కరోనా పాజిటివ్ కేసుల్లో ఇంతకుముందే చైనాను దాటిన భారత్.. తాజాగా మరణాల్లోనూ ఆ రికార్డును దాటేసింది. శుక్రవారం ఉదయానికి దేశంలో 4,706కు మరణాలు చేరుకున్నాయి. కరోనా విజృంభిస్తుండటంతో రికార్డు స్థాయిలో కేసులు నమోదవుతున్నాయి.
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా కరోనా అంతకంతకు విజృంభిస్తున్నది. రోజురోజుకు పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. దీనిని కట్టడి చేసేందుకు మార్చి 25న విధించిన లాక్ డౌన్ నిబంధనలు సడలిస్తున్నా కొద్దీ పాజిటివ్ కేసులు పెరుగుతూనే ఉన్నాయి. దేశ ఆర్థిక రాజధానిగా పేరొందిన ముంబైతోపాటు హస్తిన సహా ప్రధాన మెట్రోపాలిటన్ నగరాల్లో పరిస్థితి విషమంగా మారుతున్నది.
ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 1,65,799 మంది కరోనా బారిన పడ్డారు. పాజిటివ్ కేసుల్లో ఇంతకుముందే చైనాను దాటిన భారత్ తాజాగా మరణాల్లోనూ ఆ దేశాన్ని అధిగమించింది. గురువారం ఉదయం నుంచి శుక్రవారం వరకు 24 గంటల్లో 175 మంది మరణించడంతో మొత్తం మృతుల సంఖ్య 4,706కు చేరుకున్నది. చైనాలో ఇప్పటి వరకు 4,638 మంది మరణించారు.
మరోవైపు, 24 గంటల వ్యవధిలో రికార్డుస్థాయిలో 7,466 పాజిటివ్ కేసులు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది. దేశంలో కరోనా వైరస్ బయట పడిన తర్వాత ఒక్కరోజులో ఇంత భారీ స్థాయిలో కేసులు నమోదు కావడం ఇదే ప్రథమం.
ఈ నెల 22 నుంచి ప్రతిరోజూ 6000కు పైగా కరోనా కేసులు రికార్డయ్యాయి. ఇప్పటి వరకు 71,705 మంది రోగులు కోలుకున్నారు. కరోనా మృతుల్లో మహారాష్ట్రలో 1982 మంది, గుజరాత్‌లో 960 మంది ఉన్నారని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. చైనాలో ఇప్పటి వరకు 4,638 మంది మరణించగా, 84,106 మందికి వైరస్ సోకినట్లు ప్రకటించారు. చైనా కేసులతో పోలిస్తే.. భారత్‌లో నమోదైన పాజిటివ్ కేసులు దాదాపు రెట్టింపు ఉన్నాయి.
దేశవ్యాప్తంగా మహారాష్ట్ర, గుజరాత్ రాష్ర్టాల్లో కరోనా విజృంభిస్తున్నది. ఇప్పటి వరకు మహారాష్ట్రలో 59,546 మందికి వైరస్ పాజిటివ్ రాగా, 1,982 మంది మరణించారు. గుజరాత్‌లో 15,562 మందికి కరోనా సోకగా 960 మరణాలు సంభవించాయి.
దేశంలో జనవరి 30న తొలి కేసు నమోదైతే మార్చి 13న తొలి కరోనా మరణం సంభవించింది. తర్వాత వంద మరణాలకు చేరుకోవడానికి 24 రోజుల (ఏప్రిల్ 6) సమయం పట్టింది. ఆ తర్వాత 13 రోజుల్లో (ఏప్రిల్ 19) 500 మంది మరణిస్తే, అటుపై పది రోజులకే (ఏప్రిల్ 29) మరణాలు వెయ్యికి చేరుకున్నాయి.
also read విప్రో కొత్త సీఈవో, ఎండీగా థియరీ డెలాపోర్టే...జూన్ 6న కంపెనీ బాధ్యతలు
2,000 మరణాలకు చేరుకోవడానికి 11 రోజుల (మే10) సమయం పడితే, తర్వాత ఎనిమిది రోజుల్లో (మే 18) 3,000 మందికి, అటుపై ఏడు రోజులకు (మే 25) 4,000వ మరణం నమోదైంది. ముంబై, ఢిల్లీలతోపాటు కరోనా కేసులు ఎక్కువగా నమోదు కావడంతో దేశవ్యాప్తంగా 30 పట్టణ ప్రాంతాలను కంటైన్మెంట్ జోన్లుగా గుర్తించి కఠిన ఆంక్షలు అమలు చేయాలని కేంద్ర హోంశాఖ సూచించింది.
ఏప్రిల్ ఐదో తేదీన 77 మంది మరణిస్తే.. ఆరో తేదీకి 109 మందికి చేరుకున్నది. ఏప్రిల్ 18న ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 480 కాగా, 19న 507గా రికార్డైంది. అదే నెల 28న 934 మంది కాగా, 29న 1007 మందికి చేరింది.
ఇక మే తొమ్మిదో తేదీన 1981గా నమోదైన మ్రుతులు.. 10కల్లా 2109 దాటాయి. ఈ నెల 17న 2872 మరణాలు నమోదైతే 18న 3029కి పెరిగిపోయాయి. మే 25న 4000వ రోగి మరణించగా, శుక్రవారం ఉదయానికి దేశవ్యాప్త మరణాల సంఖ్య 4706 మందికి చేరుకున్నది.
ఇదిలా ఉంటే, ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి బారిన పడిన తొలి పది దేశాల్లో భారత్ తొమ్మిదో స్థానంలో ఉంది. భారత్‌కంటే ముందు అమెరికా, బ్రెజిల్, రష్యా, బ్రిటన్, స్పెయిన్, ఇటలీ, ఫ్రాన్స్, జర్మనీ ఉండగా.. తర్వాత టర్కీ 10 స్థానంలో నిలిచింది. అయితే వైరస్‌కు పుట్టినిల్లయిన చైనా మాత్రం ఇరాన్, పెరు, కెనడా, చిలీ తర్వాత 15వ స్థానంలో ఉంది.