చెప్పారు. కోవిడ్ -19 వ్యాక్సిన్ లు ప్ర‌తీ ఒక్క‌రూ వేసుకునేలా ప్రోత్స‌హించాల‌ని సూచించారు. 

ఇదిలా ఉండ‌గా గ‌డిచిన 24 గంట‌ల్లో 1,549 కొత్త క‌రోనా కేసులు న‌మోదు అయ్యాయి. దీంతో మొత్తం కేసులు సంఖ్య 4,30,09,390కి చేరుకుంది. అయితే యాక్టివ్ కేసుల సంఖ్య 25,106కి తగ్గాయి. దేశ వ్యాప్తంగా ఇప్ప‌టి వ‌ర‌కు ప్ర‌జ‌ల‌కు 181.24 కోట్ల డోసులు  అంద‌జేశారు.

click me!