లాక్ డౌన్ పొడిగిస్తే.. ఆర్థిక ఆత్మహత్యలే.. తేల్చేసిన ఆనంద్ మహీంద్రా

By Sandra Ashok KumarFirst Published May 12, 2020, 11:29 AM IST
Highlights

లాక్‌డౌన్‌ ఎక్కువ రోజులు కొనసాగితే ఆర్థిక ఆత్మహత్యలు తప్పవని  మహీంద్రా గ్రూప్‌ చైర్మన్‌ ఆనంద్‌ మహీంద్రా అన్నారు. లక్షల మందిని లాక్‌డౌన్‌ కాపాడుతున్నాచ దాన్ని మరింతగా పొడిగిస్తే సమాజంలోని బలహీన వర్గాలకు తీవ్ర ఇబ్బందులు తలెత్తుతాయని ట్వీట్‌ చేశారు. కరోనా మరణాల్లో ప్రపంచ సగటు 35గా ఉంటే, భారత్‌లో 1.4గానే ఉందని ఆయన గుర్తు చేశారు.  
 

న్యూఢిల్లీ: కరోనాను నియంత్రించడానికి దేశవ్యాప్తంగా విధించిన లాక్ డౌన్ మరికొంతం కాలం పొడిగిస్తే దేశ ఆర్థిక వ్యవస్థకు ఆత్మహత్యా సాద్రుశ్యం అని ప్రముఖ పారిశ్రామిక వేత్త, మహీంద్రా అండ్ మహీంద్రా చైర్మన్ ఆనంద్ మహీంద్రా పేర్కొన్నారు. లక్షల మంది ప్రాణాలను కాపాడటానికి లాక్ డౌన్ అమలు చేసిన మాట నిజమైనా.. ఇంకా పొడిగిస్తే మాత్రం సమాజంలోని బలహీన వర్గాల ప్రజలు తీవ్ర ఇబ్బందుల పాలవుతారని హెచ్చరించారు.

‘కొన్నిరోజులుగా వైరస్ కర్వ్ సమాంతరంగానే ఉంది. కానీ మళ్లీ కొత్త కేసులు పెరిగాయి. ఎక్కువ పరీక్షలు చేయడంతో ఎక్కువ కేసులు కనిపిస్తున్నా దేశ జనాభా, ప్రపంచ దేశాలతో పోల్చుకుంటే తక్కువే’ అని ఆనంద్ మహీంద్రా ట్వీట్ చేశారు.

‘వైరస్ కర్వ్ వెంటనే సమాంతరం అవుతుందని మనం ఆశించొద్దు‘ అని ఆనంద్ మహీంద్రా పేర్కొన్నారు. అయితే, లాక్ డౌన్ సహాయ పడలేదని కూడా భావించొద్దని స్పష్టం చేశారు. 

‘లక్షల మరణాలు సంభవించకుండా సమిష్టి క్రుషితో అడ్డుకున్నాం. భారతదేశంలో ప్రస్తుతం ప్రతి పది లక్షల మందికి చనిపోతున్నది కేవలం 1.4 మంది మాత్రమే. అదే ప్రపంచ దేశాల సగటు 35, అమెరికా సగటు 228గా ఉంది’ అని ఆనంద్ మహీంద్రా గుర్తు చేశారు.

also read మందుబాబులకు గుడ్ న్యూస్: 2 వారాల్లో మద్యం హోం డెలివరీ..

‘వైద్య పరికరాలు, మౌలిక వసతుల కోసం సమయాన్ని ఉపయోగించుకున్నాం. పని చేస్తున్న, ఎదుగుతున్న ఆర్థిక వ్యవస్థ జీవితాలకు రోగ నిరోధక శక్తి వంటిది. లాక్ డౌన్ దానిని బలహీన పరిచి పేదలపై మరింత దుష్ప్రభావం చూపుతుంది’ అని ఆనంద్ మహీంద్రా పేర్కొన్నారు. 

దేశంలో కరోనా మరణాలను తగ్గించడానికి ఆక్సిజన్ వసతులతో కూడిన తాత్కాలిక ‘ఫీల్డ్‘ ఆసుపత్రులను ఏర్పాటు చేయాలని ఆనంద్ మహీంద్రా వెల్లడించారు. విస్త్రుతంగా పరీక్షలు నిర్వహించి, వైరస్ వాహకులను వెతికి పట్టుకోవాలని తెలిపారు. 

జోన్లలో కంటైన్మెంట్ కాకుండా సబ్ పిన్ కోడ్ స్థాయిలో కంటైన్మెంట్ చేయడంపై కేంద్రీకరించాలన్నారు. ‘మనం కరోనా వైరస్ మహమ్మారితో సహజీవనం చేయాల్సిందే. అదేమీ గడువు ముగిసిపోయే పర్యాటక వీసాపై ఇక్కడకు రాలేదు‘ అని ఆనంద్ మహీంద్రా చమత్కరించారు.

click me!