ఆటోమొబైల్స్ కార్యకలాపాలు పున:ప్రారంభం...త్వరలో ఉత్పత్తి..

By Sandra Ashok Kumar  |  First Published May 7, 2020, 11:06 AM IST

కరోనా ‘లాక్ డౌన్’ నిబంధనలను సడలించడంతో దేశీయంగా ఆటోమొబైల్ సంస్థలు కార్యకలాపాలు పున:ప్రారంభించాయి. మారుతి సుజుకి, మెర్సిడెజ్ బెంజ్, టీవీఎస్ మోటార్స్, రాయల్ ఎన్ ఫీల్డ్ తదితర సంస్థలు తమ ఉత్పాదక యూనిట్లలో కార్యకలాపాలు చేపట్టాయి. త్వరలో ఉత్పత్తి ప్రారంభించడానికి కసరత్తు ప్రారంభించాయి.


న్యూఢిల్లీ: మారుతి సుజుకి ఇండియాతోపాటు దేశీయ ఆటోమొబైల్ దిగ్గజ సంస్థలు మెర్సిడెజ్ బెంజ్, టీవీఎస్ మోటార్స్, రాయల్ ఎన్‌ఫీల్డ్, హ్యుండాయ్ మోటార్స్ తదితర సంస్థలు బుధవారం కార్యకలాపాలు పున:ప్రారంభించాయి. 

కరోనా మహమ్మారిని నియంత్రించడానికి మార్చి 25వ తేదీ నుంచి దేశవ్యాప్తంగా లాక్ డౌన్ అమలులోకి వచ్చినప్పటి నుంచి ఈ నెల మూడో తేదీ వరకు అన్ని పరిశ్రమలు మూతపడి ఉన్నాయి. గ్రీన్, ఆరెంజ్ జోన్లలో పారిశ్రామిక, వ్యాపార కార్యకలాపాల నిర్వహణకు నిబంధనలను కేంద్రం సడలించింది. సోమవారం హీరోమోటో కార్ప్స్ కార్యకలాపాలు ప్రారంభించింది. 

Latest Videos

మారుతి సుజుకి దేశవ్యాప్తంగా బుధవారం తనకు గల డీలర్ షిప్‌ల్లో 600 తెరిచింది. హర్యానాలోని మానెసర్ ఉత్పాదక యూనిట్ నుంచి ఈ నెల 12వ తేదీ నుంచి కార్ల ఉత్పత్తి ప్రక్రియ ప్రారంభిస్తామని పేర్కొంది. ఈ యూనిట్ నుంచి సింగిల్ షిప్ట్ విధుల నిర్వహణకు అనుమతించింది. 

దక్షిణ కొరియా ఆటో మేజర్ హ్యుండాయ్ మోటార్స్ ఇండియా తమిళనాడు రాష్ట్ర రాజధాని చెన్నై నగరంలోని ఉత్పాదక యూనిట్‌లో కార్యకలాపాలు ప్రారంభించింది. దేశంలోని వివిధ రాష్ట్రాల పరిధిలోని 250 కంపెనీ డీలర్ షిప్ షోరూములను ప్రారంభించింది.

మహారాష్ట్రలోని పుణె- చకాన్ ఉత్పాదక యూనిట్ నుంచి మెర్సిడెజ్ బెంజ్ ఇండియా ఉత్పత్తి ప్రారంభించింది. అలాగే తమిళనాడు రాష్ట్ర రాజధాని చెన్నై నగర పరిధిలోని టీవీఎస్ మోటార్స్ సంస్థ తన ఉత్సాదక యూనిట్‌లో కార్యకలాపాలు ప్రారంభించింది. హొసూర్, మైసూర్, నాలాగఢ్ లలో గల ఉత్పాదక యూనిట్లలోనూ టీవీఎస్ మోటార్స్ కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి.

also read డోర్ డెలివరీపై మారుతి కేంద్రీకరణ... 12 నుంచి ఉత్పత్తి మొదలు...

ఐచర్‌ మోటార్స్‌కు చెందిన రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ సంస్థ.. తమిళనాడు రాజధాని చెన్నై సమీపంలో ఉన్న ఒరగాడమ్‌ తయారీ యూనిట్‌లో కార్యకలాపాలను బుధవారం ప్రారంభించింది. ఈ సంస్థకు చెన్నైలోని ఒరగాడమ్‌తోపాటు, తిరువొత్తియార్, వల్లమ్‌ వడగల్‌ వద్ద కూడా ప్లాంట్లు ఉన్నాయి. 

తొలుత ఒరగాడమ్‌ ప్లాంట్‌లో కొద్ది మంది సిబ్బందితో ఒకే షిఫ్ట్‌గా పనులు ప్రారంభించినట్టు రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ ప్రకటించింది. తిరువొత్తియార్, వడగల్‌ ప్లాంట్లలో క్రమంగా కార్యకలాపాలను ప్రారంభిస్తామని తెలిపింది. 

హోండా కార్స్ ఇండియా కూడా తన కార్యకలాపాలను పున: ప్రారంభించడానికి సరిపడా సిబ్బంది అందుబాటులో లేరు. రాజస్థాన్‌లోని తపుకరా ప్లాంట్‌కి అనుమతులు గతవారమే వచ్చినా ప్రయాణాలపై ఆంక్షలతో కార్మికులు రావడానికి ఇబ్బందులు ఉన్నాయని వివరించింది. 

వచ్చే వారం కార్యకలాపాలు మొదలుపెట్టే ప్రణాళికల్లో ఉన్నట్లు హోండా కార్స్ ఇండియా పేర్కొంది. అనుమతులు, సిబ్బంది కొరత సమస్యలను అధిగమించాకా గ్రేటర్‌ నోయిడా ప్లాంటులోనూ ఉత్పత్తి ప్రారంభించగలమని హెచ్‌సీఐఎల్‌ సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌  రాజేశ్‌ గోయల్‌ తెలిపారు. అటు, డీలర్‌షిప్‌ల్లో కొన్ని తిరిగి తెరుచుకున్నట్లు వివరించారు.

మరోవైపు యుటిలిటీ వెహికల్ మేకర్ ఇసుజు మోటార్స్ ఇండియా కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని శ్రీసిటీ పరిధిలో ఉత్పాదక కార్యకలాపాలను ప్రారంభించడానికి స్థానిక అధికారుల నుంచి అన్ని రకాల అనుమతులను పొందినట్లు తెలిపింది. అలాగే టైర్ల తయారీ దిగ్గజం ఎంఆర్ఎఫ్ లిమిటెడ్ పాక్షికంగా ఉత్పాదక పనులు ప్రారంభించింది. 

తయారీ కార్యకలాపాలు ప్రారంభించేందుకు సిబ్బంది కొరత సమస్యగా మారిందని హోండా కార్స్‌ ఇండియా (హెచ్‌సీఐఎల్‌) తెలిపింది.  

click me!