జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో కరోనా వైరస్ బారిన పడి ఆదివారం నాడు ఉదయం ఓ వ్యక్తి మృతి చెందాడు
శ్రీనగర్: జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో కరోనా వైరస్ బారిన పడి ఆదివారం నాడు ఉదయం ఓ వ్యక్తి మృతి చెందాడు. మృతుడి వయస్సు 62 ఏళ్లుగా గుర్తించారు.జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో ఈ మరణంతో కరోనా వైరస్ కారణంగా మృతి చెందినవారి సంఖ్య రెండుకు చేరుకొంది.
also read:హృదయ విదారకరమైన వలస కూలీల స్థితి: వందలాది కిలోమీటర్ల కాలినడక
బారాముల్లా జిల్లాలోని తంగ్ మార్గ్ ఏరియాకు చెందిన వృద్దుడు ఈ వైరస్ తో మృతి చెందినట్టుగా అధికారులు ప్రకటించారు. మృతుడు లివర్ సమస్యతో బాధపడుతున్నాడు.ఈ విషయాన్ని శనివారం నాడు గుర్తించి అతడికి వెంటిలేటర్ పై చికిత్స అందించారు.అయితే ఆదివారం నాడు ఉదయం 4 గంటలకు అతను మృతి చెందినట్టుగా అధికారులు ప్రకటించారు.
కరోనా వైరస్ కారణంగా అతను మరణించాడని అధికారులు తేల్చారు. కరోనా వైరస్ ప్రబలకుండా ఉండేందుకు గాను ప్రజలంతా ఇంటి వద్దే ఉండాలని అధికారులు కోరుతున్నారు.
కరోనా వ్యాప్తి చెందకుండా ఉండేందుకు వీలుగా ప్రభుత్వం చేసిన సూచనలకు అనుగుణంగా ప్రజలు నడుచుకోవాలని అధికారులు సూచించారు. ఇంటి నుండి బయటకు వస్తే ఈ వైరస్ వ్యాపించే ప్రమాదం ఉందని అధికారులు చెప్పారు.
ఈ నెల 19వ తేదీన శ్రీనగర్ కు చెందిన 65 ఏళ్ల వ్యక్తి మృతిచెందాడు. కరోనా వైరస్ కారణంగానే ఆయన మృతి చెందినట్టుగా అధికారులు ప్రకటించారు. మృతుడు అండమాన్ నికోబార్ తో పాటు ఢిల్లీకి వెళ్లి వచ్చినట్టుగా అధికారులు గుర్తించారు.
రాష్ట్రంలో కరోనా కారణంగా తొలి మరణం సంభవించిన తర్వాత ప్రార్థనా మందిరాలను మూసివేయాలని అధికారులు ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే.