భారత దేశ వృద్ధి రేటు డౌన్...’91 తర్వాత ఇదే అత్యల్పం తేల్చి చెప్పిన ప్రపంచ బ్యాంక్

By Sandra Ashok KumarFirst Published Apr 13, 2020, 10:49 AM IST
Highlights
భారత వృద్ధి రేటుకు కరోనా వ్యాప్తి గుదిబండగా మారుతుందని ప్రపంచబ్యాంక్ ఆందోళన వ్యక్తం చేసింది. 2020-21లో దేశ జీడీపీ వృద్ధి 1.5 శాతం నుంచి 2.8 శాతం మధ్య ఉంటుందని పేర్కొంది. 1991 తర్వాత అత్యంత నెమ్మదైన వృద్ధి ఇదేనని స్పష్టం చేసింది. 2022 ఆర్థిక సంవత్సరంలో ఈ వృద్ధి రేటు 5 శాతానికి పుంజుకుంటుందని అంచనా వేసింది.
 
న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి భారత దేశఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతుందని ప్రపంచ బ్యాంకు వెల్లడించింది. ఈ మేరకు వృద్ధి అంచనాలు వెలువరించింది. 1991 ఆర్థిక సరళీకరణ తర్వాత భారత ఆర్థిక వ్యవస్థ కనబర్చే అత్యంత దారుణమైన పనితీరు ఇదేనని  ప్రపంచబ్యాంకు అభిప్రాయపడింది.

'సౌత్​ ఏషియా ఎకనామిక్​ అప్​డేట్​: ఇంప్యాక్ట్​ ఆఫ్​ కొవిడ్​-19' పేరిట విడుదల చేసిన ఓ నివేదికలో 2020-21 ఆర్థిక సంవత్సర వృద్ధిరేటు కేవలం 1.5 - 2.8 శాతం మధ్యే నమోదవుతుందని ప్రపంచబ్యాంకు అంచనావేసింది. 2022 ఆర్థిక సంవత్సరానికి వృద్ధి రేటు 5 శాతానికి పుంజుకుంటుందని తెలిపింది. 

గతేడాది అక్టోబర్‌లో ప్రపంచ బ్యాంకు అంచనా వేసిన వృద్ధిరేటు కంటే ఇది 1.2-1 శాతం తక్కువగా ఉండటం గమనార్హం. ఆర్థిక రంగంలో నెలకొన్న బలహీనతల వల్ల భారత వృద్ధిరేటు ఇప్పటికే మందగమనంలో కొనసాగుతున్నదని, ఇలాంటి తరుణంలో కొవిడ్‌-19 మహమ్మారి విజృంభించడం దేశ ఆర్థిక వ్యవస్థకు మరింత పెద్ద గుదిబండలా మారిందని ప్రపంచ బ్యాంకు తన నివేదికలో పేర్కొన్నది. 

మార్చితో ముగిసిన 2019-20 ఆర్థిక సంవత్సరంలో దేశ జీడీపీ వృద్ధి 4.8 నుంచి 5 శాతం మధ్య ఉంటుందని  ప్రపంచబ్యాంకు స్పష్టం చేసింది. భారతదేశ ఆర్థిక వ్యవస్థ మందగమనంలో ఉన్న సమయంలోనే కొవిడ్-19 విస్తరించిందని పేర్కొంది. లాక్‌డౌన్ వల్ల సరఫరా, డిమాండ్ తగ్గి వృద్ధిరేటు మరింత క్షీణిస్తోందని వెల్లడించింది.

కరోనా వైరస్‌ వ్యాప్తిని నిరోధించేందుకు కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ విధించడంతో అనేక కర్మాగారాలు, వ్యాపారాలు మూతపడ్డాయి. విమాన, రైలు, రోడ్డు రవాణా వ్యవస్థలు స్తంభించిపోవడం వల్ల సరుకు రవాణా గణనీయంగా తగ్గడం, సరఫరా, డిమాండ్‌ భారీగా తగ్గిపోవడంతో ఈ ఏడాది వృద్ధిరేటు మరింత దిగజారుతుందని ప్రపంచ బ్యాంకు అభిప్రాయపడింది.

also read కరోనా కట్టడే లక్ష్యం:ఇమ్యూనేషన్ పెంచుకోండి.. ఆయుష్ శాఖ అడ్వైజ్

ముఖ్యంగా సేవల రంగానికి తీవ్ర నష్టం వాటిల్లవచ్చని, అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థలో నెలకొన్న ప్రతికూలతల వల్ల దేశీయ పెట్టుబడుల్లో జాప్యం జరుగవచ్చని తెలిపింది. 

భారత్​లో లాక్​డౌన్​ ఎక్కువ కాలం కొనసాగితే ఆర్థిక వ్యవస్థ ఫలితాలు అంచనాల కంటే దారుణంగా ఉండే అవకాశం ఉన్నట్లు ప్రపంచబ్యాంకు ముఖ్య ఆర్థికవేత్త హాన్స్ టిమ్మర్ పేర్కొన్నారు. ప్రస్తుతం వైరస్ వ్యాప్తిని తగ్గించడంపైనే ప్రభుత్వం దృష్టిసారించి, అందరికీ ఆహారం అందేలా చూడాలని సూచించారు.

‘ఆర్థిక వ్యవస్థను తిరిగి పుంజుకునేలా చేయడంపై దృష్టిసారించడం చాలా ముఖ్యం. తాత్కాలిక ఉద్యోగ కల్పన వంటి ప్రయత్నాలు ఆర్థిక వ్యవస్థకు ఊతమిస్తాయి.

చిన్న, మధ్య స్థాయి పరిశ్రమలు దివాలా తీయకుండా జాగ్రత్తపడాలి. భారత్​ను ఆర్థికంగా, సామాజికంగా సుస్థిరమైన దారిలో పెట్టడానికి దీర్ఘకాలంలో ఇది ఒక మంచి అవకాశం’ అని ప్రపంచబ్యాంకు ముఖ్య ఆర్థిక వేత్త హన్స్ టిమ్మర్ తెలిపారు. 

ఆసియ దేశాల వృద్ధి రేటు 1.8-2.8 శాతం మధ్య నమోదవుతుందని ప్రపంచబ్యాంకు తన నివేదికలో పేర్కొంది. ఇది ఆరు నెలల క్రితం అంచనా వేసిన దానికంటే (6.3) చాలా తక్కువ.గత 40 ఏండ్లలో ఇదే అత్యల్ప వృద్ధిరేటు అని తెలిపింది. దక్షిణాసియాలో భారత్‌తోపాటు శ్రీలంక, నేపాల్‌, భూటాన్‌, బంగ్లాదేశ్‌, పాకిస్థాన్‌, అఫ్గానిస్థాన్‌, మాల్దీవులు ఉన్నాయి. 

ఈ ఏడాది దక్షిణాసియా జీడీపీ వృద్ధిరేటు 6.3 శాతంగా ఉండవచ్చని గతేడాది అక్టోబర్‌లో అంచనా వేసింది. కానీ కరోనా సంక్షోభం ముంచుకురావడంతో ప్రస్తుతం ప్రపంచ బ్యాంకు తన అంచనాను గణనీయంగా కుదించింది.

ఈసారి చైనా జీడీపీ కూడా దారుణంగా క్షీణిస్తుందని పేర్కొన్నది. ప్రపంచ జీడీపీలో 16 శాతంగా ఉన్న చైనా వాటా ఇప్పటికే 6 శాతానికి పడిపోయింది. మున్ముందు ఇది 5 శాతానికి దిగజారుతుందని ప్రపంచ బ్యాంకు అంచనా వేసింది.

మరోవైపు స్వస్థలాలకు మరలుతున్న వలస కార్మికులు కరోనా వైరస్ వాహకాలుగా మారే ప్రమాదం ఉందని ప్రపంచ బ్యాంకు హెచ్చరించింది. వీరి వల్ల కరోనా వైరస్ ప్రభావం లేని ప్రాంతాలకు మహమ్మారి విస్తరించే అవకాశముందని అభిప్రాయపడింది.

ఇదిలా ఉటే కాగా, ఈ ఏడాది భారత జీడీపీ వృద్ధిరేటు 4 శాతానికి క్షీణిస్తుందని ఆసియా అభివృద్ధి బ్యాంకు, 2 శాతానికి పతనమవుతుందని ఫిచ్‌ రేటింగ్స్‌, 3.5 శాతానికి దిగజారుతుందని ఎస్‌అండ్‌పీ గ్లోబల్‌ రేటింగ్స్‌, 3.6 శాతానికి తగ్గుతుందని ఇండియా రేటింగ్స్‌ అండ్‌ రిసెర్చ్‌, 2.5 శాతానికి పతనమవు తుందని మూడీస్‌ ప్రకటించాయి.
 
click me!