హైదరాబాదులో మరణించిన వృద్ధుడి అంత్యక్రియలకు కుటుంబ సభ్యులెవరూ హాజరు కాలేకపోయారు. వారందరినీ క్వారంటైన్ కు తరలించారు. ఈ నెల 29వ తేదీన కరోనా వైరస్ రోగి హైదరాబాదులో మరణించిన విషయం తెలిసిందే.
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులో కరోనా వైరస్ మృతుడి అంత్యక్రియలకు కుటుంబ సభ్యులు ఎవరూ హాజరు కాలేదు. ఆరోగ్య కార్యకర్తలు దగ్గరుండి అంత్యక్రియలు నిర్వహించారు. హైదరాబాదులోని గ్లోబల్ ఆస్పత్రిలో మార్చి 29వ తేదీన ఓ వృద్ధుడు కరోనా వైరస్ తో మరణించిన విషయం తెలిసిందే.
శనివారంనాడు అతని అంత్యక్రియలు జరిగాయి. కరోనా మృతుడి కుటుంబ సభ్యులను క్వారంటైన్ లో ఉంచారు. అంత్యక్రియలకు కేవలం 20 మందిని మాత్రమే అనుమతించారు. మరణించిన తర్వాతనే అతనికి కరోనా పాజిటివ్ ఉన్నట్లు తేలిందని తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు ఆదివారంనాడు చెప్పారు. అతనికి పలు ఆరోగ్య సమస్యలు ఉన్నట్లు, దాంతోనే అతను ఆస్పత్రిలో చేరినట్లు ఆయన తెలిపారు.
మరణించిన వ్యక్తి ప్రభుత్వ ఆధీనంలో లేడని కేసీఆర్ చెప్పారు. తెలంగాణలో కరోనా వైరస్ కేసులు 70కి చేరినట్లు ఆయనయ తెలిపారు. ఏప్రిల్ 7వ తేదీనాటికి తెలంగాణ రాష్ట్రం కరోనా ప్రీ అయ్యే అవకాశం ఉందని ఆయన చెప్పారు. 30 వేల కోట్ల రూపాయలు రైతుల ధాన్యాన్ని కొనుగోలు చేయడానికి విడుదల చేసినట్లు ఆయన తెలిపారు. ఈ రాష్ట్రంలోనూ ఈ విధంగా చేయలేదని ఆయన చెప్పారు.
క్వారంటైన్ లో ఉన్నవారని నిరంతరం పర్యవేక్షిస్తున్నట్లు ఆయన తెలిపారు. కొత్త కేసులు రాకపోతే ఏప్రిల్ 7వ తేదీకి ఫ్రీ అవుతామని ఆయన చెప్పారు.
కొత్త కేసులు వచ్చే అవకాశం కూడా లేదని ఆయన చెప్పారు. విమానాశ్రయాలు, ఇతర రవాణా సౌకర్యాలు బందయ్యాయని, బయటి నుంచి వ్యక్తులు వచ్చే అవకాశం లేదని, అందువల్ల తెలంగాణలో కొత్తగా కేసులు వచ్చే అవకాశం లేదని ఆయన చెప్పారు.
స్థానికంగా రాష్ట్రంలో కరోనా వైరస్ పాజిటివ్ వచ్చినవారి పట్ల కఠినంగా వ్యవహరిస్తున్నట్లు తెలిపారు. వారిని పట్టుకొచ్చి ఆస్పత్రుల్లో చేర్పించామని ఆయన చెప్పారు.
కొత్తగూడెం, కరీంనగనర్ ఉదంతాలను ఆయన గుర్తు చేశారు. అనుమానితులు 25,937 మంది ఉన్నారని, వారందరికి కూడా పరీక్షలు పూర్తవుతాయని ఆయన చెప్పారు. అయితే, లాక్ డౌన్ నియమాలను అనుసరిస్తూ స్వీయ నియంత్రణ పాటించడమే మార్గమని ఆయన చెప్పారు.