ఫేస్ మాస్క్ ధరిస్తేనే రైడింగ్ లేదంటే..: ఉబెర్ తాజా ప్రకటన

By Sandra Ashok Kumar  |  First Published May 19, 2020, 11:29 AM IST

ఉబెర్  క్యాబ్ సర్వీసులు అందుబాటులోకి రానున్నాయి. ఈ నేపథ్యంలో డ్రైవర్, ప్రయాణికులు ఫేస్ మాస్క్ ధరించడం తప్పనిసరి అని ఉబెర్ ప్రకటించింది. 
 


న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి వేగంగా వ్యాపిస్తున్న తరుణంలో క్యాబ్స్ అగ్రిగేటర్ ‘ఉబెర్’ రైడ్ హెయిలింగ్ యాప్ ఉబెర్ సరికొత్త మార్గదర్శకాలు విడుదల చేసింది. భారత్‌లో ఇకపై ప్రయాణాల సందర్భంగా ప్రయాణికుడు, డ్రైవర్‌ ఫేస్ మాస్క్ ధరించడం తప్పనిసరని పేర్కొంది. భారతదేశంలో నేటి నుంచి నాలుగో విడత లాక్‌డౌన్ ప్రారంభమైంది.

కంటైన్‌మెంట్, బఫర్, రెడ్, ఆరెంజ్, గ్రీన్ జోన్లపై నిర్ణయం తీసుకునే అధికారాన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు కేంద్రం వదిలేసింది. రాష్ట్రాల నిర్ణయాన్ని బట్టి ఉబెర్, ఓలా వంటి రైడ్ హెయిలింగ్ ప్లాట్‌ఫాంలు వివిధ రకాల సేవలను తిరిగి ప్రారంభించనున్నాయి.

Latest Videos

ఇండియా సహా ఇతర దేశాల ఉబెర్ డ్రైవర్లు అందరూ నేటి నుంచి పేస్‌మాస్క్‌లు తప్పనిసరిగా ధరించాలని ఉబెర్ ప్రొడక్ట్ మేనేజ్‌మెంట్ గ్లోబల్ సీనియర్ డైరెక్టర్ సచిన్ కన్సాల్ తెలిపారు. ఫేస్ మాస్క్ ధరించి డ్రైవర్లు సెల్ఫీ పంపాలని, ఉబెర్‌లోని కొత్త టెక్నాలజీ డ్రైవర్లను గుర్తిస్తుందని కన్సాల్ పేర్కొన్నారు.

అలాగే, ప్రతి ట్రిప్‌లోనూ రైడర్లకు కూడా చెక్‌లిస్ట్ ఉంటుందని ఉబెర్ ప్రొడక్ట్ మేనేజ్‌మెంట్ గ్లోబల్ సీనియర్ డైరెక్టర్ సచిన్ కన్సాల్ తెలిపారు. ప్రయాణికులు కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుందన్నారు. ఫేస్‌మాస్క్‌లు ధరించడం, చేతులను శుభ్రం చేసుకోవడం వంటివి పాటించాలని అన్నారు. రైడర్లు కూడా ఫేస్ మాస్క్ ధరించకపోతే, తర్వాతీ ట్రిప్‌లో వారిని అనుమతించబోమని స్పష్టం చేశారు.

also read ఎలక్ట్రానిక్..ఆటోమొబైల్స్‌లో సందడే సందడి:భాగ్యనగరికి మార్కెట్లకు కొత్త కళ

డ్రైవర్ కానీ, ప్రయాణికుడు కానీ ఎవరైనా జాగ్రత్తలు తీసుకోకున్నా, ఫేస్ మాస్క్ ధరించకున్నా ఆ విషయాన్ని కంపెనీకి తెలిపి ఫీడ్ బ్యాక్ ఇచ్చి, రైడ్ రద్దు చేసుకోవచ్చునని సచిన్ కన్సాల్ తెలిపారు. తమ డ్రైవర్లు ఫేస్ మాస్క్ ధరించకుంటే తొలుత హెచ్చరిస్తామని, తరుచుగా వాడకుంటే తమ ఫ్లాట్ ఫాం నుంచే తొలిగించి వేస్తామని స్పష్టం చేశారు.

ఉబెర్ నుంచి మరో 3000 మందికి ఇంటికి 

కరోనా సంక్షోభంతో ఉబెర్ ప్రపంచ వ్యాప్తంగా తాజాగా మరో 3000 మందిని ఇంటికి సాగనంపనున్నది. ఈ విషయమై ఉబెర్ సీఈఓ డారా ఖోస్రోవ్ సాహి ఉద్యోగులకు ఈ-మెయిల్ సమాచారం ఇచ్చారు. ఈ నెల ప్రారంభంలో 3,700 మందికి ఉద్వాసన తెలిపిన సంగతి తెలిసిందే.

కరోనా వల్ల అమెరికాతోపాటు ప్రపంచ వ్యాప్తంగా ఉబెర్ బిజినెస్ పూర్తిగా దెబ్బ తిన్నది. మూడింట రెండొంతుల సంస్థ ఆదాయం అమెరికా, కెనడా నుంచే వస్తుంది. గత నెలలో 80 శాతం ట్రిప్ రిక్వెస్ట్‌లు పడిపోయాయి. ఇప్పుడిప్పుడే తిరిగి కోలుకుంటున్నది. 

సింగపూర్ సంస్థ కార్యాలయాన్ని ఏడాదిపాటు మూసేస్తున్నట్లు డారా ఖోస్రోవ్ సాహి తెలిపారు. దీంతో పాటు శాన్ ఫ్రాన్సిస్కోతోపాటు మొత్తం సంస్థకు చెందిన 45 ఆఫీసులను మూసేస్తున్నారు. ఫుడ్ డెలివరీ బిజినెస్ లో అడుగు పెట్టేందుకు గ్రూబ్ హబ్ తో చర్చలు జరుపుతున్నది. నాన్ కోర్ ప్రాజెక్టుల్లో పెట్టుబడుల తగ్గింపునకు ప్రణాళికలు రూపొందిస్తున్నది. 
 

click me!