కరోనా మహమ్మారి సామాన్యుల నుంచి సంపన్నుల వరకు ప్రతి ఒక్కరిని అల్లకల్లోలం చేస్తున్నది. స్టాక్ మార్కెట్లు ఊచకోతకు గురవుతున్నాయి. వివిధ సంస్థల మార్కెట్ క్యాపిటలైజేషన్ పడిపోతున్నది. ఈ తరుణంలో ఫోర్బ్స్ జాబితా రూపొందించిన బిలియనీర్ల జాబితా సంపద పడిపోయింది. ఈ ఏడాది కుబేరుల జాబితాలో భారతదేశంలో రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ మరోసారి నిలిచారు.
న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి ప్రభావంతో వివిధ దేశాల ఆర్థిక వ్యవస్థలు పతనం కావడంతోపాటు స్టాక్ మార్కెట్లు నష్టాల బాటలో పయనిస్తున్నాయి. అలాగే కుబేరుల సంపద కూడా హరించుకుపోతున్నది. ఫలితంగా ఈ ఏడాది బిలియనీర్ల నికర సంపద 8.7 లక్షల కోట్ల నుంచి 8 లక్షల కోట్ల డాలర్లకు పడిపోయింది.
ఈ నేపథ్యంలో ఫోర్బ్స్ విడుదల చేసిన తాజా కుబేరుల జాబితాలో భారతదేశంలో అగ్రశ్రేణి కుబేరుడిగా.. రిలయన్స్ చైర్మన్ ముకేష్ అంబానీ తన స్థానాన్ని నిలుపుకున్నారు. 36.8 బిలియన్ డాలర్ల సంపదతో ఫోర్బ్స్ ఇండియా బిలియనీర్ల జాబితాలో 2020లో అగ్రస్థానంలో నిలిచారు.
13.8 బిలియన్ల డాలర్ల సంపదతో అవెన్యూ సూపర్ మార్ట్స్ కు చెందిన డీ-మార్ట్ అధిేత రాధాకిషన్ దమానీ రెండో స్థానంలో నిలిచారు. హెచ్సీఎల్ వ్యవస్థాపకుడు శివ్ నాడార్ 11.9 బిలియన్ల డాలర్లతో మూడో స్థానంలో నిలవగా, తర్వాతీ స్థానంలో కొటక్ మహీంద్రాబ్యాంక్ కు చెందిన ఉదయ్ కొటక్ 10.4 బిలియన్ల డాలర్లు ఉన్నాయి.
8.9 బిలియన్ డాలర్లతో గౌతం ఆదానీ, 8.8 బిలియన్ డాలర్లతో ఎయిర్ టెల్ అధినేత సునీల్ మిట్టల్, 8.2 బిలియన్ డాలర్లతో సైరస్ పూనావాలా, 7.6 బిలియన్ డాలర్లతో కుమార మంగళం బిర్లా, 7.4 బిలియన్ డాలర్లతో స్టీల్ టైకూన్ లక్ష్మీ మిట్టల్, 6.1 బిలియన్ డాలర్లతో దిలీప్ సింఘ్వీ, అజీం ప్రేమ్ జీ.. టాప్ -10 జాబితాలో నిలిచారు.
స్టాక్ మార్కెట్లలో నష్టాల వల్ల భారతీయ బిలియనీర్ల జాబితా హరించుకు పోయింది. 2019లో 106 మందిగా ఉన్న భారత బిలియనీర్లు తాజా జాబితాలో 102 మందికి పడిపోయారు. వారి నికర సంపద 23 శాతం తగ్గిపోయి 313 బిలియన్ డాలర్ల వద్ద స్థిర పడింది. మార్చి 18 నాటికి అందుబాటులో ఉన్న మార్కెట్ క్యాపిటలైజేషన్, ఇతర వివరాల ప్రకారం ఫోర్బ్స్ ఈ జాబితాను రూపొందించింది.
also read హెచ్1-బీ వీసాదారులకి షాకింగ్ న్యూస్... అమెరికా సంస్థ వెల్లడి
తొలిసారి ఫోర్బ్స్ జాబితాలో ఎడ్ టెక్ కంపెనీ బైజూ వ్యవస్థాపకుడు బైజు రవీంద్రన్ ఈ జాబితాలో చోటు దక్కించుకున్నారు. ఆయన నికర సంపద 1.8 బిలియన్ డాలర్లుగా రికార్డయింది. భారత దేశంలోని కుబేరుల్లో అత్యంత పిన్న వయస్కుడు బైజు రవీంద్రన్.
ఆసియా-పసిఫిక్ ప్రాంతంలో అత్యధికంగా 778 మంది కుబేరులు ఉండగా, అమెరికాలో 614 మంది, యూరప్ దేశాల్లో 511 మందికి చేరుకున్నారు. దేశాల వారీగా అమెరికా 607 నుంచి 614 మందికి చేరుకుని టాప్‌లో నిలవగా, చైనాలో 324 నుంచి 389 మందికి కుబేరుల సంఖ్య చేరుకున్నది. జర్మనీలో 107 మంది, భారతదేశంలో 102 మంది, రష్యాలో 99 మంది కుబేరులు ఫోర్బ్స్ జాబితాలో లిస్టయ్యారు.
ఇక ప్రపంచ వ్యాప్తంగా బిలియనీర్ల జాబితాలో అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ 113 బిలియన్ డాలర్లతో అగ్రస్థానంలో నిలిచారు. రెండో స్థానంలో మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ 98 బిలియన్ డాలర్లు, మూడో స్థానంలో బెర్నార్డ్ అర్నాల్డ్ కుటుంబం 76 బిలియన్ డాలర్లు, వారెన్ బఫెట్ 67.5 బిలియన్ డాలర్లు, లారీ ఎలిసన్ 58 బిలియన్ డాలర్లు కలిగి ఉన్నారు.
తెలుగు రాష్ట్రాల్లో దివి మురళి కుటుంబం సంపద 3.5 బిలియన్ల డాలర్లు, పీపీరెడ్డి 1.6 బిలియన్ డాలర్లు, పీవీ క్రుష్ణారెడ్డి 1.6 బిలియన్ డాలర్లు, పీవీ రాంప్రసాద్ రెడ్డి 1.4 బిలియన్ డాలర్లతో ఈ జాబితాలో చోటు దక్కించుకున్నారు.