ఇంటర్ విద్యార్ధులకు గుడ్‌న్యూస్, ఫలితాలపై త్వరలోనే నిర్ణయం: ఏపీ మంత్రి సురేష్

By narsimha lodeFirst Published Jul 21, 2021, 3:30 PM IST
Highlights

ఏపీలో ఇంటర్ విద్యార్ధులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. త్వరలోనే  ఇంటర్ ఫలితాలపై నిర్ణయం తీసుకొంటామని ఏపీ మంత్రి సురేష్ తెలిపారు. కరోనా కారణంగా రాష్ట్రంలో టెన్త్, ఇంటర్ పరీక్షలను ప్రభుత్వం రద్దు చేసిన విషయం తెలిసిందే.

అమరావతి:  ఏపీలో ఇంటర్ పరీక్షల ఫలితాలపై త్వరలో నిర్ణయం తీసుకుంటామని మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు. ఫలితాల ప్రకటనపై ఇప్పటికే సీఎం జగన్‌కు ప్రతిపాదనలు పంపామని ఆయన చెప్పారు. టెన్త్ పరీక్షల ఫలితాలు ప్రకటించేందుకు చర్యలు చేపట్టామన్నారు.కరోనా నేపథ్యంలో ఏపీ టెన్త్, ఇంటర్ పరీక్షలను ప్రభుత్వం రద్దు చేసింది.ఈ పరీక్షలను నిర్వహించాలని ప్రభుత్వం భావించింది.

అయితే ఈ నెల 31వ తేదీలోపుగా పరీక్ష ఫలితాలను ప్రకటించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. పరీక్షల నిర్వహణతో పాటు ఫలితాల ప్రకటనకు సమయం సరిపోదని భావించి పరీక్షలను రద్దు చేసింది ప్రభుత్వం.విద్యార్థులకు మార్కుల కేటాయింపు విషయంలో కూడ ప్రభుత్వం కమిటీని ఏర్పాటు చేసింది.ఈ కమిటీ సూచనల మేరకు విద్యార్థులకు  మార్కులను కేటాయించనున్నారు.

10వ తరగతి మార్కులు 30 శాతం, ఇంటర్ ప్రథమ సంవత్సరం మార్కులు 70 శాతం ప్రాతిపదికగా విద్యార్ధులకు సెకండియర్ మార్కులు కేటాయించాలని కమిటీ ప్రభుత్వానికి సిఫారసు చేసింది.ఈ సిఫారసుల ఆధారంగా విద్యార్థులకు మార్కులను కేటాయించారు. ఫలితాల విడుదలకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. సీఎం నుండి అనుమతి రాగానే ఫలితాలు విడుదల చేసే అవకాశం ఉంది. 
 

click me!