కోటి రూపాయల నగదు తరలిస్తూ కరీంనగర్ కు చెందిన ఓ బీజేపీ కార్పొరేటర్ భర్త పట్టుబడ్డాడు. ఆ డబ్బును వివేక్ వెంకటస్వామి ఆదేశాల మేరకే తరలిస్తున్నట్లు చెప్పాడు.
హైదరాబాద్ : ఉప ఎన్నిక జరుగుతున్న మునుగోడు నియోజకవర్గంలో సోమవారం ఉదయం వాహనాల తనిఖీలో కరీంనగర్ బీజేపీ కార్పొరేటర్ భర్త నుంచి కోటి రూపాయల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నల్గొండ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కరీంనగర్ 13వ డివిజన్ కార్పొరేటర్ భర్త ఎస్.వేణు(48) మాట్లాడుతూ.. మాజీ ఎంపీ, బీజేపీ నేత వివేక్ వెంకటస్వామి ఆదేశాల మేరకు విజయవాడ నుంచి నగదు తీసుకువస్తున్నట్లు తెలిపారు.
నల్గొండ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మునుగోడు ఉపఎన్నికల నేపథ్యంలో వాహన తనిఖీల్లో భాగంగా చెలిమెడ ఎక్స్ రోడ్స్ వద్ద కారును అడ్డుకున్నారు. వివేక్ చెప్పడంతో విజయవాడకు చెందిన రాము వద్ద నగదు సేకరించి తీసుకువస్తున్నట్లు వేణు మాకు తెలిపారని పోలీసులు అన్నారు. స్వాధీనం చేసుకున్న నగదును తదుపరి విచారణ కోసం ఆదాయపు పన్ను నోడల్ అధికారికి అందజేస్తామని నల్గొండ పోలీసులు తెలిపారు. ఈ నగదును ఎవరికి అందించాలనుకున్నారో తేలాల్సి ఉంది.
undefined
నల్గొండ పోలీసులు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి నియోజక వర్గంలో విస్తృతంగా తనిఖీలు చేస్తున్నారు. అక్రమ మద్యం, అక్రమ నగదులను అడ్డుకుంటున్నారు.
ఇదిలా ఉండగా, మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గంలో మంగళవారం నాడు రూ.19లక్షల నగదును పోలీసులు సీజ్ చేశారు. సోమవారం చల్మెడ వద్ద కోటి రూపాయాల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్న సంగతి తెలిసిందే. చెక్ పోస్టుల దగ్గర కాకుండా రోడ్లపై వెడుతున్న వాహనాలను కూడా పోలీసులు తనిఖీలు చేస్తున్నారు. ఈ సమయంలోనే ఈ నగదును పోలీసులు గుర్తించారు. మంగళవారం గట్టుప్పల్ సమీపంలోని ఓ కారులో రూ.19 లక్షల నగదును పోలీసులు సీజ్ చేశారు.
ఆ సమయంలో ఈ కారులో ఓ పార్టీకి చెందిన జెండాలను గుర్తించారు పోలీసులు. అయితే ఈ నగదు ఎక్కడిదనే విషయమై పోలీసులు ఆరా తీస్తున్నారు. కారులో నగదుతో పాటు ప్రయాణిస్తున్న ఓ వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతడిని ప్రశ్నిస్తున్నారు. స్వాధీనం చేసుకున్న నగదును పోలీసులు ట్రెజరీ కార్యాలయానికి తరలిస్తున్నారు.
ఇదిలా ఉంటే, ఎన్నికల షెడ్యూల్ విడుదలైన రోజునే సోదాల్లో పోలీసులు రూ.13 లక్షలను సీజ్ చేశారు. ఆ తర్వాత మునుగోడు మండలం రత్తుపల్లి దగ్గర రూ.6.50 లక్షలను స్వాధీనం చేసుకున్నారు. .ఈ నెల 7న గూడపూర్ దగ్గర రూ.79 లక్షలను సీజ్ చేశారు. వచ్చే నెల 3న మునుగోడు అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక జరగనుంది. మునుగోడు ఎమ్మెల్యే పదవికి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేయడంతో ఈ స్థానానికి ఉప ఎన్నిక అనివార్యంగా మారింది.
ఈ ఏడాది ఆగస్టు 8వ తేదీన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మునుగోడు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. అంతకు నాలగు రోజుల ముందే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. ఈ ఏడాది ఆగస్టు 21న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరారు. ఇక ఈ స్థానానికి కాంగ్రెస్ అభ్యర్ధిగా పాల్వాయి స్రవంతి, టీఆర్ఎస్ అభ్యర్ధిగా కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి పోటీ చేస్తున్నారు.