లాక్‌డౌన్ ఎఫెక్ట్: జీరో స్థాయికి పడిపోయిన ఆటోమొబైల్ సేల్స్

By Sandra Ashok Kumar  |  First Published May 1, 2020, 2:03 PM IST

కరోనా మహమ్మారి ప్రభావంతో లాక్ డౌన్ వల్ల దేశవ్యాప్తంగా ఆటోమొబైల్ సేల్స్ జీరో స్థాయికి పడిపోయాయి. ఇప్పటికే మారుతి సుజుకి విక్రయాలు లేవని రెగ్యులేటరీ ఫైలింగ్ లో వెల్లడించాయి. కానీ మిగతా సంస్థల నుంచి అధికారికంగా ధ్రువీకరణ వెల్లడి కాలేదు.


ముంబై: కరోనా మహమ్మారి విసిరిన సవాల్ ఫలితాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. లాక్‌డౌన్‌తో ఆర్థిక కార్యకలాపాలు పూర్తిగా స్థంభించిపోవడంతో  దిగ్గజాలు సైతం కకావికలం అవుతున్నాయి. 

దీనికి భారతదేశపు అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి ఇండియా లిమిటెడ్ (ఎంఎస్ఐఎల్) తాజా ఉదాహరణగా నిలిచింది. ఏప్రిల్‌లో దేశీయ మార్కెట్లో ఎలాంటి విక్రయాలను నమోదు చేయలేదు. కరోనా వైరస్ మహమ్మారి వ్యాప్తిని అరికట్టేందుకు లాక్‌డౌన్ ఆంక్షలతో మారుతి ఆఫీసులకు తాళాలు పడ్డాయి. 

Latest Videos

మారుతి సుజుకి ఇండియా ఉత్పాదక ప్లాంట్లు మూత పడ్డాయి. ఉత్పత్తి నిలిచిపోయింది. మార్చి 24 నుండి దేశ ప్రజంతా లాక్‌డౌన్ నిబంధనలను కఠినంగా అమలు చేసేందుకు ఇళ్లకే పరిమితమయ్యారు. దీంతో ఒక్క కారు కూడా విక్రయానికి నోచుకోలేదు.

ఏప్రిల్ నెలలో దేశీయ మార్కెట్లో మారుతి సుజుకి అమ్మకాలు శూన్యమని మారుతి శుక్రవారం నాటి రెగ్యులేటరీ ఫైలింగ్‌లో తెలిపింది. ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా అన్ని ఉత్పత్తి సౌకర్యాలు మూసివేయడంతో అమ్మకాలు లేవని పేర్కొన్నది.

also read లాక్‌డౌన్ లో ఆటోమొబైల్‌ కంపెనీల కొత్త మార్గాలు.. ఆన్‌లైన్‌ ద్వారా కార్ల అమ్మకాలు..

ఏప్రిల్‌లో ఇతర ఒరిజినల్ పరికరాల తయారీ సంస్థ (ఓఇఎం) అమ్మకాలు కూడా లేవని  అయితే కంపెనీ 632 యూనిట్లను ఎగుమతి చేసినట్టు మారుతి సుజుకి వెల్లడించింది. కాగా లాక్‌డౌన్ నేప‌థ్యంలో మారుతి సుజుకి కంపెనీ జూన్ 30వ తేదీ వ‌ర‌కు కార్ల ఉచిత స‌ర్వీస్‌, ఎక్స్‌టెండెడ్ వారంటీ తేదీల గ‌డువును పొడిగించిన‌ట్లు గ‌తంలోనే తెలిపింది.

ఎంజీ మోటార్స్ కూడా శుక్రవారం రెగ్యులేటరీ ఫైలింగ్‌లో జీరో సేల్స్ నమోదయ్యాయని తెలిపింది. దేశవ్యాప్త లాక్ డౌన్ వల్ల షోరూమ్ లను మూసివేశామని పేర్కొన్నది. అయితే హలోల్ ప్లాంటులో గత నెల చివరి వారంలో కొద్దిస్థాయిలో ఎంజీ మోటార్స్ ఉత్పత్తి ప్రారంభించింది. లోకల్ సప్లయి చైన్ సపోర్టుతో ఈ నెలలో ఉత్పత్తి పెరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేసింది. 

కరోనా మహమ్మారి నియంత్రణ కోసం పరిశుభ్రత పాటించడంతోపాటు సామాజిక దూరం పాటిస్తున్నామని ఎంజీ మోటార్స్ తెలిపింది. మిగతా ఆటోమొబైల్ సంస్థలు కూడా జీరో సేల్స్ కు పరిమితం అయ్యాయి. కానీ రెగ్యులేటరీ ఫైలింగ్, అధికారిక ధ్రువీకరణ కోసం ఎదురు చూస్తున్నాయి.

click me!