వీడియో కాన్ఫరెన్స్‌లో జియో మీట్‌తో ప్రత్యర్థులకు షాక్...

By Sandra Ashok Kumar  |  First Published May 2, 2020, 11:52 AM IST

కరోనా ‘లాక్ డౌన్’ వేళ వీడియో యాప్‌లకు ఫుల్ గిరాకీ ఏర్పడింది. ఇప్పటికే జూమ్, గూగుల్ మీట్, ఫేస్ బుక్ మెసేంజర్ యాప్‌లు ముందుకొచ్చాయి. వీటికి పోటీగా రిలయన్స్ జియో.. ‘జియో మీట్’ అనే యాప్ అందుబాటులోకి తీసుకొచ్చింది.


ముంబై: దేశీయ టెలికం రంగంలో సంచలనం రేపిన రిలయన్స్ జియో మరో సంచలనానికి నాంది పలికింది. దేశవ్యాప్తంగా కరోనా వైరస్‌ను నియంత్రించడానికి విధించిన లాక్‌డౌన్‌ పరిస్థితులను సొమ్ము చేసుకునేందుకు కొత్త  వీడియో కాన్ఫరెన్స్ యాప్‌ను ఆవిష్కరించింది. 

రిలయన్స్ జియో తన ప్లాట్ ఫాం మీద జియో మీట్‌ అనే వీడియో కాన్ఫరెన్సింగ్ యాప్‌ను ప్రారంభించింది. తద్వారా ప్రస్తుత లాక్‌డౌన్ పరిస్థితుల్లో అత్యవసరంగా మారిన వీడియో-కాన్ఫరెన్సింగ్ సేవల్లోకి ప్రవేశించింది. అంతేకాదు రంగంలో దూసుకుపోతున్న జూమ్, గూగుల్ మీట్, హౌస్‌పార్టీ వంటి యాప్‌లకు గట్టి షాకే ఇచ్చింది.

Latest Videos

రిలయన్స్ ఇండస్ట్రీస్ త్రైమాసిక ఫలితాల సందర్బంగా జియోమీట్‌ను ప్రారంభించనున్నట్లు గురువారం తెలిపింది. జియో మీట్ చాలా ప్రత్యేకతను కలిగి ఉందని, ఇది ఏ పరికరంలోనైనా, ఏ ఆపరేటింగ్ సిస్టమ్‌‌లోనైనా పని చేయగల సామర్థ్యాన్ని కలిగి ఉందని రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ సీనియర్ ఉపాధ్యక్షుడు పంకజ్ పవార్ వెల్లడించారు. 

జియోమీట్‌ను స్మార్ట్‌ఫోన్, ట్యాబ్లెట్, ల్యాప్‌టాప్, డెస్క్‌టాప్ ఇలా ఏ యాప్‌లో అయినా యాక్సెస్ చేయొచ్చు. ఈ యాప్‌ను సెర్చింజన్ గూగుల్ ప్లే స్టోర్, ఆపిల్ స్టోర్‌లో డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. మైక్రోసాఫ్ట్ విండోస్ మార్కెట్‌ప్లేస్‌ నుంచి, మ్యాక్ యాప్ స్టోర్ నుంచి కూడా జియోమీట్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

జియో మీట్ యాప్ వీడియో కాన్ఫరెన్సింగ్‌కు మాత్రమే పరిమితం కాదు. జియో ఈ-హెల్త్, ఈ-ఎడ్యుకేషన్ వంటి ఇతర ప్లాట్‌ఫామ్‌లతో రిలయన్స్ జియో దీన్ని అనుసంధానించింది. దీని ద్వారా వినియోగదారులు వర్చ్యువల్ గా వైద్యులను సంప్రదించడానికి, ప్రిస్క్రిప్షన్లను పొందడానికి, మందులను ఆర్డర్లు ఇవ్వడానికి  ఉపయోపడుతుంది.

దీంతోపాటు డిజిటల్ వెయిటింగ్ రూమ్‌లను ప్రారంభించడానికి వైద్యులకు జియో మీట్ అనుమతిస్తుంది. ఇంకా వర్చువల్ తరగతి గదులు, రికార్డ్ సెషన్లు, హోంవర్క్‌లు, పరీక్షల నిర్వహణ వాటికోసం ఈ-ఎడ్యుకేషన్ ప్లాట్‌ఫాం సహాయపడుతుంది. తమ జియో మీట్ బహుళ ప్లాట్‌ఫామ్‌లను ఏకీకృతం చేస్తుందనీ, నావిగేట్ చేయడం  కూడా చాలా సులభం కనుక దీన్ని ప్రతి ఒక్కరూ ఉపయోగించుకోవచ్చని పవార్ చెప్పారు. 

ఫ్రీప్లాన్‌లో ఐదుగురు వినియోగదారులు, బిజినెస్‌ ప్లాన్‌లో 100 మంది యూజర్ల వరకు జియో మీట్‌ను ఉపయోగించుకునే అవకాశాన్ని కల్పించనుంది. జియో వెబ్‌సైట్‌ వెల్లడించిన సమాచారం ప్రకారం గ్రూప్ కాలింగ్‌ ద్వారా ఒకేసారి 100 మంది పాల్గొనే అవకాశం ఉండనున్నది.

జూమ్ యాప్ ప్రస్తుతం 40 నిమిషాల వ్యవధిలో 100 మంది పాల్గొనే అవకాశాన్ని ఉచితంగా అందిస్తోంది. అయితే ప్రస్తుతానికి జియోమీట్ వెబ్‌సైట్‌లోని అన్ని వివరాలను తొలగించింది. పూర్తి వివరాలను వెల్లడించలేదు. 

కాగా కరోనాతో దాదాపు అన్ని కంపెనీలు తమ ఉద్యోగులను ఇంటినుంచి పని చేయడానికి అనుమతినిచ్చాయి. వీడియో సమావేశాలతో పనులు చక్కబెట్టుకుంటున్నాయి. అలాగే విద్యాసంస్థలు కూడా వీడియో-కాన్ఫరెన్సింగ్, ఆన్ లైన్ పాఠాల వైపు మళ్లాయి.

దీనితో గూగుల్, మైక్రోసాఫ్ట్ , జూమ్ వంటి సంస్థల వీడియో కాన్ఫరెన్స్ యాప్‌లకు ఆదరణ భారీగా పెరిగింది. అయితే జూమ్ యాప్ సెక్యూరిటీ పై సందేహాలను వ్యక్తి చేసిన కేంద్రం ఈ యాప్‌ను సాధ్యమైనంతవరకు వినియోగించవద్దని ఇటీవల సూచించిన సంగతి తెలిసిందే. 
 

click me!