14న లాక్ డౌన్ ఎత్తేసే ఆలోచన లేదు: ప్రధాని నరేంద్ర మోడీ

By telugu teamFirst Published Apr 8, 2020, 3:56 PM IST
Highlights

దేశంలో లాక్ డౌన్ కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. అఖిల పక్ష నేతలతో ప్రధాని నరేంద్ర మోడీ చెప్పిన విషయాలను బట్టి అర్థమవుతోంది. ఈ నెల 14న లాక్ డౌన్ ఎత్తేసే ఆలోచన లేదని మోడీ చెప్పారు.

న్యూఢిల్లీ: ఈ నెల 14ల తేదీన దేశంలో లాక్ డౌన్ ఎత్తేసే ఆలోచన లేదని ప్రధాని నరేంద్ర మోడీ చెప్పారు. బుధవారంనాడు జరిగిన అఖిలపక్ష సమావేశంలో ఆయన కీలకమైన వ్యాఖ్యలు చేశారు. కరోనా వైరస్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో లాక్ డౌన్ ను పొడగించే ఆలోచనలోనే కేంద్రం ఉన్నట్లు కనిపిస్తోంది. 

లాక్ డౌన్ ను ఒకేసారి ఎత్తేయలేమని మోడీ చెప్పారు. కరోనా వైరస్ తర్వాత పరిస్థితులు మునుపటిలా సాధారణంగా ఉండవని ఆయన అన్నారు. కరోనాకు ముందు, కరోనా తర్వాత అనే పరిస్థితులుఉంటాయని ఆయన చెప్పారు. అయితే, ముఖ్యమంత్రులతో మరోసారి చర్చిస్తామని ఆయన చెప్పారు.  

సామూహిక ప్రవర్తనలు, సామాజిక.. వ్యక్తిగత మార్పులు మారాల్సి ఉంటుందని ఆయన వీడియో కాన్ఫరెన్స్ లో రాజకీయ నేతలకు చెప్పినట్లు తెలిసింది.

లాక్ డౌన్ ఎత్తేయాలా, కొనసాగించాలా అనే విషయంపై శనివారం ముఖ్యమంత్రులతో చర్చించిన తర్వాతనే మోడీ తుది నిర్ణయం తీసుకోనున్నారు. శనివారం నాడు ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి అభిప్రాయాలను తీసుకుంటారు. 

తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖ రావు సహా పలువురు ముఖ్యమంత్రులు లాక్ డౌన్ ను కొనసాగించాలని అభిప్రాయపడుతున్నారు. లాక్ డౌన్ తప్ప మరోటి దేశాన్ని కరోనా వైరస్ లేదా కోవిడ్ 19 నుంచి రక్షించలేదని వారు అభిప్రాయపడుతున్నారు.

కరోనావైరస్ నానాటికీ విస్తరిస్తోంది. గత 24 గంటల్లో దేశంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య 5,194కు చేరుకుంది. కొత్తగా 773 కేసులు నమోదయ్యాయి. దేశంలో మరో 35 మరణాలు సంభవించాయి. దశలవారీగా లాక్ డౌన్ ఎత్తేయాలనే ఆలోచనలో కేంద్ర ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. ఆర్థిక వ్యవస్థ కుదుటపడడానికి, ప్రాథమిక రంగాలు తిరిగి పనిచేయడానికి వీలుగా లాక్ డౌన్ చర్యలు ఉండాలని భావిస్తోంది. 

వచ్చే వారం విద్యాసంస్థలు ప్రారంభమయ్యే అవకాశాలు లేవు. మరో నాలుగు వారాల పాటు విద్యాసంస్థలను మూసేయాలని మంత్రుల బృందం సూచించింది. మత సమ్మేళనాలపై, సమావేశాలపై కూడా నిషేధం కొనసాగాలని అభిప్రాయపడింది. 

ఈ నెల 14వ తేదీ తొలి దశ లాక్ డౌన్ ముగుస్తుంది. అయితే, ఆ తర్వాత నాలుగు వారాల పాటు షాపింగ్ మాల్స్ ను కూడా మూసి ఉంచాలని రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ నేతృత్వంలో జరిగిన సమావేశం అభిప్రాయపడింది. ఈ సమావేశానికి హోం మంత్రి అమిత్ షాతో పాటు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కూడా హాజరయ్యారు. 

మహారాష్ట్ర (1018), తమిళనాడు (690), తెలంగాణ (364), కేరళ (336) రాష్ట్రాలు కరోనా వైరస్ వ్యాధితో విలవిలలాడుతున్నాయి. ఈ నాలుగు రాష్ట్రాలు కూడా లాక్ డౌన్ ను కొనసాగించాలని పట్టుబడుతున్నాయి. 

click me!