గత రెండు రోజులుగా నిత్యావసర సరుకులు లేక, తినటానికి తిండి లేక ఆకలితో అలమటిస్తుంటే అక్కడి చుట్టుపక్కల స్థానికులు చూసి పోలీసులకు తెలియజేశారు.
కరోనా వ్యాధి ప్రమాదం తీవ్రతతో దేశం మొత్తం ఎక్కడికక్కడ లాక్ డౌన్ కావటంతో ప్రజలంతా ఇళ్లకే పరిమితమయ్యారు. ఇప్పటికే దేశం మొత్తం స్తంభించిపోయింది. లాక్ డౌన్ తో దిగువ, మధ్య తరగతి ప్రజల పరిస్థితి ఎలా ఉన్నా పని చేస్తేనే కడుపు నిండే పేద వర్గాల పరిస్థితి కొంచెం కష్టంగానే ఉంది.
వాళ్లకు ఏ ఇబ్బంది కలగకుండా కేంద్ర, స్థానిక రాష్ట్ర ప్రభుత్వాలు చూస్తున్నప్పటికీ అక్కడక్కడా కొందరికి నిత్యావసర సరకులు అందక ఆకలి కేకలు వినబడుతున్నాయి. సరిగ్గా ఇలాంటి సంఘటనే రాజన్న సిరిసిల్ల జిల్లాలో జరిగింది.
బతుకు దెరువు కోసం ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం నుండి తెలంగాణలోని రాజన్న సిరిసిల్ల జిల్లాకు వచ్చిన 50 వలస కుటుంబాలు, ఇందులో చిన్నపిల్లలు కూడా ఉన్నారు. వారంతా ఐస్ క్రీం తయారీ కార్మికులుగా పని చేస్తున్నారు.
పని ఉంటెనే కాసింత కడుపు నిండుతుంది. గత నాలుగు రోజులుగా దేశం మొత్తం కర్ఫ్యూ వాతావరణం ఉండటంతో వారి జీవనాధారం కష్టమయ్యింది. దాంతో గత రెండు రోజులుగా నిత్యావసర సరుకులు లేక, తినటానికి తిండి లేక ఆకలితో అలమటిస్తుంటే అక్కడి చుట్టుపక్కల స్థానికులు చూసి పోలీసులకు తెలియజేశారు.
దాంతో స్వయంగా జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే వెంటనే స్పందించి వారు నివసిస్తున్న ప్రాంతానికి వెళ్లి వారికి తామున్నామనే ధైర్యాన్నిచ్చాడు. అంతే కాదు చుట్టుపక్కల వారికి ఇలాంటి ఇబ్బందులు ఏవైనా ఎదురయితే, ఇంకేదైనా ఇలా అత్యవసరం పడితే తగిన జాగ్రత్తలు తీసుకొని వారికి సహాయం చేసేలా చూడాలని, లేదా డయల్ 100 ద్వారా పోలీసులకు తెలియజేయాలని చెప్పారు.
ఆ వలస కుటుంబాలు తమను తమ రాష్ట్రానికి పంపించాల్సిదిగా రాహుల్ హెగ్డే ని కోరగా, ఇప్పుడు రాష్ట్రం దాటి వేరే రాష్ట్రానికి వెళ్లాల్సిన సమయం ఇది కాదని వారందరికీ నచ్చజెప్పారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎవరి ఇళ్లలో వారు ఈ 21 రోజులు ఉండాలని పరిస్థితులు బాగైనా తర్వాత పంపించే ఏర్పాట్లు చేస్తామని చెప్పారు.
అంతే కాకుండా కరోనా వ్యాధి పట్ల తీసుకోవాల్సిన జాగ్రతలను కూడా చెప్పారు. వారికి ఇంట్లో నుండి బయటకు రాకుండా ప్రభుత్వానికి సహకరించాలని చెప్పి ఒక్కో కుటుంబానికి నెలకు సరిపడా సరుకులను అందజేసి జిల్లా ఎస్పీ మానవత్వాన్ని చాటుకున్నారు.