కరోనా ఎఫెక్ట్: పరీక్షలు లేకుండానే విద్యార్థులు ప్రమోట్... ఏపి సర్కార్ కీలక నిర్ణయం

By Arun Kumar PFirst Published Mar 26, 2020, 2:26 PM IST
Highlights

దేశంలో రోజురోజుకు కరోనా వైరస్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో విద్యార్థులు  ఆరోగ్యాన్ని దృష్టిలో వుంచుకుని ఏపి సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. 

అమరావతి: ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ భారత్ లోనూ రోజురోజుకు విజృంభిస్తోంది. ఈ నేపథ్యంలో ఏపి ప్రభుత్వం ఇప్పటికే విద్యాసంస్ధలన్నింటికి సెలవులు ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఇప్పట్లో ఈ కరోనా మహమ్మారి ప్రభావం తగ్గి సాధారణ పరిస్థితులు నెలకొనే పరిస్థితులు కనిపించడం లేవు కాబట్టి ఏపి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో వుంచుకుని మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. 

విద్యాశాఖ అధికారులతో ముఖ్యమంత్రి గురువారం సమీక్షా సమావేశం నిర్వహించారు. కరోనా వైరస్‌ కారణంగా పరీక్షల వాయిదా, పిల్లలకు మధ్యాహ్న భోజనానికి సంబంధించి డ్రైరేషన్‌ తదితర అంశాలపై అధికారులతో చర్చించారు. 

కరోనా వైరస్‌ కారణంగా కొన్ని రాష్ట్రాల్లో పరీక్షలు రాయకుండానే 6 నుంచి 9వ తరగతి  విద్యార్థులకు పైతరగతులకు ప్రమోట్‌ చేశారని అధికారులు సీఎంకు తెలిపారు. దీంతో ఏపీలోనూ 6 నుంచి 9వ తరగతి విద్యార్థులకు అదే విధంగా ప్రమోట్‌ చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. 

కరోనా వైరస్‌ రీత్యా స్కూళ్లు మూతపడినందున పిల్లకు నేరుగా వారి ఇళ్లకే మధ్యాహ్న భోజనానికి సంబంధించిన డ్రై రేషన్‌ అందిస్తున్నామని అధికారులు సీఎంకు వివరించారు. 
వాలంటీర్ల సహాయంతో పగడ్బందీగా దీన్ని పిల్లలకు చేరేలా చేయాలని సీఎం  వారికి సూచించారు. అదే సమయంలో పూర్తి జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు సీఎం స్పష్టం చేశారు. 

అలాగే మధ్యాహ్న భోజనం అన్ని చోట్లా ఒకే క్వాలిటీ మెయింటైన్‌ చేయాలని సూచించారు. గోరుముద్ద అనే కార్యక్రమాన్ని గర్వంగా తీసుకోవాలని అధికారులకు సీఎం స్పష్టం చేశారు. దీన్ని మరింత బలోపేతం చేయడానికి పూర్తి చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి జగన్ ఆదేశించారు. ఈ సమావేశంలో విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ తో పాటు విద్యాశాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

click me!