పెద్ద మనసును చాటుకున్న మంత్రి పువ్వాడ...కేసీఆర్ కు రూ.2కోట్ల చెక్కు అందజేత

By Arun Kumar P  |  First Published Apr 6, 2020, 6:39 PM IST

కరోనా మహమ్మారిని తరిమికొట్టడానికి  ప్రయత్నిస్తున్న తెలంగాణ ప్రభుత్వానికి మద్దతుగా నిలిచేందుకు మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ముందుకొచ్చాడు. 


ఖమ్మం: చాపకింద నీరులా విస్తరిస్తోన్న కరోనా కట్టడికై  చేపట్టిన సహాయ చర్యల్లో  భాగంగా రాష్ట్ర ప్రభుత్వానికి అండగా నిలిచేందుకు పలువురు దాతలు పెద్ద మనసుతో ముందుకొస్తున్నారు. ఈ క్రమంలోనే మమత వైద్య విద్య సంస్థ ఛైర్మన్, రవాణా శాఖా మంత్రి అజయ్ కుమార్ పువ్వాడ కూడా భారీగా విరాళాన్ని ప్రకటించి స్ఫూర్తిగా నిలిచారు. 

కోవిడ్ -19 మహమ్మారిపై  ప్రభుత్వం చేస్తున్న పోరాటానికి మద్దతు ఇవ్వవలసినదిగా సిఎం చేసిన అభ్యర్ధనకు స్పందించిన మంత్రి తన నియోజకవర్గమైన ఖమ్మం జిల్లాలో భారీ స్థాయిలో విరాళాలను పోగు చేశారు.

Latest Videos

undefined

  వివిధ వర్గాలకు చెందిన దాతల నుంచి చెక్కు రూపంలో సేకరించిన రూ.1.75 కోట్లతో పాటు తమ మెడికల్ కాలేజీ నుంచి రూ.25 లక్షలను అదనంగా జోడించి మొత్తం రూ.2 కోట్ల విలువైన చెక్కులను ముఖ్యమంత్రి సహాయ నిధికి అందజేశారు. 

సోమవారం మధ్యాహ్నం ప్రగతిభవన్ లో ముఖ్యమంత్రిని కలిసి ఆ మొత్తాన్ని అందజేశారు. ఈ సందర్భంగా మంత్రిని సీఎం కేసీఆర్ అభినందించారు. ఆ పిమ్మట ఖమ్మం జిల్లాలో కరోనా నియంత్రణకై చేపట్టిన చర్యలను మంత్రి సిఎం కు వివరించారు.

ఈ సందర్భంగా మంత్రి అజయ్ కుమార్ మాట్లాడుతూ... కరోనా నివారణ ప్రక్రియలో తెలంగాణ  ప్రభుత్వం మరింతగా పునరంకితం అవుతూ తోటి రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తోందన్నారు. ఇలాంటి ఎన్నో విపత్కర సవాళ్లు ఎదురైనప్పుడు దాతలు అండగా నిలిచారని గుర్తు చేశారు. కరోనా వైరస్ ను కట్టడి చేయడానికి, వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు  ప్రభుత్వం జరిపే పోరాటానికి అండగా నిలవడంలో దాతల సహాయం ఎంతో తోడ్పడగలదన్నారు.

ముఖ్యమంత్రి పిలుపుతో తాను చేసిన విన్నపం మేరకు ఖమ్మం జిల్లాలో ముందుకొచ్చి విరాళాలను అందించిన దాతలకు ఆయన ఈ సందర్భంగా కృతజ్ఞతలు చెప్పారు. ఈ బృహత్కార్యంలో పలువురు భాగస్వాములవులై తమవంతు సహాయం అందించడం స్ఫూర్తిదాయకమన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ మార్గ నిర్ధేశాలతో కరోనా నియంత్రణకై డాక్టర్లు, వైద్య సిబ్బంది చేస్తున్న సేవలకు  తెలంగాణ సమాజం మొత్తం హ్యాట్సాఫ్ చెబుతోందన్నారు.

ప్రబలిన కోవిడ్ -19 వంటి ప్రజారోగ్య సమస్యను ఎదుర్కోవడానికి ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నదని... ఇలాంటి మహమ్మారిని కట్టడి చేయడానికి సమిష్టి కృషి అవసరమన్నారు.ప్రజలు స్వీయ నిబంధనలతో ఇంట్లోనే ఉండి ఈ విపత్తును ధైర్యంగా ఎదుర్కోవాలని... కరోనాని అరికట్టడంలో అందరం భాగస్వామ్యం కావాలని మంత్రి పువ్వాడ  పిలుపునిచ్చారు.

click me!