ఏప్రిల్ 15 తర్వాత కూడా లాక్ డౌన్ కొనసాగించాల్సిందే: కేసీఆర్

By telugu team  |  First Published Apr 6, 2020, 8:18 PM IST

ఏప్రిల్ 15వ తేదీ తర్వాత కూడా లాక్ డౌన్ కొనసాగించాల్సిందేనని తెలంగాణ సీఎం కేసీఆర్ అభిప్రాయపడ్డారు. ఈ విషయాన్ని తాను ప్రధాని మోడీకి కూడా చెప్పినట్లు తెలిపారు లాక్ డౌన్ తప్ప మరో ఆయుధం లేదని అన్నారు.


హైదరాబాద్: కరోనా వైరస్ కట్టడికి లాక్ డౌన్ ఇంకా కొనసాగాల్సిందేనని తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు అభిప్రాయపడ్డారు. బతికి ఉంటే బలుసాకు తినవచ్చునని ఆయన అన్నారు. తాను రోజూ ప్రధాని నరేంద్ర మోడీతో మాట్లాడుతున్నట్లు ఆయన తెలిపారు. లాక్ డౌన్ ఎత్తేస్తే ప్రజలను నియంత్రించగలమా అని ఆయన చెప్పారు. లాక్ డౌన్ కొనసాగించాలని తాను ప్రధానికి సూచించినట్లు ఆయన తెలిపారు .

లాక్ డౌన్ వల్ల ఆర్థిక పరిస్థితి దెబ్బ తింటుందని, అయితే ఆర్థిక పరిస్థితి దెబ్బ తింటే కోలుకోవచ్చునని, కరోనా వ్యాపిస్తే కోలుకోవడం కష్టమని ఆయన అన్నారు. లాక్ డౌన్ మాత్రమే మన వద్ద ఉన్న ఆయుధమని, మరో ఆయుధం లేదని ఆయన అన్నారు. లాక్ డౌన్ ను ఏప్రిల్ 15వ తేదీన తర్వాత కూడా కొనసాగించాలని ఆయన ప్రధాని మోడీని కోరారు. బోస్టన్ కన్సల్టెంగ్ గ్రూప్ జూన్ 3వ తేదీ వరకు లాక్ డౌన్ అమలు చేయాలని సూచించిందని ఆయన చెప్పారు. 

Latest Videos

undefined

Also Read: కొత్తగా 30 కేసులు, ఆస్పత్రుల్లో 308 రోగులు: కేసీఆర్ వెల్లడి

లాక్ డౌన్ ఎత్తేయడం అంత సులభం కాదని ఆయన అన్నారు. ప్రస్తుతం లాక్ డౌన్ ను కొనసాగించడం తప్ప మార్గం లేదని అన్నారు. లాక్ డౌన్ కు ప్రజలు అద్భుతంగా సహకరిస్తున్నారని ఆయన చెప్పారు. ఎవరో ఇబ్బంది పెడుతున్నారనే భావన నుంచి ప్రజలు బయటపడాలని ఆయన అన్నారు. లాక్ డౌన్ విషయంలో కఠినంగా ఉంటామని చెప్పారు. రాష్ట్ర ఆదాయానికి నష్టం వచ్చినా లాక్ డౌన్ కొనసాగించాల్సిందేనని ఆయన అన్నారు.

రూ.2,400 కోట్లకు ఆరు కోట్లు మాత్రమే వచ్చిందని ఆయన చెప్పారు. ఒక్కసారి గేట్లు ఎత్తేస్తే ఆగమన్నా ఆగబోరని ఆయన అన్నారు. ఏప్రిల్ 15వ తేదీ లోగా సమస్య పరిష్కారమవుతుందని అనుకున్నామని, కానీ కాలేదని ఆయన అన్నారు. లాక్ డౌన్ పొడగించకపోతే సమస్య మొదటికి వస్తుందని ఆయన అన్నారు. నిజాముద్దీన్ ఘటన లేకపోతే తెలంగాణ బయటపడి ఉండేదని అన్నారు. 

కరోనా కట్టడికి అన్ని రకాల చర్యలు కూడా తీసుకుంటున్నామని ఆయన చెప్పారు. చర్యలు తీసుకోకపోయి ఉంటే పరిస్థితి తీవ్రంగా ఉండేదని అన్నారు. అమెరికాలాంటి దేశంలో శవాల గుట్టలు ఉన్నాయని, అలా వచ్చి ఉంటే మన దేశంలో కోట్లాదిమంది మరణించి ఉండేవాళ్లరని ఆయన అన్నారు. 

కరోనా పాజిటివ్ ఉన్నవాళ్లంతా గాంధీ ఆస్పత్రికి వెళ్లాల్సిందేనని, ఇందులో ధనిక, పేద తేడా ఉండదని ఆయన చెప్పారు. 25 వేల మంది వైద్య సిబ్బందిని సిద్ధంగా పెట్టుకున్నామని ఆయన చెప్పారు. సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేసేవారిని కేసీఆర్ తీవ్రంగా హెచ్చరించారు. 

click me!