కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మల్కాజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డి మంగళవారం ముఖ్యమంత్రి కేసీఆర్‌కు బహిరంగ లేఖ రాశారు
కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మల్కాజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డి మంగళవారం ముఖ్యమంత్రి కేసీఆర్‌కు బహిరంగ లేఖ రాశారు. రాష్ట్రంలో వైరస్ కారణంగా ఆరుగురు చనిపోవడం ఎంతగానో కలవరపెట్టిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
కరోనా మహమ్మారిని తరిమి కొట్టడానికి రాష్ట్ర ప్రభుత్వం మరికొన్ని కఠినమైన నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉందని రేవంత్ చెప్పారు. కొన్ని నిర్ణయాల వల్ల ప్రజలు ఇబ్బంది పడుతున్నప్పటికీ ఇది సరైన సమయం కాకపోవడం వల్ల విమర్శించడం లేదని రేవంత్ స్పష్టం చేశారు.
Also Read:కరోనా:తెలంగాణ నుండి ఢిల్లీకి వెళ్లింది 1030 మంది, ట్రాకింగ్ బృందాల ఆరా
ప్రజలను సోషల్ డిస్టెన్స్ పాటించమని చెబుతూనే మరోపక్క ఫార్మాసిటీకి సంబంధించిన భూసేకరణ కోసం రంగారెడ్డి జిల్లా మేడిపల్లి, నానక్‌రాంగూడ గ్రామాల్లో అధికారులు నోటీసులు జారీ చేశారని రేవంత్ గుర్తుచేశారు.
ఏప్రిల్ 3న ప్రజాభిప్రాయ సేకరణ సభ నిర్వహించబోతున్నట్లు నోటీసులో పేర్కొనడం ఆందోళన కలిగిస్తోందన్నారు. ఏప్రిల్ 14 వరకు దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ ప్రకటిస్తే 3న సభ నిర్వహించడం సరైన నిర్ణయం కాదని రేవంత్ రెడ్డి ఎద్దేవా చేశారు.
ప్రస్తుత పరిస్ధితుల్లో సభలు, సమావేశాలు నిర్వహిస్తే ప్రజలు గుంపుగా ఒక దగ్గరకు చేరే అవకాశం ఉందని.. కాబట్టి ఇది సరైన చర్య కాదని ఆయన పేర్కొన్నారు. ప్రజా ప్రతినిధులు, అఖిల భారత సర్వీసులు అధికారులు, ఉన్నతోద్యోగుల వేతనాల్లో కోత విధించడాన్ని తాము స్వాగతిస్తున్నామని రేవంత్ స్పష్టం చేశారు.
Also Read:వైన్ షాపులపై నకిలీ జీవో పుకార్లు, అరెస్టు: తెలంగాణ కరోనా కేసులు 76
అయితే చిరుద్యోగులు, నాలుగో తరగతి ఉద్యోగులు, ఔట్ సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగుల జీతాల్లో కోత విధించడం సరైన నిర్ణయం కాదని రేవంత్ ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రాణాలు తెగించి పోరాడుతున్న వైద్య, పారామెడికల్ సిబ్బందికి ప్రోత్సాహకాలు ఇవ్వాల్సిందిపోయి జీతాల్లో కోత పెట్టడం వారి నిబద్ధతను తక్కువ చేయడమే అవుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రజలను ఆర్ధికంగా ఇబ్బందులకు గురిచేసే విధమైన నిర్ణయాలపై మరోసారి పున: సమీక్ష చేయాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.