లాక్ డౌన్ అమలుపై వైఎస్ జగన్ అసంతృప్తి, కఠిన చర్యలకు ఆదేశం

By telugu team  |  First Published Mar 25, 2020, 2:25 PM IST

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లాక్ డౌన్ అమలు తీరుపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అసంతృప్తి వ్యక్తం చేశారు. లాక్ డౌన్ కఠినంగా అమలు జరిగేలా, ప్రజలు నిత్యావసర సరుకులకు ఇబ్బంది పడకుండా తీసుకోవాల్సిన చర్యలపై ఆదేశాలు ఇచ్చారు.


అమరావతి: రాష్ట్రంలో లాక్ డౌన్ అమలుపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని మంత్రి ఆళ్ల నాని మీడియాతో చెప్పారు.  వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్లనాని, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని, డీజీపీ గౌతం సవాంగ్, వైద్య, ఆరోగ్యశాఖ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ జవహర్‌రెడ్డి, ఉన్నతాధికారులు సమీక్షా సమావేశంలో పాల్గొన్నారు. 

లాక్‌డౌన్‌ సందర్భంగా నిత్యావసరాలకోసం ప్రజలు ఒకే సమయంలో పెద్దఎత్తున గుమిగూడ్డంపై సమావేశంలో చర్చ జరిగింది. 
కోవిడ్‌ నివారణకు సామాజిక దూరం పాటించాలన్న ఉద్దేశం దీనివల్ల దెబ్బతింటోందని సమావేశంలో ప్రస్తావనకు వచ్చింది. 
ప్రజల్లో నిత్యావసరాలు దొరకడంలేదనే ఆందోళన లేకుండా చేయడానికి, అదే సమయంలో సామాజిక దూరం పాటించేలా చేయడానికి ఎలాంటి చర్యలు తీసుకోవాలన్నదానిపై చర్చించారు. సమావేశంలో తీసుకున్న నిర్ణయాలుఈ విధంగా ఉన్నాయి.

Latest Videos

* నగరాలు, పట్టణాల్లో రైతు బజార్లను పెద్ద ఎత్తున వికేంద్రీకరించాలని నిర్ణయం
* ఒకేచోట కాకుండా నగరాలు, పట్టణాల్లో ప్రాంతాల వారీగా కూరగాయలు అమ్మేలా చర్యలు తీసుకోవాలని నిర్ణయం. 
ఈ దుకాణాలు నిర్ణీత దూరం పాటించేలా చర్యలు తీసుకోవాలని నిర్ణయం
.* అలాగే ప్రతి దుకాణం వద్ద సామాజిక దూరం పాటించేలా మార్కింగ్‌ చేయాలని నిర్ణయం
* అలాగే నిత్యావసరాల దుకాణాల వద్ద కూడా ప్రజలు దూరం దూరంగా నిలబడేలా మార్కిగ్‌ చేయాలని నిర్ణయం
*కూరగాయలు, నిత్యావసరాలు ప్రజలకు అందుబాటులో ఉంచేందుకువీలైనంత త్వరగా చర్యలు తీసుకోవాలని,అంతవరకు ఉదయం 6 గంటలనుంచి మధ్యాహ్నం 1 గంటవరకూ అనుమతించాలని నిర్ణయం
*ప్రజలు నిత్యావసరాలకోసమే బయటకు రావాలి ఎవ్వరూ కూడా 2–3 కి.మీ పరిధి దాటిరాకూడదు ఆమేరకు నిత్యావసరాలు వారికి అందుబాటులో ఉండేలా చూసుకోవాలి
. పాలు లాంటి నిత్యావసరాలను వీలైనంత ఎక్కువ ప్రాంతాల్లో అందుబాటులో ఉంచాలి. 
* నిబంధనలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్న పోలీసులు
* 144 సెక్షన్‌ రోజంతా అమల్లో ఉంటుంది. నలుగురికి మించి ఎవ్వరూ కూడా ఎక్కడా గుమికూడరాదు. 
* అలాగే సప్లై చెయిన్‌ దెబ్బతినకుండా గూడ్స్‌ వాహనాలు, నిత్యావసరాలు తీసుకొచ్చే వాహనాల రాకపోకలకు అనుమతివ్వాలని నిర్ణయం.
* కూరగాయలు, నిత్యావసర వస్తువుల రేట్లను కలెక్టర్లు ఆయా జిల్లాల వారీగా టీవీలు, పేపర్లలో ప్రకటించాలని సీఎం నిర్ణయం
* ఎవరైనా ఎక్కువ ధరలకు విక్రయిస్తే... 1902 కాల్‌ సెంటర్‌కు కాల్‌ చేయాలి. సీఎం కాల్‌సెంటర్‌లో ఒక సీనియర్‌ అధికారిని పెడుతారు. ఫిర్యాదులు వచ్చిన వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని జగన్ సూచన. 

click me!