ఇండియా రేటింగ్ తగ్గిస్తున్నట్లు ప్రకటించిన మూడీస్...ఎందుకో తెలుసా..?

By Sandra Ashok Kumar  |  First Published Jun 2, 2020, 11:32 AM IST

ప్రముఖ రేటింగ్ సంస్థ మూడీస్ భారత్‌ రేటింగ్‌ను డౌన్‌గ్రేడ్‌ చేసింది. భారత్ రేటింగ్ స్థాయిని ‘బీఏఏ2’ నుంచి ‘బీఏఏ3’కి కుదించి వేసింది. దేశ ప్రగతి అవుట్ లుక్ నెగటివ్‌లోనే కొనసాగుతుందని మూడీస్ స్పష్టం చేసింది. కరోనాతోపాటు విధానాల అమల్లో సవాళ్లు ఎదురవుతాయని హెచ్చరించింది. వృద్ధి సుదీర్ఘకాలం పాటు అట్టడుగునే కొనసాగుతుందని ఆందోళన వ్యక్తం చేసింది. దీనివల్ల ద్రవ్య లభ్యత పరిస్థితులు కట్టుదప్పే అవకాశం పుష్కలంగా ఉంది.  


న్యూఢిల్లీ: భారత్‌కు ఇస్తున్న సార్వభౌమ స్థాయి (సావరిన్‌ రేటింగ్‌)ని మూడీస్‌ ఇన్వెస్టర్స్‌ సర్వీస్‌ తగ్గించి వేసింది. ఇప్పటి వరకూ ఉన్న రేటింగ్‌ ‘బీఏఏ2’ను ‘బీఏఏ3’కి తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. ఇక భారత్‌ రేటింగ్‌ అవుట్‌లుక్‌ నెగటివ్‌లోనే కొనసాగుతుందని తేల్చేసింది. 

భారత్‌ ఆర్థిక పరిస్థితులను కోవిడ్‌–19 మహమ్మారి దెబ్బతీసినా. అయితే రేటింగ్‌ డౌన్‌గ్రేడ్‌కు ఇది ఒక్కటే కారణం కాదని మూడీస్ స్పష్టం చేసింది.  భారత ప్రభుత్వం తీసుకుంటున్న పలు విధాన నిర్ణయాల అమల్లో పలు సవాళ్లు ఎదురుకానున్నాయని హెచ్చరించింది. 

Latest Videos

ఆయా అంశాల నేపథ్యంలో వృద్ధిరేటు  సుదీర్ఘకాలం అట్టడుగునే కొనసాగనున్నదని మూడీస్ వివరించింది. ఇక ఆర్థిక వ్యవస్థకు  ద్రవ్యపరమైన ఒత్తిడులు కూడా ఎదురు కానున్నాయని తెలిపింది. ఆదాయం తగ్గిపోయి వ్యయాలు పెరగడం వంటి అంశాల నేపథ్యంలో ద్రవ్యలోటు మరింతగా కట్టుతప్పే అవకాశం ఉందని మూడీస్ ఆందోళన వ్యక్తం చేసింది. ఆర్థిక రంగంలో ఒత్తిళ్లు ఎదురవుతాయని స్పష్టం చేసింది. 

కోవిడ్‌–19 సృష్టించిన నష్టంతోపాటు పలు కారణాల వల్ల 2020–21 ఆర్థిక సంవత్సరంలో భారత్‌ ఆర్థిక వ్యవస్థ 4 శాతం క్షీణ రేటును నమోదుచేసుకునే అవకాశం ఉందని మూడీస్‌ పేర్కొంది. నిజానికి కోవిడ్‌ మహమ్మారి దాడికి ముందే భారత ఆర్థిక వ్యవస్థ నెమ్మదించిందని  మూడీస్‌ గుర్తు చేసింది.  

దీర్ఘకాలం వృద్ధి రేటు దిగువస్థాయిలోనే కొనసాగే పరిస్థితులు ఉండడం వల్ల రుణ భారం తగ్గించుకోవడం ప్రభుత్వానికి కొంత క్లిష్టంగా మారే వీలుందని మూడీస్ తెలిపింది. కరోనాకు ముందు 2019–20లో భారత్‌ ప్రభుత్వం రుణ నిష్పత్తి జీడీపీలో 72% ఉంటే, ఇది ఈ ఆర్థిక సంవత్సరం 84%కి పెరిగే అవకాశం ఉందన్నది.

అయితే రుణ భారాన్ని తగ్గించుకోవడం స్వల్పకాలంలో సాధ్యమయ్యే అవకాశం లేదని మూడీస్ వెల్లడించింది. బీఏఏ– రేటెడ్‌ దేశాలతో పోల్చితే భారత్‌పై అధిక వడ్డీరేటు భారం ఉందని బీఏఏ స్టేబుల్‌ దేశాలతో పోల్చితే మూడు రెట్లు ఈ భారం అధికంగా ఉందని మూడీస్‌ పేర్కొంది. ప్రైవేటు రంగంలో పొదుపులు, ప్రభుత్వ డెట్‌ మెచ్యూరిటీలు దీర్ఘకాలంలో ఉండడం రుణ భారం, వడ్డీ చెల్లింపుల విషయం లో కొంత సానుకూల విషయం అని వ్యాఖ్యానించింది. 

also read స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎండిగా అశ్విని భాటియా..

ఒక దేశ ఆర్థిక పరిస్థితులు ఎలా ఉన్నాయన్న అంశంపై అంతర్జాతీయ రేటింగ్‌ దిగ్గజ సంస్థలు రేటింగ్‌ ఇస్తుంటాయి. ఎస్‌అండ్‌పీ, ఫిచ్, మూడీస్‌ ఇందులో ప్రధాన సంస్థలు. ఈ దిగ్గజ సంస్థలు ఇచ్చే రేటింగ్‌ ఆధారం గానే ఏదేశమైనా అంతర్జాతీయ పెట్టుబడులను ఆకర్షించగలుగుతుంది. 

దేశ సీనియర్‌ ఆర్థిక శాఖ అధికారులు సైతం దేశానికి సంబంధించి ఆర్థిక పరిస్థితులను అధికారికంగా రేటింగ్‌ సంస్థల ప్రతినిధులకు వివరించి, రేటింగ్‌ పెంచవలసినదిగా కోరతారంటే, ఆయా సంస్థలు ఇచ్చే సావరిన్‌ రేటింగ్‌ ఒక దేశం పెట్టుబడులను ఆకర్షించడంలో ఎంతగా దోహదపడుతుందో అర్థం చేసుకోవచ్చు.

ప్రస్తుతం మూడీస్‌ ఇచ్చిన రేటింగ్‌ ‘బీఏఏ3’ నెగటివ్‌ అవుట్‌లుక్‌ కూడా ఇప్పటికీ ‘ఇన్వెస్ట్‌మెంట్‌ గ్రేడ్‌’ పరిధిలోకే వస్తుందన్న విషయం గమనార్హం. అయితే ‘జంక్‌’ గ్రేడ్‌కు ఇది ఒక మెట్టు ఎక్కువ.   మిగిలిన రెండు సంస్థలు ప్రస్తుతం భారత్‌కు మూడీస్‌ ఇస్తున్న రేటింగ్‌ ‘బీఏఏ3 నెగటివ్‌’కు సరిసమానమైనవే కావడం గమనార్హం. 2017, నవంబర్‌లో మూడీస్‌ రేటింగ్‌ అప్‌గ్రేడ్‌ చేసినా, అటు తర్వాత రెండు దఫాల్లో  క్రమంగా తగ్గిస్తూ వచ్చింది.

భారత ప్రభుత్వ ఫారిన్‌ కరెన్సీ అండ్‌ లోకల్‌ కరెన్సీ దీర్ఘకాలిక జారీ రేటింగ్స్‌ను కూడా మూడీస్‌ ‘బీఏఏ2 నుంచి బీఏఏ 3’కి తగ్గించింది. అలాగే భారత్‌ లోకల్‌ కరెన్సీ సీనియర్‌ అన్‌సెక్యూర్డ్‌ రేటింగ్స్‌నూ  ‘బీఏఏ2 నుంచి బీఏఏ 3’కి  కుదించింది. ఇక షార్ట్‌టర్మ్‌ లోకల్‌ కరెన్సీ రేటింగ్‌ను ‘పీ–2 నుంచి పీ–3’కి తగ్గించింది. వీటికి సంబంధించి అవుట్‌లుక్‌ నెగటివ్‌ ఉంటుందని పేర్కొంది.  

‘భారత్‌కు సంబంధించి ఫిచ్, ఎస్‌అండ్‌పీలు బీఏఏ3 నెగటివ్‌కు సరిసమానమైన రేటింగ్స్‌ కొనసాగిస్తున్నందువల్ల మూడీస్‌ కూడా ఈ మేరకు సర్దుబాటు చేస్తుందని మార్కెట్‌ మొదటి నుంచీ ఊహిస్తూ వస్తోంది. అయితే ఈ రేటింగ్‌ కూడా భారత్‌కు ఇన్వెస్ట్‌మెంట్‌ గ్రేడ్‌ హోదానే ఇస్తోంది. దీనివల్ల బాండ్, రూపాయి మార్కెట్‌లో భారీ మార్పు ఏదీ ఉండబోదని మేం భావిస్తున్నాం’ ఫస్ట్ రాండ్ బ్యాంక్ కోశాధికారి కే హరిహర్ తెలిపారు. 

click me!