లాక్‌డౌన్ ఎఫెక్ట్: అవి చూడటం ఎక్కువైంది...దీంతో తగ్గుతున్న ఇంటర్నెట్​ ‘డౌన్‌లోడ్‌’ స్పీడ్...

By Sandra Ashok Kumar  |  First Published Apr 11, 2020, 3:39 PM IST

కరోనాను కట్టడి చేయడానికి విధించిన లాక్ డౌన్ వల్ల ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రాలేక.. కాలక్షేపం కోసం ఇంటర్నెట్ విపరీతంగా వాడుతున్నారు. ముఖ్యంగా వీడియోలు, సినిమాలు చూడటం ఎక్కువైంది. ఫలితంగా డౌన్‌లోడ్‌ స్పీడ్‌ తగ్గిపోతోందని 'స్పీడ్‌ టెస్ట్‌' సేవల సంస్థ ఓక్లా పేర్కొంది.
 


న్యూఢల్లీ: కరోనా వైరస్‌ వ్యాధి (కొవిడ్‌-19) వ్యాప్తి అడ్డుకునేందుకు ప్రభుత్వాలు విధించిన ‘లాక్‌డౌన్‌’ వల్ల అత్యవసర సేవల విభాగం వారిని మినహామిస్తే మిగిలిన వారంతా ఇళ్లకే పరిమితం కావలసి వచ్చింది. కొంతమందికి మాత్రమే ‘వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌’ కు అవకాశం ఉంది. 


మిగతా వారంతా ఇంట్లో ఉండి ఏం చేయాలి... కాసేపు వాట్సప్‌ చూడటం, మెసేజ్‌లు షేర్‌ చేయటం లేదా సోషల్‌ మీడియాలో అభిప్రాయాలు తెలుసుకోవటం, స్పందించటం, లేదా కంప్యూటర్‌ ఆన్‌చేసి నెట్‌లో సినిమాలు- సీరియళ్లు చూడటం....ఇలా ఏదో విధంగా సమయం గడపాల్సి ఉంటుంది.

Latest Videos

అదే కాకుండా ఎన్నో రకాలైన చెల్లింపులు, కొనుగోళ్లు.. అన్నీ ఆన్‌లైన్లో నిర్వహించాల్సి పరిస్థితి. వీటన్నింటికీ ఇంటర్నెట్‌ కనెక్షన్‌ తప్పనిసరి. ఇంట్లో అయితే ఫిక్స్‌డ్‌ బ్రాడ్‌బ్యాంక్‌ కనెక్షన్‌ ఉంటుంది. లేకపోతే  మొబైల్‌ ఫోన్‌లో డేటా కనెక్షన్‌ ద్వారా ఇంటర్నెట్‌ వాడుకోవచ్చు. 

ప్రస్తుత పరిస్థితుల్లో నెట్‌ కనెక్షన్‌ లేకపోతే ఇళ్లలో ప్రజలకు తోచదు. అందుకే నెట్‌ను తెగ వాడుతున్నారు. ముఖ్యంగా వీడియోలు, సినిమాలు చూడటం పెరిగింది. దీంతో ‘డౌన్‌లోడ్‌ స్పీడ్‌’ తగ్గిపోతోంది.

ఈ ఏడాది ఫిబ్రవరితో పోల్చితే మార్చి నెలలో మనదేశంలో వేగం తగ్గినట్లు ‘స్పీడ్‌ టెస్ట్‌’ సేవల సంస్థ అయిన ఓక్లా వెల్లడించింది. అటు ఫిక్స్ డ్ లైన్లు, మొబైల్ ఫోన్లలోనూ ఇంటర్నెట్ డౌన్ లోడ్ వేగం తగ్గిందని పేర్కొంది.

also read  జియో కస్టమర్లకు గుడ్ న్యూస్...ఇక ప్రతి రీచార్జీ పై క్యాష్ బ్యాక్...

తాజాగా ఈ సంస్థ విడుదల చేసిన ‘ఓక్లా స్పీడ్‌టెస్ట్‌ గ్లోబల్‌ ఇండెక్స్‌’ ప్రకారం మార్చి నెలలో మనదేశం మొబైల్‌ డౌన్‌లోడ్‌ స్పీడ్‌ విభాగంలో 130వ స్థానంలో, ఫిక్స్‌డ్‌ బ్రాడ్‌బ్యాండ్‌ విషయంలో 71వ స్థానంలో నిలిచింది. అంతకు ముందు నెలతో పోల్చిచూస్తే ఈ రెండు విభాగాల్లో మనదేశం రెండేసి స్థానాల చొప్పున దిగజారింది. 

డౌన్‌లోడ్‌ స్పీడ్‌ విషయంలో సింగపూర్‌, బ్రిటన్ అగ్రస్థానాల్లో ఉన్నాయి. మనదేశంలో సగటున మొబైల్‌ డౌన్‌లోడ్‌ వేగం ఈ ఏడాది ఫిబ్రవరిలో 11.83 ఎంబీపీఎస్‌ ఉండగా, మార్చి నెలలో 10.15 ఎంబీపీఎస్‌‌కు కుదించుకుపోయింది. అదేవిధంగా ఫిక్స్‌డ్‌ బ్రాడ్‌బ్యాండ్‌ సగటు డౌన్‌లోడ్‌ వేగం ఫిబ్రవరిలో 39.65 ఎంబీపీఎస్‌ ఉండగా, మార్చిలో 35.98 ఎంబీపీఎస్‌కే పరిమితం అయింది.

ఈ ఏడాది జనవరితో పోల్చినా కూడా మార్చి నెలలో డౌన్‌లోడ్‌ స్పీడ్‌ బాగా తక్కువగా ఉండటం గమనార్హం. ఈ ఏడాది జనవరిలో డౌన్‌లోడ్‌ వేగం సగటు 41.48 ఎంబీపీఎస్‌ నుంచి మార్చి నెలలో 35.98 ఎంబీపీఎస్‌కు దిగివచ్చింది. 

వినియోగం ఎంతో అధికంగా ఉన్నప్పుడు డౌన్‌లోడ్‌ వేగం తగ్గటం సాధారణమేనని, అదే భారతదేశంలో కనిపిస్తోందని ఓక్లా సీఈఓ డగ్‌ సట్లెస్‌ పేర్కొన్నారు. కొన్ని ఐఎస్‌బీ నెట్‌వర్క్‌లపై ఎంతో ఒత్తిడి కనిపిస్తోందన్నారు.

కొవిడ్‌-19 సవాల్ ఎదురైనప్పటి నుంచీ ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాల్లో డౌన్‌లోడ్‌ స్పీడ్‌ తీరుతెన్నులను ఓక్లా విశ్లేషిస్తోంది. మొబైల్‌, ఫిక్స్‌డ్‌ బ్రాడ్‌బ్యాండ్‌ నెట్‌వర్క్‌ ఇంటిలిజెన్స్‌ సేవల విభాగంలో ఈ సంస్థ క్రియాశీలకంగా వ్యవహరిస్తోంది.

click me!