బిజెపి ఆవిర్భావ ధినోత్సవం వేడుకలను నిబంధనలను అతిక్రమించకుండా జరుపుకోవాలని ఆ పార్టీ శ్రేణులకు తెెలంగాణ అధ్యక్షులు బండి సంజయ్ సూచించారు.
హైదరాబాద్: కరోనా మహమ్మారి దేశంలో విజృంభిస్తూ ప్రజలందరినీ భయాందోళనకు గురిచేస్తోంది. ఇప్పటికే అన్ని రాష్ట్రాలకు ఈ వైరస్ పాకింది. దీంతో అన్ని రాష్ట్రాలు లాక్ డౌన్ ప్రకటించుకుని ప్రజలెవ్వరూ బయటకు రాకుండా జాగ్రత్త పడుతున్నాయి. ఈ నేపథ్యంలో వలసకూలీలు, నిరుపేద ప్రజలు తినడానికి తిండి లేకుండా నానా అవస్థలు పడుతున్నారు. ఇలాంటి వారి ఆకలిబాధను తీర్చడానికి బిజెపి శ్రేణులు ముందుకు రావాలని తెలంగాణ బిజెపి అధ్యక్షులు బండి సంజయ్ పిలుపునిచ్చారు.
భారతీయ జనతా పార్టీ 40 ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా పార్టీ నాయకులు, కార్యకర్తలకు ఎంపీ సంజయ్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...
పార్టీ కార్యాలయాలతో పాటు ప్రతి కార్యకర్త తమ తమ ఇండ్లపై కూడా పార్టీ జెండా ఎగరేయ్యాలని సూచించారు.
undefined
బీజేపీ కార్యకర్తలు డా.శ్యామాప్రసాద్ ముఖర్జీ, పండిట్ దిన్ దయాల్ ఉపాధ్యాయ చిత్ర పటాలకు పూలమాల వేసి నివాళులు అర్పించాలని పిలుపునిచ్చారు. లాక్ డౌన్ ఎదుర్కొంటున్న ప్రజలకు సంఘీభావంగా బీజేపీ కార్యకర్తలు ఒక్క పూట భోజనం మానెయ్యాలని సూచించారు. ఫీడ్ ది నీడ్ లో ప్రతి కార్యకర్త 5 + 1 పేదలకు అన్నదానం చెయ్యాలన్నారు.
లాక్ డౌన్ లో అత్యవసర సేవలు అందిస్తున్న వారికి మద్దతుగా బిజెపి కార్యకర్తలు తమ తమ ఏరియాలో ఉన్న 40 మందితో థాంక్యూ లెటర్స్ పై సంతకాలు సేకరించి పోలీసులు, డాక్టర్లు, నర్సులు, పారిశ్యుద్ధ కార్మికులు (కరోనా వారియర్స్)కు అందించాలని సూచించారు.
ప్రతి కార్యకర్త మాస్కులను ఇంట్లో తయారు చేపించి మరో ఇద్దరికి అందించేలా వ్యవస్థ ను ఏర్పాటు చేయాలన్నారు. పార్టీ కార్యక్రమాలు సామాజిక దూరం పాటిస్తూ ,ప్రభుత్వ నిబంధనలకు లోబడి చేయాలని సూచించారు. లాక్ డౌన్ ముగిసే వరకు బీజేపీ పార్టీ కార్యకర్తలు, అభిమానులు అన్నదానం, సేవ కార్యక్రమాల్లో పాల్గొనాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సంజయ్ సూచించారు.