తెలంగాణలోని గ్రామాల్లో సర్పంచ్ లు యాక్టివ్ అయ్యారు. తమ గ్రామంలోకి ఎవరూ రాకుండా ముళ్ల కంచెలు వేసి కాపు కాస్తున్న సర్పంచ్ ఉడుత అఖిల యాదవ్ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
చింతపల్లి: లాక్‌డౌన్‌లో రాష్ట్ర స్థాయి నుంచి గ్రామస్థాయి వరకు ప్రతి ప్రజాప్రతినిధి భాగస్వామి కావాలని తెలంగాణ సీఎం కేసీఆర్ పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో నల్లగొండ జిల్లా చింతపల్లి మండలం మదనాపురం గ్రామ సర్పంచ్ ఉడుత అఖిల యాదవ్ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు. రోడ్డుకు అడ్డంగా ముళ్ల కంచె వేసి గ్రామంలోకి ఎవరూ రాకుండా, గ్రామం నుంచి ఎవరూ బయటకు వెళ్లకుండా కాపు కాశారు.
ముఖానికి అడ్డుగా వస్త్రం కట్టుకుని.. కర్ర చేతపట్టుకొని నిల్చున్న ఆమె ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తెలంగాణలోనే అతిపిన్న వయస్కురాలైన సర్పంచ్‌గా ఉడుత అఖిల యాదవ్‌కు రికార్డులకెక్కారు. సీఎం కేసీఆర్ ఆదేశాలను తు.చ. తప్పకుండా పాటిస్తూ.. గ్రామంలోకి కరోనా మహమ్మారి రాకుండా అడ్డుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. అందరికీ స్ఫూర్తిగా నిలుస్తున్నారు.
తెలంగాణలో ఏ గ్రామానికి వెళ్లినా ఇదే పరిస్థితి కనపడుతోంది. ఏ ఊరికి ఆ ఊరు సరిహద్దులను మూసేసి.. బయటవారిని లోనికి రాకుండా చేస్తున్నారు. కరోనా వ్యాప్తి చెందకుండా ఎవరికి వారు జాగ్రత్త పడుతున్నారు. ఊరి ముఖ ద్వారం దగ్గర ముళ్ల కంచెలను అడ్డుగా వేస్తున్నారు. ‘మా ఊరికి మీరు రావొద్దు.. మీ ఊరికి మేము రాము’ అంటూ కొత్త నినాదాన్ని అందిపుచ్చుకున్నారు.
తెలంగాణలో మరో రెండు కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ముూడేళ్ల బాలుడికి, ఓ మహిళకు బుధవారం కోవిడ్ 19 నిర్దారణ అయింది. దాంతో రాష్ట్రంలో కరోనా వైరస్ సోకినవారి సంఖ్య 41కి చేరుకుంది.
హైదరాబాదులోని గోల్కొడ ప్రాంతానికి చెందిన ఓ కుటుంబం బాలుడితో సహా సౌదీ అరేబియా వెళ్లి వచ్చింది. బాలుడికి జలుబు, దగ్గు లక్షణాలు కనిపించడంతో ఆస్పత్రిలో చేర్చారు. అతనికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. ఆ బాలుడి తల్లిదండ్రులను కూడా ఆస్పత్రిలో చేర్చారు. వారికి గురువారం పరీక్షలు చేస్తారు.
కొద్ది రోజుల క్రితం లండన్ నుంచి హైదరాబాదు వచ్చిన రంగారెడ్డి జిల్లా కోకాపేటకు చెెందిన వ్యక్తి (49)కి కరోనా నిర్ధారణ అయింది. ఆయన భార్యకు (43) వైరస్ సోకినట్లు బుధవారం తేలింది. ఈమెతో కలిపి రాష్టర్ంలో ఇప్పటి వరకు రెండో దశ వైరస్ వ్యాప్తిలో ఆరు కేసులు నమోదయ్యాయి.