కరోనా మహమ్మారిని నియంత్రించడానికి విధించిన లాక్‌డౌన్ పొడిగించడం వల్ల మొదటికే మోసం వస్తుందని ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు ఎన్ఆర్ నారాయణమూర్తి పేర్కొన్నారు. లాక్ డౌన్ కొనసాగించడం వల్ల కరోనా కాదు, ఆకలే చంపేస్తుందన్నారు. భారతదేశంలో లాక్ డౌన్ పొడిగించే అవకాశం లేదని, ఒకవేళ పొడిగిస్తే 19 కోట్ల మంది ఉపాధి గల్లంతవుతుందన్నారు.
న్యూఢిల్లీ: కరోనా మహమ్మారిని సాధారణ విషయంగానే భావించాల్సిన అవసరం ఉందని, పేదలను ఆదుకుంటూ మన పనులను తిరిగి ప్రారంభించాలని ఇన్ఫోసిస్ ఫౌండర్ ఎన్‌ఆర్ నారాయణ మూర్తి సూచించారు. ప్రస్తుత పరిస్థితుల్లో లాక్‌డౌన్‌ను మనదేశం ఎక్కువ కాలం కొనసాగించలేదని చెప్పారు.
అత్యధిక కాలం పాటు లాక్‌డౌన్‌ను పొడిగిస్తే.. కరోనా కంటే ఎక్కువ మంది జనం ఆకలితో చనిపోతారని ఎన్ఆర్ నారాయణమూర్తి అన్నారు. బిజినెస్ లీడర్లతో వెబినార్‌లో ఆయన మాట్లాడుతూ అసంఘటితరంగంలో 19 కోట్ల మంది ఉపాధి కోల్పోతారని చెప్పారు.
దేశంలో సగటున ఏటా 90 లక్షల మంది వేర్వేరు కారణాలతో చనిపోతున్నారని, ఇందులో మూడో వంతు కాలుష్యంతోనే మరణిస్తున్నారని ఎన్నార్ నారాయణమూర్తి తెలిపారు. వీటితో పోల్చుకుంటే కరోనా మరణాలు చాలా తక్కువని, కానీ లాక్‌డౌన్ పొడిగిస్తే కరోనా మరణాల కంటే ఆకలి చావుల సంఖ్య పెరుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు.
also read వాట్సాప్ మరో కొత్త ఫీచర్... అర్హులైన వారికి లోన్స్..
భారత దేశంలో కరోనా మరణాల రేటు పాజిటివ్ కేసుల్లో 0.25–0.50 శాతం ఉందని, ఇది అభివృద్ధి చెందిన దేశాల కంటే చాలా తక్కువని ఎన్నార్ నారాయణమూర్తి అన్నారు. ఈ ఏడాది చాలా బిజినెస్‌ల్లో ఆదాయం 15–20 శాతం వరకు నష్టపోతాయని, దాని ప్రభావం ప్రభుత్వ ట్యాక్స్‌లు, జీఎస్‌టీ కలెక్షన్లపై పడుతుందని మూర్తి చెప్పారు.
ఇండియాలో కరోనా టెస్టింగ్‌లు ఇప్పటికీ తక్కువగానే ఉన్నాయని, వీటి సంఖ్య పెరగాలని ఎన్నార్ నారాయణ మూర్తి తెలిపారు. చైనాలో టెస్టింగ్ రేటు పెరిగినట్టే ఇండియాలో కూడా టెస్టింగ్ రేటును పెంచాల్సిన అవసరం ఉందన్నారు.
కరోనా వ్యాక్సిన్ తయారు చేయడానికి గ్లోబల్‌గా ప్రయత్నాలు జరుగుతున్నాయని నారాయణ మూర్తి చెప్పారు. ఈ వ్యాక్సిన్ ఇండియన్ జీన్స్‌కు సరిపడేలా ఉంటుందనే విషయంలో క్లారిటీ లేదని అన్నారు. ఇప్పటి వరకు ఇండియన్ ఎంటర్‌ప్రెన్యూర్‌లు ఎవ్వరూ కొత్త టెస్టింగ్ మెకానిజంతో ముందుకు రాలేదని చెప్పారు.
జీన్స్, వాతవరణ పరిస్థితులు లేదా బీసీజీ వ్యాక్సిన్ వలనే కరోనా మరణాలు తక్కువగా ఉన్నాయని ఇన్ఫోసిస్ ఫౌండర్ నారాయణమూర్తి అభిప్రాయపడ్డారు. ఈ విషయాలపై రీసెర్చ్ చేయాలని సూచించారు. వృద్ధులు, హెల్త్ ఇష్యూస్ ఉన్నవాళ్లు సోషల్ డిస్టెన్స్‌ను పాటించాలని, మాస్కులు కట్టుకోవాలని, పేదవాళ్లను ఆదుకోవాలని సూచించారు. సోషల్ డిస్టెన్సింగ్ ఫాలో అవ్వడానికి కంపెనీలు ఒక షిప్ట్‌ను కాకుండా మూడు షిప్ట్‌లను అమలు చేయాలని నారాయణమూర్తి సలహా ఇచ్చారు.