లాక్ డౌన్ ప్రభావం... ఒంటరితనాన్ని భరించలేక ఉపాధ్యాయుడు ఆత్మహత్య

By Arun Kumar P  |  First Published Mar 26, 2020, 6:58 PM IST

కరోనా వైరస్ కారణంగా రాష్ట్రమొత్తాన్ని లాక్ డౌన్ చేయడంతో ఒంటరితనాన్ని భరించలేక ఓ ప్రభుత్వోపాధ్యాయుడు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. 


కరీంనగర్: భార్య, పిల్లలకు దూరంగా ఉంటున్న ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడు ఒంటరితనాన్ని భరించలేక ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన విషాద సంఘటన ఇల్లందుకుంట మండలంలో చోటుచేసుకుంది. మూడు రోజుల క్రితమే ఉపాధ్యాయుడు ప్రాణాలు కోల్పోగా ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ  సంఘటన గురువారం చోటు చేసుకుంది. 

గ్రామస్థులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం...ఇల్లందుకుంట మండలంలోని వంతడుపుల గ్రామానికి చెందిన సమ్మిరెడ్డి(58) అనే ప్రభుత్వ ఉపాధ్యాయుడు పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్​ మండలం ఉసన్నపల్లి గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో ఎస్​జీటీ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాడు. అతడి మానసిక స్థితి సరిగ్గా లేని కారణంగా భార్య, పిల్లలు గత కొద్దీ నెలలుగా దూరంగా ఉంటున్నారు.

Latest Videos

undefined

ఈ క్రమంలోనే కరోనా వైరస్​ ఉదృతి పెరుగుతున్న నేపథ్యంలో పాఠశాలలకు సెలవులు ఇవ్వడంతో ఇంట్లో ఉంటున్నాడు. ఇంట్లో ఒక్కడే ఉంటుండటంతో ఒంటరితనాన్ని భరించలేక అతడు ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

కాగా సమ్మిరెడ్డి ఆత్మహత్య చేసుకున్న మూడురోజుల తర్వాత  బయటపడింది. అతడు నివాసముండే ఇంట్లోంచి దుర్వాసన రావడంతో స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని తలుపులు పగులగొట్టి చూడగా సమ్మిరెడ్డి  మృతదేహం  కనిపించింది. 

దీంతో పోలీసులు మృతదేహాన్ని పరిశీలించగా మూడు రోజుల క్రితమే ఆత్మహత్యకు పాల్పడినట్లు ప్రాథమికంగా నిర్ధారించారు. కాగా మృతుడి అక్క రాజమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తుజరుపుతున్నట్లు ఏఎస్ఐ యాదగిరి తెలిపారు.
 

click me!