కరోనా వైరస్ మహమ్మారి ప్రపంచాన్ని, ఆర్థిక వ్యవస్థను వణికిస్తున్న తరుణంలో పుత్తడి ధరలు సరికొత్త రికార్డులు నెలకొల్పాయి. బుధవారం ఇంట్రా ట్రేడింగ్‌లో రూ.45,724 వద్దకు చేరుకుంది. ప్రభుత్వం ప్రకటిస్తున్న ప్యాకేజీలు కూడా పసిడి ధర పెరుగుదలకు కారణమని భావిస్తున్నారు.
న్యూఢిల్లీ: భారతదేశ బులియన్ మార్కెట్‌లో పసిడి ధరలు సరికొత్త రికార్డు నెలకొల్పాయి. బుధవారం ఇంట్రా డే ట్రేడింగ్‌లో 10 గ్రాముల బంగారం రూ.2,000 మేర పెరిగింది. దీంతో ఫ్యూచర్ మార్కెట్‌లో 10 గ్రాముల బంగారం ధర రూ.45,724 వద్ద సరికొత్త గరిష్ట స్థాయి నమోదు చేసింది.
ఎంసీఎక్స్‌లో జూన్ ఫ్యూచర్స్ ఇటీవల ట్రేడ్‌లో 3.5 శాతం పెరిగి రూ.45,269కు ఎగిసిన సంగతి తెలిసిందే. సిల్వర్ ఫ్యూచర్స్ కూడా ఎంసీఎక్స్‌లో 5 శాతం పెరిగి కేజీకి రూ.43,345 వద్ద నమోదైంది. డాలర్ బలపడుతుండటంతో, గ్లోబల్ మార్కెట్లలో మాత్రం గోల్డ్ స్వల్పంగా తగ్గి ఔన్స్ కు 1,657.67 డాలర్ల వద్ద ట్రేడైంది.
గత సెషన్‌తో పోలిస్తే గ్లోబల్ మార్కెట్‌లో పసిడి ధర మూడు శాతం పెరిగింది. కరోనా వైరస్ మరణాలు తగ్గుతున్న సంకేతాలతో వాల్ స్ట్రీట్ లో రాత్రికి రాత్రే ర్యాలీ చోటు చేసుకుంది.
దీంతో అన్ని ఆసియా ఈక్విటీ మార్కెట్లు పెరిగాయి. ఈటీఎఫ్‌ల్లోకి స్ట్రాంగ్ ఇన్‌ఫ్లోలు గోల్డ్ ధరలకు సపోర్ట్ ఇస్తున్నాయి. ప్రపంచంలో అతిపెద్ద గోల్డ్ బ్యాక్ట్ ఎక్సేంజ్ ట్రేడెడ్ ఫండ్ ఎస్‌పీడీఆర్ గోల్డ్ ట్రస్ట్‌లో హోల్డింగ్స్0.54 శాతం పెరిగి 984.24 టన్నులకు చేరుకున్నాయి.
also read ఇండియా లాక్ డౌన్ లో లాభపడ్డది ఈయన ఒక్కడే...
వివిధ దేశాల ప్రభుత్వాలు అమలు చేస్తున్న ఉద్దీపన పథకాలతోపాటు కేంద్రీయ బ్యాంకుల చర్యలు పసిడి ధరలకు మద్దతుగా నిలుస్తున్నాయి. అమెరికా ఫెడరల్ రిజర్వ్ సోమవారం నుంచి చిన్న వ్యాపారాలకు లెండింగ్ ఇచ్చేందుకు ఒక ప్రొగ్రామ్ ప్రకటించింది.
అలాగే జపాన్ కూడా ఆర్థిక ఉద్దీపన ప్యాకేజీ ప్రకటించింది. కరోనా వైరస్ వెలుగు చూసినప్పటి నుంచి పసిడి ధరలు పెరుగుతున్న సంగతి తెలిసిందే. మరోవైపు కరోనా కారణంతో పలుదేశాల్లో లాక్‌డౌన్ కొనసాగుతుండటం కూడా ఫిజికల్ డిమాండ్‌పై ప్రభావం చూపుతోంది.
గత నెలలో భారతదేశ పసిడి దిగుమతులు ఆరేళ్ల కనిష్టానికి పతనం అయ్యాయి. ఒకవైపు ధరలు రికార్డుస్థాయికి చేరగా, మరోవైపు దిగుమతులు పడిపోయాయి. లాక్‌డౌన్ పసిడి రిటైల్ డిమాండ్‌ను దెబ్బ తీస్తుందని బులియన్ మార్కెట్ వర్గాలు తెలిపాయి.