కరోనా కంటే తప్పుడు వార్తలే మరింత ప్రమాదకరమని తెలంగాణ పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాస్ రావు అన్నారు. ఆదివారం సాయంత్రం ఆయన మీడియాతో మాట్లాడారు. ఓమ్రికాన్ ను ఎదుర్కొనేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు.
తెలంగాణ కరోనా కేసులు పెరుగుతున్నా.. హాస్పిటల్స్ లో చేరికలు, మరణాల సంఖ్య పెరగడం లేదని తెలంగాణ పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ డాక్టర్ శ్రీనివాస్ రావు అన్నారు. కరోనా కంటే ప్రజలను భయబ్రాంతులకు గురి చేసే తప్పుడు వార్తలు మరింత ప్రమాదకరమని ఆవేదన వ్యక్తం చేశారు. కరోనా విషయంలో తప్పుడు కథనాలు ప్రచురించకూడదని మీడియాకు విజ్ఞప్తి చేశారు. ఆదివారం సాయంత్రం ఆయన మీడియాతో మాట్లాడారు. ఓమ్రికాన్ వేరియంట్ నేపథ్యంలో ప్రభుత్వం తీసుకుంటున్న ముందస్తు చర్యలను వివరించారు.
‘జ్వర సర్వే’ ను నీతి అయోగ్ ప్రశంసించింది.
దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ ప్రభుత్వం ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా ‘జర స్వర్వే ’ నిర్వహించిందని హెల్త్ డైరెక్టర్ శ్రీనివాస్ రావు తెలిపారు. ఈ విధానంలో ఆరోగ్య కార్యకర్తలు ఇంటింటికి వెళ్లి జ్వరం, కోవిడ్ లక్షణాలతో బాధపడుతున్న వారి వివరాలు తెలుసుకొని వారికి కరోనా కిట్‌లు అందజేశారని తెలిపారు. దీంతో ఎక్కడికక్కడే కట్టడి చేయడం సాధ్యమైందని అన్నారు. ఈ సర్వే నిర్వహించిన విధానాన్ని నీతిఅయోగ్ ప్రశంసించిందని చెప్పారు. రాష్ట్రంలో కరోనా కేసులు దాస్తున్నారంటూ కొందరు తప్పుడు వార్తలు ప్రసారం చేస్తున్నారని అన్నారు. ఇందులో ఎలాంటి నిజం లేదని అన్నారు. తెలంగాణ కట్టడి కోసం ఆరోగ్య సిబ్బంది ఎంతో కష్టపడుతున్నారని, ఇలాంటి వార్తల వల్ల ఆరోగ్య సిబ్బందిని అవమానించినట్లవుతుందని అన్నారు.
undefined
ముందస్తు చర్యలు తీసుకుంటున్నాం..
ఓమ్రికాన్ ఎదుర్కొనేందుకు తెలంగాణ ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకుంటోందని ఆయన అన్నారు. తెలంగాణలో ఇప్పుడు ఓమ్రికాన్ ప్రభావం లేదని తెలిపారు. ఓమ్రికాన్ ప్రభావిత దేశాల నుంచి వచ్చే వారికి ఎయిర్‌పోర్ట్‌లోనే పరీక్షలు నిర్వహిస్తున్నామని చెప్పారు. ఆ టెస్టుల్లో పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యే వారిని క్వారంటైన్ కు తరలించే ఏర్పాట్లు చేశామని అన్నారు. విదేశాల నుంచి వచ్చిన వారిలో 13 మందికి కరోనా పాజిటివ్‌గా తేలిందని అది ఏ వేరియంట్ అనేది తెలుసుకోవాలంటే ఇంకా రెండు రోజులు పడుతుందని అన్నారు. ముందస్తు చర్యల్లో భాగంగా ఆక్సిజన్ బెడ్స్, వెంటిలేటర్స్ వంటి ఏర్పాట్లు చేశామని తెలిపారు.
92 శాతం జనాభాకు మొదటి డోసు..
ఇప్పటి వరకు తెలంగాణ జనాభాలో 92 శాతం మందికి మొదటి డోసు వేశామని తెలిపారు. 48 శాతం ప్రజలు రెండో డోసు వేసుకున్నారని చెప్పారు. డిసెంబర్ చివరి నాటికి మొదటి డోసు 100 శాతం పూర్తి చేసేందుకు ప్రయత్నిస్తున్నామని తెలిపారు. ప్రతీ ఒక్కరూ వ్యాక్సిన్ తీసుకోవాలని సూచించారు. వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల హెర్ద్ ఇమ్యూనిటీ పెరుగుతుందని చెప్పారు. తమకున్న అంచనాల ప్రకారం తెలంగాణలో ఓమ్రికాన్ వేరియంట్ జనవరి 15 నుంచి పెరిగి, అది ఫిబ్రవరిలో పీక్స్‌కు వెళ్లే అవకాశం ఉందని చెప్పారు. అప్పటిలోపు అందరూ వ్యాక్సిన్ వేసుకోవడం వల్ల కరోనా కొత్త వేరియంట్ నుంచి రక్షణ పొందవచ్చని తెలిపారు. వ్యాక్సిన్ వేసుకొని ఉండటం వల్ల ఒక వేల కరోనా సోకినా స్వల్ప లక్షణాలతో బయటపడవచ్చని అన్నారు.
స్వీయ జాగ్రత్తలే శ్రీరామరక్ష..
ప్రతీ ఒక్కరూ స్వీయ జాగ్రత్తలు పాటించాలని, అదే అందరినీ కాపడుతుందని అన్నారు. ఎవరో వస్తారు, ఏదో చేస్తారు అని ఎదురుచూడకుండా ఎవరి జాగ్రత్తల్లో వారు ఉండాలని కోరారు. కరోనా నిబంధనలు పాటించాలని సూచించారు. మాస్క్ ధరించడం, భౌతిక దూరం పాటించడం, శుభ్రంగా ఉండటం వల్ల కరోనాను ధరి చేరకుండా చూసుకోవచ్చని అన్నారు. రాబోయే 6 వారాల పాటు ప్రతీ ఒక్కరూ కచ్చితంగా మాస్క్ ధరించాలని కోరారు. నిర్లక్ష్యంగా ఉండవద్దని చెప్పారు.