ఆ డాక్టర్లపై కఠిన చర్యలు తప్పవు: మంత్రి అవంతి హెచ్చరిక

By Arun Kumar PFirst Published Apr 7, 2020, 6:33 PM IST
Highlights

కరోనా వైరస్ రాష్ట్రంలో విజృంభిస్తున్న ఆపత్కాలంలో కొందరు డాక్టర్లు ప్రభుత్వంపై దుష్ప్రచారం  చేస్తున్నారని... అలాంటివారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని మంత్రి అవంతి శ్రీనివాస్ హెచ్చరించారు. 

విశాఖపట్నం జిల్లాలో విదేశాలు నుండి వచ్చినవారు 3117 మంది వున్నట్లు గుర్తించామని మంత్రి అవంతి శ్రీనివాసరావు వెల్లడించారు. ఢిల్లీ నుండి వచ్చిన 62 మందిని గుర్తించామని వెల్లడించారు. ఇలా మొత్తంగా ఇప్పటి వరకు శాంపిల్స్ 500 ను పరీక్షించగా 20 పాజిటివ్ కేసులు నమోదైనట్లు మంత్రి తెలిపారు.   

కరోనా లక్షణాలు ఉంటే స్వచ్ఛందంగా ఆసుపత్రికి రావాలని... నెగిటివ్ వస్తే వెంటనే డిశ్చార్జ్ చేస్తామన్నారు. ఇంత చేస్తున్నా కొంత మంది తమపై దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. 

వైద్య సిబ్బంది రక్షణ కోసం, చికిత్స కోసం మెటిరియల్ అంతా సిద్ధంగా ఉందని...కరోనా నియంత్రణకు పనిచేసే ప్రతిఒక్కరి ఆరోగ్య బాద్యత తమపై ఉందన్నారు. ఎవ్వరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. విశాఖ జిల్లాలో 8 శాంపిల్ కలెక్ట్ ఆసుపత్రులు పెట్టామని  తెలిపారు. 

అందరికీ ఎన్ 95 మాస్క్ లు అవసరం లేదని... కరోనా పాజిటివ్ కేసులు చికిత్స అందించే వారు మాత్రమే ఎన్ 95 వాడాలన్నారు. కొంతమంది డాక్టర్లు కావాలనే అసత్య ప్రచారం చేస్తున్నారని... డాక్టర్లే ఇలా చేయ్యడం బాధకారమన్నారు. అలాంటి డాక్టర్లపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని మంత్రి హెచ్చరించారు.

కరోనా లక్షణాలుంటే వెంటనే వారికి పరీక్షలు నిర్వహిస్తున్నామని... ఇందుకోసం అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. ఇందులోభాగంగా సర్వేలైన్స్ ర్యాపిడ్ టీమ్స్ ద్వారా అనుమానితులను గుర్తిస్తున్నామని అన్నారు. 

ఇప్పటివరకు కరోనా నిర్ధారిత పరీక్షకు పంపిన శాంపిల్స్ కు గాను ఈరోజు 11 కేసులు నెగిటివ్  వచ్చాయని జిల్లా కలెక్టరు వి.వినయ్ చంద్ తెలిపారు. నిన్నటి వరకు 472 నెగిటివ్ రాగా ఈరోజుతో ఆ సంఖ్య 483కి  పెరిగిందని చెప్పారు. ఈరోజు పాజిటివ్ కేసులు ఏమీ లేవని,  ఇప్పటి వరకు 20 పాజిటివ్ కేసులు నమోదవగా ఇంకా 97 మంది కేసుల రిపోర్ట్ రావలసి  ఉందని చెప్పారు.


 

click me!