తెలంగాణలో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య 41కి చేరుకుంది. హైదరాబాదులో మూడేళ్ల బాలుడికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. బాలుడికి చెందిన కుటుంబ సభ్యులు ఇటీవలే సౌదీ అరేబియా వెళ్లి వచ్చారు.
హైదరాబాద్: తెలంగాణలో మరో రెండు కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ముూడేళ్ల బాలుడికి, ఓ మహిళకు బుధవారం కోవిడ్ 19 నిర్దారణ అయింది. దాంతో రాష్ట్రంలో కరోనా వైరస్ సోకినవారి సంఖ్య 41కి చేరుకుంది.
హైదరాబాదులోని గోల్కొడ ప్రాంతానికి చెందిన ఓ కుటుంబం బాలుడితో సహా సౌదీ అరేబియా వెళ్లి వచ్చింది. బాలుడికి జలుబు, దగ్గు లక్షణాలు కనిపించడంతో ఆస్పత్రిలో చేర్చారు. అతనికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. ఆ బాలుడి తల్లిదండ్రులను కూడా ఆస్పత్రిలో చేర్చారు. వారికి గురువారం పరీక్షలు చేస్తారు.
కొద్ది రోజుల క్రితం లండన్ నుంచి హైదరాబాదు వచ్చిన రంగారెడ్డి జిల్లా కోకాపేటకు చెెందిన వ్యక్తి (49)కి కరోనా నిర్ధారణ అయింది. ఆయన భార్యకు (43) వైరస్ సోకినట్లు బుధవారం తేలింది. ఈమెతో కలిపి రాష్టర్ంలో ఇప్పటి వరకు రెండో దశ వైరస్ వ్యాప్తిలో ఆరు కేసులు నమోదయ్యాయి.
వారిలో ముగ్గురు మహిళలు. మొత్తం 40 మంది హైదరాబాదులో చికిత్స పొందుతున్నారు. వారి ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు తెలుస్తోంది. కొత్తగూడెం డీఎస్పీ నిర్వాకం వల్ల ముగ్గురు కరోనా వైరస్ బారిన పడిన విషయం తెలిసిందే. డీఎస్పీకి, ఆయన కుమారుడికి, ఆయన ఇంటి పనిమనిషికి కరోనా నిర్ధారణ అయింది.