లాక్‌డౌన్ ఎఫెక్ట్: తండ్రికి గుండెపోటు.. ముంబై నుంచి కాశ్మీర్‌కు సైకిల్‌పై ప్రయాణం

By Siva Kodati  |  First Published Apr 5, 2020, 2:35 PM IST

కరోనా కారణంగా భారతదేశంలోని ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు అంతా ఇంతా కాదు. తినడానికి తిండి లేక అవస్థలు పడుతున్న వారిది ఓ బాధ అయితే తల్లిదండ్రులు, ఇతర కుటుంబసభ్యులు వేరే ప్రాంతంలో ఉంటే వాళ్ల గురించి ఆందోళన చెందుతున్న వారి పరిస్ధితి మరో బాధాకర పరిస్ధితి


కరోనా కారణంగా భారతదేశంలోని ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు అంతా ఇంతా కాదు. తినడానికి తిండి లేక అవస్థలు పడుతున్న వారిది ఓ బాధ అయితే తల్లిదండ్రులు, ఇతర కుటుంబసభ్యులు వేరే ప్రాంతంలో ఉంటే వాళ్ల గురించి ఆందోళన చెందుతున్న వారి పరిస్ధితి మరో బాధాకర పరిస్ధితి.

ఈ నేపథ్యంలో ఓ వ్యక్తి తన తండ్రి కోసం ఏకంగా 2,100 కిలోమీటర్లు సైకిల్‌పై ప్రయాణం మొదలుపెట్టాడు. వివరాల్లోకి వెళితే.. ముంబైకి చెందిన ఆరిఫ్ వాచ్‌మెన్‌గా పనిచేస్తున్నాడు. మంగళవారం జమ్మూకాశ్మీర్‌లో ఉన్న అతని తండ్రికి గుండెపోటు రావడంతో కుటుంబసభ్యులు ఆరిఫ్‌కు ఫోన్ చేసి సమాచారం అందించారు.

Latest Videos

Aslo Read:కరోనా: ఢిల్లీ ఎయిర్ పోర్టులో ఎనిమిది మంది మలేషియన్ల అరెస్ట్

లాక్‌డౌన్ అమలు, ప్రయాణ సౌకర్యాలు నిలిపివేయడంతో ఏం చేయాలో అర్ధం కానీ పరిస్ధితి. అటు తండ్రి పరిస్ధితి విషమంగా ఉందని, వెంటనే రావాలంటూ కుటుంబసభ్యులు కన్నీటి పర్యంతమవుతుండటంతో ఆరిఫ్‌ దిక్కుతోచని స్థితిలో పడిపోయాడు.

తండ్రిని ఎలాగైనా రక్షించుకోవాలని ఓ వ్యక్తి దగ్గర సైకిల్‌ను రూ.500కు కొనుగోలు చేసి గురువారం ఉదయం 10 గంటలకు జమ్మూకాశ్మీర్‌లోని రాజౌరీకి పయనమయ్యాడు. మధ్యలో కొందరు పోలీసులు తనను ఆపినప్పుడు వారికి తన పరిస్ధితిని తెలియజేసినప్పటికీ వారి నుంచి ఎలాంటి సాయం అందలేదని ఆరిఫ్ ఆవేదన వ్యక్తం చేశాడు.

Also Read:దేశంలో కరోనా ఈ వయస్సు వారికే ఎక్కువగా సోకుతుంది: కేంద్రం

ప్రస్తుతానికి ఆరిఫ్ మహారాష్ట్రను దాటి గుజరాత్‌లోకి అడుగుపెట్టాడు. ముంబై నుంచి కేవలం రూ.800తో బయల్దేరానని.. తన మొబైల్‌లో ఛార్జింగ్ కూడా అయిపోయిందని అతను ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. తండ్రిని కాపాడుకోలేకపోయినా.. ఆయన చివరి చూపు దక్కినా చాలని ఆరిఫ్ చెప్తున్న తీరు కలచివేసింది.

రాత్రుళ్లు రోడ్డు పక్కన పడుకుని వేకువజామునే మళ్లీ ప్రయాణం చేస్తున్నానని అతను చెప్పాడు. అయితే లాక్‌డౌన్ వల్ల ఆహారం దొరకడం లేదని, కేవలం బిస్కెట్లు మాత్రమే తింటున్నాడు. ఇక ఆరిఫ్ విషయం జమ్మూకాశ్మీర్ అధికారుల దృష్టికి వెళ్లగా అతనికి సాయం చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. 

click me!