కరోనాను కట్టడి చేయడానికి దేశవ్యాప్తంగా విధించిన లాక్‌డౌన్‌తో వర్క్ ఫ్రం హోం చేస్తున్న ఐటీ ఉద్యోగులు తర్వాత కూడా దానికే ప్రాధాన్యం ఇవ్వొచ్చునని ఇన్ఫోసిస్ సహా వ్యవస్థాపకుడు క్రిస్ గోపాలకృష్ణన్ వ్యాఖ్యానించారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఉద్యోగాల నియామకాలు ఉండవని, ఉద్యోగాల్లో కోతలు కూడా విధించే అవకాశాలు ఉన్నాయన్నారు.
బెంగళూరు: కరోనా మహమ్మారిని నియంత్రించడానికి దేశవ్యాప్తంగా విధించిన లాక్‌డౌన్ ముగిసి సాధారణ పరిస్థితులు ఏర్పడినా దాదాపు పది లక్ష మంది ఐటీ ఉద్యోగులు ఇళ్ల నుంచే పనిచేసేందకే మొగ్గుచూపుతారని ఇన్ఫోసిస్ సహా వ్యవస్థాపకులు క్రిస్ గోపాలకృష్ణన్ అభిప్రాయపడ్డారు.
కరోనా నియంత్రణ కోసం విధించిన లాక్‌డౌన్ సమయంలో ఐటీ సంస్థలు తమ ఉద్యోగులను ఇళ్ల నుంచే పనిచేసేలా మార్పులు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో 20 నుంచి 30 శాతం మంది ఐటీ ఉద్యోగులు లాక్‌డౌన్ తర్వాత ఇంటి నుంచి పని చేసేందుకే ఆసక్తి చూపుతారని గోపాలకృష్ణన్ అన్నారు.
ఇంటి నుంచి పనిచేయనుండటంతో చిన్న స్థాయి స్టార్టప్‌లకు భారీ ప్రయోజనం చేకూరనున్నది. ఇప్పటికే పలు భారతీయ స్టార్టప్ సంస్థలు తమ ఉద్యోగులు ఇళ్ల నుంచి మరింత సమర్థవంతంగా పనిచేస్తున్నట్లు గుర్తించాయి. ఆఫీస్ ఉండాల్సిన అవసరం లేకపోవడంతో నిర్వహణ ఖర్చులు తగ్గి ఆర్థిక ప్రయోజనం కూడా చేకూరనున్నదని గోపాలకృష్ణన్ అన్నారు.
సానుకూల పరిస్థితులు నెలకొన్నతర్వాత సంస్థలు ఆఫీస్ స్థలాలపై ప్రత్యేక దృష్టి సారించనున్నారని, దీంతో ఖర్చులు తగ్గనుండటం ఆయా సంస్థలకు ఆర్థికంగా లాభం చేకూరనున్నదని గోపాలకృష్ణన్ తెలిపారు.
‘గతంలో జరిగినట్లు వ్యాపార పద్ధతులు ఉండకపోవచ్చు. సంస్థలు తమకు కార్యాలయ నిర్వహణ కోసం స్థలం లేకపోయినా, రాబోయే రోజుల్లో తమ సేవలను ఎలా అందించాలనే దానిపై దృష్టి సారిస్తున్నాయి’ అని గోపాలకృష్ణన్ అన్నారు.
‘ఉద్యోగులతో ఇళ్ల నుంచే పనిచేయించడం చిన్న విషయం కాదు. ఇప్పటికే పలు ఐటీ రంగ సంస్థలు క్లయింట్ అనుమతితో, ఇళ్ల నుంచి పనిచేసేలా తమ ఉద్యోగులకు టెక్నాలజీతో కూడిన వసతులను కల్పించాయి. దీంతో వ్యాపార విధానం కూడా పూర్తిగా మారిపోనుంది’ అని ఇన్ఫోసిస్ సహా వ్యవస్థాపకులు క్రిస్ గోపాలకృష్ణన్ తెలిపారు.
‘పెద్ద ఐటీ సంస్థల్లో పనిచేస్తున్న 95 శాతం ఉద్యోగులు ప్రస్తుతం ఇళ్ల నుంచే పనిచేస్తున్నారు. ఈ మార్పు చాలా వేగంగా సంభంవించింది. మున్ముందు ఇదే పద్ధతి కొనసాగుతూ, వ్యాపారంలో ఒక భాగం అవుతుంది’’ అని గోపాలకృష్ణన్ అన్నారు.
also read ఆధార్ అప్డేట్ కు గ్రీన్ సిగ్నల్..తప్పులు ఉంటే సరిచేసుకోవచ్చు...
కానీ క్లయింట్ల అనుమతితో బిజినెస్ ప్రాసెసింగ్‌లో మార్పులు చేయాల్సిన అవసరం ఉన్నదని గోపాలకృష్ణన్ వ్యాఖ్యానించారు. దేశవ్యాప్తంగా ఉన్న అతిపెద్ద ఐటీ కంపెనీల్లో పనిచేస్తున్నవారిలో 90 నుంచి 95 శాతం వరకు ఉద్యోగులు ఇంటినుంచి పనిచేస్తున్నారని, పని కూడా వేగవంతంగా పూర్తవుతుండటంతో భవిష్యత్తులో కూడా ఇదే తీరును కొనసాగించే అవకాశాలున్నాయన్నారు.
కరోనా వైరస్‌తో తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్న ఐటీ రంగ సంస్థలు భవిష్యత్‌లో ఉద్యోగుల జీతాల్లో కోత పెట్టే అవకాశాలు మెండుగా ఉన్నాయని గోపాలకృష్ణన్ అభిప్రాయపడ్డారు. కానీ, ఇదే సమయంలో ఉద్యోగుల తొలగింపు భారీ స్థాయిలో ఉండక పోవచ్చునని, ప్రస్తుతం ఉన్న సిబ్బందితోనే భవిష్యత్తులోనూ నడుపవచ్చునని, నియామకాలు చేపట్టే అవకాశాలు లేవని ఆయన స్పష్టంచేశారు.
ఐటీ రంగంలో ఉద్యోగాల కోత లేదని, కొత్త ఉద్యోగుల నియామకం మాత్రం జరగటం లేదని గోపాలకృష్ణన్ పేర్కొన్నారు. ఇది ఐటీ రంగంలో జీతాల కోతకు సంకేతంగా భావించవచ్చని తెలిపారు. కరోనా మహమ్మారి ప్రభావం దాదాపు ఏడాదిన్నర పాటు ఉంటుందని పలు సంస్థలు అంచనావేశాయని, ఇది కొత్త ఉద్యోగులు నియామకంపై కూడా ప్రభావం చూపుతుందని అన్నారు.
కరోనా వైరస్ తగ్గుముఖం పట్టి సానుకూల పరిస్థితులు నెలకొన్న తర్వాత ఐటీ ఉద్యోగులు వర్క్ ఫ్రమ్ హోమ్‌కు ప్రాధాన్యతనిచ్చే అవకాశాలు ఉన్నాయని గోపాలకృష్ణన్ వెల్లడించారు. ఇంటినుంచి పనిచేయడానికి అలవాటు పడిన వారు కార్యాలయాలకు రావడానికి పెద్దగా ఆసక్తి చూపకపోవచ్చని చెప్పారు.