కరోనా దెబ్బకు బ్రాండ్ల విలువ తరుగుతున్నది. మొత్తం టాప్-100 బ్రాండ్ల వాల్యూలో రూ.1.88 లక్షల కోట్ల మేరకు కొడిగట్టుకు పోయిందని బ్రాండ్ ఫైనాన్స్ 2020 రిపోర్టు అంచనా వేసింది.
ముంబై: కరోనా మహమ్మారి ఉగ్రరూపానికి కార్పొరేట్ కంపెనీల బ్రాండ్ విలువ హారతి కర్పూరంలా కరిగిపోతోంది. దేశీయ టాప్-100 బ్రాండ్ల మొత్తం విలువకు 2,500 కోట్ల డాలర్ల (సుమారు రూ.1.88 లక్షల కోట్లు) మేర గండిపడవచ్చని బ్రాండ్ ఫైనాన్స్ అంచనా వేసింది.
ఈ ఏడాది జనవరి ఒకటో తేదీ నాటికి నమోదైన బ్రాండ్ల మొత్తం విలువలో ఇది 15 శాతానికి సమానమని బ్రాండ్ వాల్యూ -2020 నివేదిక వెల్లడించింది. ప్రపంచంలోని టాప్-500 కంపెనీల బ్రాండ్ విలువ లక్ష కోట్ల డాలర్లు (రూ.75 లక్షల కోట్లు) మేర తరిగిపోవచ్చని ఆ నివేదికలో పేర్కొంది.
ప్రపంచంలోని టాప్-100 బ్రాండ్లలో స్థానం దక్కించుకున్న ఏకైక భారత కంపెనీ టాటా సన్స్. టాటా గ్రూప్ అంతర్జాతీయంగా 85వ స్థానంలో ఉంది. 100 దేశాల్లో వ్యాపార కార్యకలాపాలు సాగిస్తున్న టాటా గ్రూప్‌లో 7.20 లక్షల మందికి పైగా ఉద్యోగులు పనిచేస్తున్నారు
ఇక ఆయిల్ అండ్ గ్యాస్ నుంచి రిటైల్, టెలికాం, మీడియా వ్యాపారాల్లోకి విస్తరించడం రిలయన్స్ బ్రాండ్ విలువ మరింత పెరగడానికి దోహదపడింది కష్టకాలంలోనూ బ్యాంకుల బ్రాండ్ విలువ మరింత వృద్ధి చెందింది. టాప్-100 దేశీయ బ్రాండ్లలో 14 బ్యాంక్‌లకు చోటు లభించింది. వీటన్నింటి బ్రాండ్ విలువ 25 శాతం వృద్ధి చెంది 2,490 కోట్ల డాలర్లుగా నమోదైంది.
also read ఇండియా రేటింగ్ తగ్గిస్తున్నట్లు ప్రకటించిన మూడీస్...ఎందుకో తెలుసా..?
ఎస్‌బీఐ బ్రాండ్ వేల్యూ 8 శాతం వృద్ధి చెంది 640 కోట్ల డాలర్లకు, హెచ్‌డీఎప్సీ బ్యాంక్ విలువ 22 శాతం వృద్ధితో 590 కోట్ల డాలర్లకు చేరింది. అయితే, కరోనా సంక్షోభం నేపథ్యంలో టాప్ బ్యాంక్‌ల బ్రాండ్ విలువ 20 శాతం మేర క్షీణించే అవకాశం ఉంది.
ఈ ఏడాదికి దేశంలోని అత్యంత విలువైన కార్పొరేట్ బ్రాండ్‌గా టాటా గ్రూప్ మరోసారి తన అగ్రస్థానాన్ని నిలబెట్టుకుంది. అంతేకాదు, తొలిసారిగా టాటా బ్రాండ్ విలువ 2,000 కోట్ల డాలర్ల మైలురాయిని అధిగమించిందని బ్రాండ్ ఫైనాన్స్ నివేదిక వెల్లడించింది.
గత ఏడాదితో పోలిస్తే మాత్రం టాటా గ్రూప్ బ్రాండ్ విలువ 2 శాతమే పెరిగింది. ఈ గ్రూప్‌నకు చెందిన లగ్జరీ హోటళ్ల నిర్వహణ సంస్థ ‘తాజ్’.. దేశంలోనే అత్యంత పట్టు ఉన్న బ్రాండ్‌గా నిలిచింది. బీమా దిగ్గజం ఎల్‌ఐసీకి రెండో స్థానం దక్కగా.. ముకేశ్ అంబానీకి చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్‌కు మూడో స్థానం లభించింది.
దేశీయంగా ఇన్ఫోసిస్ సంస్థకు నాలుగో స్థానం, ఎస్బీఐకి 5, హెచ్‌డీఎప్సీ బ్యాంక్‌కు 6, మహీంద్రా అండ్ మహీంద్రా గ్రూపునకు 7, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐఓసీ)కు 8, హెచ్‌సీఎల్‌కు 9వ ర్యాంక్ లభించగా, ఎయిర్‌టెల్ 10వ స్థానంలో ఉన్నాయి.
గత ఏడాది జాబితాతో పోలిస్తే హెచ్‌డీఎఫ్సీ బ్యాంక్ ఒక స్థానం ఎగబాకగా.. మహీంద్రా అండ్ మహీంద్రా ఒక స్థానం కిందికి జారుకుంది. ఐఓసీ ఏకంగా 7 స్థానాలు ఎగబాకగా.. ఎయిర్‌టెల్ 2 స్థానాలు కిందికి జారుకుంది. గత ఏడాది జాబితాలో 10 స్థానంలో నిలిచిన విప్రో ఈసారి 11వ స్థానానికి పరిమితమైంది.