హృదయ విదారకరమైన వలస కూలీల స్థితి: వందలాది కిలోమీటర్ల కాలినడక
ఢిల్లీ వలస కూలీల పరిస్థితి హృదయవిదాకరంగా ఉంది. ఉత్తరప్రదేశ్, బీహార్ రాష్ట్రాల్లోి తమ స్వస్థలాలకు చేరుకోవడానికి వారు చేస్తున్న ప్రయత్నాలు గుండెలను పిండిస్తున్నాయి. వందలాది కిలోమీటర్లు కాలినడక బయలుదేరుతున్నారు.
ఢిల్లీ: కోవిడ్ 19ను కట్టడి చేసే క్రమంలో ప్రకటించిన లాక్ డౌన్ నేపథ్యంలో దేశ రాజధాని ఢిల్లీ నుంచి లక్షలాది మంది వలస కార్మికులు తమ స్వస్థలాలకు బయలుదేరారు. ఉత్తరప్రదేశ్, బీహార్ రాష్ట్రాల్లోని తమ స్వస్థలాలకు చేరుకోవడానికి వారు ఢిల్లీ, ఉత్తరప్రదేశ్ సరిహద్దుల్లో గుమికూడారు.
ఢిల్లీలోని బస్సు స్టేషన్లలో నిలిచిపోయిన కార్మికులను స్వస్థలాలకు చేర్చడానికి ఉత్తరప్రదేశ్, ఢిల్లీ ప్రభుత్వాలు 500 బస్సులు ఏర్పాటు చేశాయి. తమ స్వస్థలాలకు చేరుకోవడానికి కూలీలు కాలినడకన బయలుదేరిన హృదయం ద్రవించే దృశ్యాలు చోటు చేసుకున్నాయి. రైళ్లు, బస్సులు బంద్ కావడంతో వారు కాలినడనక తమ స్వస్థలాలకు చేరుకోవానికి ప్రయత్నిస్తున్నారు.
గత మూడు రోజుల్లో రాష్ట్రానికి చేరుకున్న 1.5 లక్షల వలస కూలీలను గుర్తించాలని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్ జిల్లా మెజిస్ట్రేట్లను ఆదేశించారు. వారిని క్వారంటైన్ చేయాలని, వారికి అవసరమైన ఆహరం, కనీసావసరాలు కల్పించాలని ఆదేశించారు. వారి పేర్లను, చిరునామాలను, ఫోన్ నెంబర్లను ఇచ్చి అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు
Also Read: లాక్ డౌన్: 200 కిమీ నడిచి, హైవేపై కుప్పకూలి తుదిశ్వాస విడిచాడు
రాష్ట్రానికి చేరుకున్న వలస కూలీలు తప్పనిసరిగా 14 రోజుల క్వారంటైన్ కు వెళ్లాల్సిందేనని ఆదేశించారు. వాళ్లను ఇళ్లకు పంపించేది లేదని, 14 రోజుల క్వారంటైన్ తర్వాత తదుపరి చర్యలు తీసుకుంటామని డిప్యూ సీఎం కేశవ్ ప్రసాద్ మౌర్య చెప్పారు. తగిన ఏర్పాటు చేయాల్సిందని కోరుతూ గ్రామ పెద్దలకు శనివారం రాత్రి 65 వేల కాల్స్ వచ్చాయి.
రాష్ట్రానికి వచ్చినవారిని గుర్తించి క్వారంటైన్ కు పంపించడానికి నోడల్ అధికారులను నియమించారు. వలస కూలీల జాబితా తయారు చేయాలని గ్రామాలకు చెందిన వివిధ సంస్థలను ఆదేశించారు. శనివారం రాత్రి యూపిలోని డోరియా జిల్లాకు కొన్ని బ్యాచ్ లు వచ్చాయి. థర్మల్ స్కానింగ్ చేసిన వారిని ఇళ్లకు పంపించారు.
సరిహద్దు జిల్లాల్లో పునరావాస శిబిరాలను ఏర్పాటు చేయాలని బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ఆదేశించారు. ఢిల్లీ నుంచి వచ్చినవారిని ఆ శిబిరాల్లో ఉంచాలని ఆయన సూచించారు. 14 రోజుల క్వారంటైన్ తర్వాత వారిని ఇళ్లకు పంపిస్తారు. బస్సుల ద్వారా వలస కూలీలను రాష్ట్రాలకు పంపిస్తే లాక్ డౌన్ ప్రయోజనం దెబ్బ తింటుందని నితీష్ కుమార్ అంటున్నారు. వలస కూలీలను పంపించడానికి బస్సులను ఏర్పాటు చేయడాన్ని ఆయన తప్పు పట్టారు.