మాల్స్‌కంటే కిరాణా షాపులే ముద్దు.. సొంత వాహనమే బెస్ట్

By Sandra Ashok Kumar  |  First Published Jun 1, 2020, 11:04 AM IST

కరోనా విశ్వమారి యావత్‌ ప్రపంచానికి ఎన్నో కొత్త పాఠాలు నేర్పింది. ప్రజల జీవన విధానంలో పలు మార్పులు తెచ్చింది. దీంతో ఇప్పుడు భారత్‌లో అత్యధిక వినియోగదారులు తమకు అవసరమైన నిత్యావసర వస్తువుల కొనుగోలుకు కిరాణా దుకాణాలనే ఆశ్రయిస్తున్నారు. స్థానికంగా లభించే వస్తువుల కొనుగోళ్లకే వారు ఎక్కువగా ఆసక్తి చూపుతున్నట్టు ‘డెలాయిట్‌ గ్లోబల్‌ స్టేట్‌ ఆఫ్‌ కన్జ్యూమర్‌ ట్రాకర్‌' సర్వేలో వెల్లడైంది. 
 


న్యూఢిల్లీ: లాక్‌డౌన్‌ పీరియడ్‌లో కిరాణా దుకాణాల పట్ల వినియోగదారుల్లో నమ్మకం పెరిగినట్టు స్పష్టం అవుతున్నది. అధిక మొత్తంలో నిత్యావసర వస్తువులను ఇళ్లలో నిల్వ ఉంచుకొనేందుకు దేశీయ వినియోగదారులు ఇష్టపడటం లేదని ‘డెలాయిట్‌' సర్వే నివేదిక తేల్చింది. 

గత ఆరు వారాలుగా వినియోగదారుల కొనుగోళ్ల ధోరణిలో ఎంతో మార్పు వచ్చిందని పేర్కొన్నది. సర్వేలో పాల్గొన్న 1000 మందిలో 55 శాతం మంది ఎక్కువ సొమ్మును నిత్యావసర సరుకుల కొనుగోలు కోసం వెచ్చించేందుకు సుముఖత వ్యక్తం చేశారని తెలిపింది.

Latest Videos

undefined

రోజువారీ ఉపయోగించే వస్తువుల కొనుగోళ్లకు అధిక మొత్తాన్ని ఖర్చుచేసేందుకు 52 శాతం మంది ఇష్టపడుతున్నారని ‘డెలాయిట్‌' సర్వే పేర్కొన్నది. స్థానికంగా లభించే వస్తువులనే కొనుగోలు చేయాలని 72 శాతం మంది వినియోగదారులు భావిస్తున్నారని వెల్లడించింది. 

also read రిలయన్స్ రికార్డు బ్రేక్: మార్కెట్ ధర కంటే తక్కువకే పీపీఈ కిట్..

లాక్‌డౌన్‌ సమయంలో కిరాణా దుకాణాల పట్ల ప్రజల్లో నమ్మకం పెరిగినట్టు రుజువు చేస్తున్నదని డెల్లాయిట్ సర్వే తెలిపింది. కరోనా సంక్షోభంపై చక్కగా ప్రతిస్పందించిన బ్రాండ్ల నుంచి కొనుగోళ్లు జరుపుతామని 64 శాతం మంది భారతీయ వినియోగదారులు ఈ సర్వేలో పేర్కొన్నట్టు ‘డెలాయిట్‌' వెల్లడించింది.

ప్రయాణ అవసరాల కోసం ప్రజా రవాణా వ్యవస్థను అధికంగా ఉపయోగించుకోరాదని నిశ్చయించుకొన్నట్టు డెలాయిట్‌ సర్వేలో ఎక్కువ మంది వినియోగదారులు వెల్లడించారు. క్యాబ్‌లు, ఇతర అద్దె వాహనాల వినియోగానికి దూరంగా ఉండాలని భావిస్తున్నట్టు 70 శాతం మంది చెప్పారు.

చింతలేని ప్రయాణం కోసం 79 శాతం మంది వినియోగ దారులు కొత్తగా సొంత వాహనాన్ని సమకూర్చుకోవాలన్న ఆలోచనలో ఉన్నట్టు ‘డెలాయిట్‌' తన నివేదికలో పేర్కొన్నది. ప్రస్తుతం భారత్‌, ఆస్ట్రేలియా, కెనడా, చైనా, ఫ్రాన్స్‌ తదితర 13 దేశాల్లోని వినియోగదారుల మనోగతాన్ని తెలుసుకొనేందుకు ఏప్రిల్‌ 19 నుంచి మే 16 వరకు డెలాయిట్‌ ఈ సర్వే నిర్వహించింది. దీనిలో భాగంగా 18 ఏండ్ల వయసు దాటిన వినియోగదారులకు ఈ-మెయిల్‌ ద్వారా ప్రశ్నావళిని పంపి జవాబులు స్వీకరించింది. 

click me!