డాక్టర్ సంగిశెట్టి శ్రీనివాస్ సాహిత్య పరిశోధకుడు.తెలంగాణ లాక్ డౌన్ అమలవుతున్న స్థితిలో ఆయన ఇంట్లో తన పరిశోధనకు పదును పెట్టుకుండడమే కాకుండా జీవస సహచరికి ఇంటి పనిలో సాయపడుతున్నారు.
ప్రముఖ సాహిత్య పరిశోధకుడు, అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ సంగిశెట్టి శ్రీనివాస్ స్టే హోమ్ ను చాలా అర్థవంతంగా గడుపుతున్నారు. తెలంగాణ లాక్ డౌన్ నేపత్యంలో ఇంటలో ఉండి ఏం చేస్తున్నారో ఆయన మాటల్లోనే చదవండి....
ఆరుద్ర గారుసమగ్రాంధ్ర సాహిత్య చరిత్ర రాస్తున్నప్పుడు గడ్డం చేసుకోవడానికి సమయం వెచ్చించడం వేస్ట్ అని పెంచుకున్నడట. ఇప్పుడు బార్బర్ షాపులు బందుండి ఎవ్వరూ షాపుకు వెళ్లడం లేదు. ఇలాంటి టైమ్ లోనే ఒరిజనాలిటి బయటికొస్తది. ఇందుకు పూనుకున్నందుకు ఏషియానెట్ కు అభినందనలు..
కాలేజీల్లో పనిచేస్తున్న మాలాంటి వారికి ఎండాకాలంలో కొన్ని రోజులు, దసరా సమయంలో మరికొన్ని రోజు సెలవులు దొరుకుతాయి. అయితే ఈ సెలవుల్లో బయటి ప్రదేశాలకు వెళ్ళడమో లేదంటే ఎక్కడో ఒకదగ్గర సభలు,, సమావేశాలకు అటెండ్ కావడమో చేస్తూ ఉంటాము. అయితే కరోనా కారణంగా ఇంటికి ఎవరూ వచ్చేది లేదు. బయటికి నేను వెళ్ళేది లేక పోవడంతో ఎన్నో యేండ్లుగా పెండింగులో ఉన్న పనులను ముందేసుకోవడం జరిగింది. పెండింగ్ పనులంటే మరేమి లేదు చదువుకోవడం, రీసెర్చ్ చేయడం, రాసుకోవడమే!
ఇందులో భాగంగా ‘తెలంగాణ సంస్థానాలు -మహిళలు ‘’ అనే వ్యాసాన్ని గతంలో దక్కన్‌లాండ్ పత్రికలో రాయడం జరిగింది. అయితే దాంట్లో గద్వాల సంస్థానానికి సంబంధించిన వివరాలు లేవు. ఇప్పుడు ఆ గద్వాల చారిత్రకాంశాలను సమన్వయం చేసే పనిలో ఉన్నాను. కృష్ణస్వామి ముదిరాజ్, మారేమండ రామారావు, సురవరం ప్రతాపరెడ్డి, కట్టా వెంకటేశ్వర్లు, ఇంకా అనేక సోర్సెస్ నుంచి సమాచారాన్ని సేకరించి సమన్వయం చేస్తూ ఉన్నాను. అట్లాగే ఎప్పుడో సేకరించిన ‘గద్వాల కైఫియత్’కు వివరణలు/ఫుట్‌నోట్సు రాసే పనిని కూడా ముందటేసుకున్నాను. వీటితో పాటుగా ‘జర్నలిస్టుగా అంబేడ్కర్’ అనే పరిశోధనను పుస్తకంగా రాస్తున్నాను. అలాగే తొలి దళిత జర్నలిస్టు, సంఘసంస్కర్త గోపాల్‌బాబ వాలంగ్కర్ జీవిత చరిత్రను చిన్న బుక్‌లెట్‌గా తీసుకురావానుకుంటున్నాను.
ఎప్పటి నుంచో పెండింగులో ఉన్నటువంటి ‘తెలంగాణ పత్రికా రంగ చరిత్ర’, ‘తెలంగాణ దళితోద్యమ చరిత్ర’ పరిశోధనను కూడా ఈ సెలవుల్లో చేస్తున్నాను. అలాగే ప్రతి సంవత్సరం ‘సింగిడి’ తెలంగాణ రచయితల సంఘం తరపున వెలువరించే ‘తెలంగాణ కథ’ సీరిస్‌లో భాగంగా 2019లో వచ్చిన మెరుగైన కథల ఎంపిక/చదవడం కూడా జరుగుతోంది. ఈసారి తెలంగాణ కథ తొందరగా వచ్ఛే అవకాశం ఉంది.
తెలంగాణ గురించి పరిశోధన, రాయడం, చదవడం ఎప్పటి నుంచో చేస్తున్నదే! అయితే ఈ సారి జాతీయస్థాయిలో బీసీల స్థితిగతుల గురించి అవగాహన కోసం ఫ్రాన్స్‌కు చెందిన అకడమిషియన్ క్రిస్టోఫ్ జాఫర్‌లాట్ రాసిన ‘రిలీజియన్, కాస్ట్ అండ్ పొలిటిక్స్ ఇన్ ఇండియా’ నుంచి కొన్ని సెలెక్టివ్‌గా చదువుతున్నాను. మరోసారి మచ్చ ప్రభాకర్ తెలుగులోకి తర్జుమా చేసిన ‘ముంబాయి నిర్మాణంలో తెలుగు ప్రజల క్రియాశీల పాత్ర’, హైదరాబాద్ బుక్‌ట్రస్ట్ వారు ప్రచురించిన జె.వి.పవార్ రచన ‘దళిత్ పాంథర్స్ ఉద్యమం’ని కూడా చదువుతున్న.
దీన్ని ప్రభాకర్ మందార తెలుగులోకి తెచ్చిండు. వీటితో పాటుగా తగుళ్ళ గోపాల్ కవిత్వం ‘దండకడియం’, బ్లిల్లా మహేందర్ రాసిన ‘తను నేను వాక్యం’, ‘ఇప్పుడొక పాట కావాలి’ కూడా మధ్యమధ్యలో చదువుతున్నాను. కరోనానంతరం కొన్ని పరిశోధనలు పుస్తకాలుగా వస్తాయనే నమ్మకముంది. ఏషియానెట్ ద్వారా నా ఈ విషయాలను పంచుకునేందుకు అవకాశమిచ్చినందుకు మిత్రులకు ధన్యవాదాలు..