కరోనా వ్యాధి నివారణకు చర్యలు తీసుకోవడంలో తొలుత ఉదాశీనత చూపారు. కానీ అది రోజురోజుకు ఉద్ధ్రుతమవుతుండటంతో తనపై తాను అదుపు చేయలేక ప్రపంచ ఆరోగ్య సంస్థ మొదలు భారత్, చైనాలపై నిందలకు పాల్పడుతున్నారు. అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైనప్పటి నుంచి డొనాల్డ్ ట్రంప్‌ది అదే వరుస.
వాషింగ్టన్/న్యూఢిల్లీ/ బీజింగ్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు నోటి దురుసు కాస్త ఎక్కువే. తనకు నచ్చని వారిపై వ్యతిరేకుల ముద్ర వేయడం ట్రంప్‌నకు వెన్నతో పెట్టిన విద్య అంటే అతిశయోక్తి కాదు. చిక్కుల్లో ఉన్నా సరే బెదిరింపులకు దిగడానికి ఆయన వెనుకాడరు.
సొంత దేశంలో మీడియా తనకు అనుకూలంగా ఉండనందుకుకు ఫేక్ న్యూస్ మీడియా అని ట్రంప్ పదేపదే చులకన చేశారు. చైనాతో వాణిజ్య యుద్ధం.. భారత్ మీద ఆంక్షలు.. ఇరాన్‌పై ఏకపక్ష దాడులకు ఆయనకు ఆయనే సాటి.
ఇక తాజాగా ప్రపంచం ప్రస్తుతం కరోనా వైరస్ మహమ్మారితో గడగడ వణుకుతున్న వేళ దాని నివారణకు చర్యలు తీసుకోవడానికి బదులు ఇతరులపై నిందలు మోపడం అగ్రరాజ్యాధినేతకు అలవాటుగా మారింది. చైనాను నిందించిన ట్రంప్.. భారత్‌ను బెదిరించారు. తాజాగా ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) తీరును ప్రశ్నించారు.
కరోనా మహమ్మారి పుట్టింది చైనాలో. దాని సాకుగా అది కరోనా వైరస్ కాదు.. చైనా వైరస్ అంటే సరిగ్గా ఉంటుందని ట్రంప్ అన్నారు. దానిపై మీడియా ప్రశ్నించినా తన వైఖరిని సమర్థించుకున్నారు.
‘కరోనా వైరస్’కు అమెరికా సైన్యం కారణమని చైనా ఆరోపణలు చేయడం ఏమాత్రం సరి కాదన్నారు. అమెరికా సైన్యం వల్లే వైరస్ తమ దేశంలోకి సోకిందని చైనా చెప్పడం తప్పుడు ఆరోపణ అని అభిప్రాయ పడ్డారు.
ఆ వైరస్ ఎక్కడ నుంచి వచ్చిందో దాని పేరు పెట్టి పిలువడం తప్పేమీ కాదని ట్రంప్ సమర్ధించుకున్నారు. ’చైనీస్ వైరస్’ అని వ్యవహరించడం సరైన పదమేనన్నారు. చైనాకు ప్రయాణాలను నిషేధించి తాను మంచి పనే చేశానన్నారు.
దీనికి ప్రతిగా ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) వివరణ ఇచ్చింది. సదరు వైరస్ ప్రక్రుతి పరంగా పుట్టుకు వచ్చిన వైరస్ మాత్రమేనని, దానికి చైనాకు ఆపాదించడం సబబు కాదని స్పష్టం చేసింది. అమెరికాలో కరోనా మహమ్మారి మరణ మ్రుదంగం మోగిస్తున్న వేళ మీడియా ముందుకు వచ్చిన ట్రంప్.. కరోనా వైరస్ కాదది చైనీస్ వైరస్ అని తాను చేసిన వాదనను దాటవేసేందుకు ప్రయత్నించారు.
అది చైనా వల్లే వచ్చిందని చెప్పడం సబబు కాదని, ఆ వైరస్ గురించి వారిని నిందించలేమన్నారు. చైనీస్ వైరస్ అని అన్న తర్వాత చైనాతోపాటు ఆసియా ఖండ దేశాల్లో అమెరికన్లపై దాడులు పెరిగిన నేపథ్యంలో ట్రంప్ వివరణ ప్రాధాన్యం సంతరించుకున్నది.
ఆసియా అమెరికన్లు అద్భుతమైన వ్యక్తులని, వారిని కాపాడుకోవాల్సిన అవసరం తనకు ఉందంటూ ట్రంప్ పేర్కొన్నారు. కరోనా వైరస్ మహమ్మారిపై పోరుకు యాంటీ మలేరియా వ్యాధి హైడ్రాక్సీ క్లోరోక్వీన్ కీలక పాత్ర పోషించనున్నది.
ఈ నేపథ్యంలో గత నెలలో మీడియాతో మాట్లాడిన డొనాల్డ్ ట్రంప్.. తమకు హైడ్రాక్సీ క్లోరోక్వీన్ ఔషధం సరఫరా చేయాలని కోరారు. ఆ మరునాడే విదేశాలకు హైడ్రాక్సీ క్లోరోక్వీన్ ఔషధం ఎగుమతులపై భారత్ ఆంక్షలు విధించింది.
తాజాగా గత శనివారం భారత ప్రధాని నరేంద్రమోదీతో జరిగిన ఫోన్ సంభాషణల్లోనూ హైడ్రాక్సీ క్లోరోక్వీన్ టాబ్లెట్లు భారీగా పంపాలని అభ్యర్థించారు. కానీ ఆ మరునాడే విదేశాలకు హైడ్రాక్సీ క్లోరోక్వీన్ ఎగుమతులపై నిషేధాన్ని కఠినతరం చేస్తూ మోదీ సర్కార్ నిర్ణయం తీసుకున్నది. ఇది ట్రంప్ ఆగ్రహం కలిగించింది.
ఒకవేళ హైడ్రాక్సీ క్లోరోక్వీన్ ఔషధం ఎగుమతులపై నిషేధం విధిస్తే భారత్ మీద ప్రతీకారం తప్పదని బెదిరింపులకు దిగారు ట్రంప్. అటుపై మానవత్వ కోణంలో హైడ్రాక్సీ క్లోరోక్వీన్ ఎగుమతులపై నిషేధం సడలిస్తూ మోదీ సర్కార్ తుది నిర్ణయం తీసుకున్నది.
అమెరికాలో రోజురోజుకు కరోనా కేసులు పెరిగిపోవడం ఆ దేశాధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌నకు తీవ్ర కలవరం కలిగిస్తున్నది. అమెరికా ప్రభుత్వం దాని నివారణకు చర్యలు తీసుకుంటున్నా ఆశాజనక ఫలితాలు కాన రావడం లేదు.
మున్ముందు విపత్కర పరిస్థితులు ఎదురవుతాయని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్న నేపథ్యంలో ట్రంప్ ద్రుష్టి ఉరుము ఉరిమి మంగళం మీద పడినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ)పై విరుచుకు పడ్డారు. డబ్ల్యూహెచ్ఓ చైనాకు అనుకూలంగా వ్యవహరిస్తున్నదని ఆక్షేపించారు. ఆ సంస్థకు ఇవ్వాల్సిన నిధులను నిలిపివేస్తూ ట్రంప్ నిర్ణయం తీసుకున్నారు.
సకాలంలో వైరస్ తీవ్రత గురించి డబ్ల్యూహెచ్ఓ హెచ్చరించలేదని డొనాల్డ్ ట్రంప్ ఆరోపించారు. కరోనా వైరస్ బయట పడినప్పటి సమాచారం డబ్ల్యూహెచ్ఓ ఉన్నదని, కానీ పంచుకోవడానికి ఆ సంస్థ బయట పడలేదన్నారు.
కరోనా విషయంలో డబ్ల్యూహెచ్ఓ చాలా తప్పటడుగులు వేసిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు. డబ్ల్యూహెచ్ఓ పనితీరుపై సెనెట్ విదేశాంగ సంబంధాల కమిటీ చైర్మన్ జిమ్ రిష్ అనుమానాలు వ్యక్తం చేశారు. దీనిపై స్వతంత్ర దర్యాప్తునకు ఆదేశించారు.