హైద్రాబాద్ లో కూర్చొని చంద్రబాబునాయుడు చిన్న చిన్న సంఘటనలను భూతద్దంలో చూపిస్తున్నారని ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ విమర్శించారు.
హైదరాబాద్: హైద్రాబాద్ లో కూర్చొని చంద్రబాబునాయుడు చిన్న చిన్న సంఘటనలను భూతద్దంలో చూపిస్తున్నారని ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ విమర్శించారు. ఫోటోలతో చంద్రబాబులా హడావిడి చేయడం తమకు అలవాటు లేదని ఆయన ఎద్దేవా చేశారు.
బుధవారం నాడు విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడారు. చంద్రబాబునాయుడు చౌకబారు విమర్శలు మానుకోవాలని ఆయన సూచించారు. కరోనా టెస్టులు నిర్వహించకపోతే పాజిటివ్ కేసులు ఎలా బయటపడతాయని మంత్రి ప్రశ్నించారు.
మాపై ఆరోపణలు చేసిన వారికి కూడ కరోనా టెస్టులు చేయిస్తామని ఆయన హెచ్చరించారు. ఇది విమర్శలు చేసుకొనే సమయం కాదన్నారు. రాజకీయాలు మాని ప్రజల కోసం పనిచేయాలని ఆయన టీడీపీ నేతలకు సూచించారు.చంద్రబాబు విమర్శలు దురదృష్టకరమన్నారు.
తాము పబ్లిసిటీలో వెనుకబడి ఉన్నామని మంత్రి బొత్స అభిప్రాయపడ్డారు. సీఎం జగన్ కు పబ్లిసిటీ అవసరం లేదన్నారు. ఉన్నవి లేనట్టుగా చూపి చంద్రబాబు అధోగతి పాలయ్యారన్నారు. సంక్షోభ సమయంలో ప్రజలకు మేలు జరిగితే చాలని సీఎం భావిస్తున్నారని మంత్రి తెలిపారు.
కరోనాపై సీఎం జగన్ నిరంతరం సమీక్ష నిర్వహిస్తున్నట్టుగా ఆయన గుర్తు చేశారు. ఈ వ్యాధి వ్యాప్తి చెందకుండా ఉండేందుకు గాను అనేక ఉన్నతస్థాయి కమిటీలు వేసినట్టుగా ఆయన చెప్పారు. ప్రతి ఒక్కరూ కూడ సోషల్ డిస్టెన్స్ పాటించాలని ఆయన కోరారు. సీఎం సూచనలను ప్రతి ఒక్కరూ పాటించాలన్నారు.
ఢిల్లీకి వెళ్లి వచ్చిన వారి వల్లే ఎక్కువగా పాజిటివ్ కేసులు వచ్చాయని నివేదికలు వస్తున్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ఢిల్లీకి వెళ్లి వచ్చినవారంతా స్థానిక అధికారులకు సహకరించి స్వచ్చంధంగా పరీక్షలు చేయించుకోవాలని మంత్రి కోరారు.
వలంటీర్లు ప్రతి ఇంటికి వెళ్లి సర్వే నిర్వహిస్తున్నారన్నారు. నిత్యావసర వస్తువుల ధరలు సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. సరిమద్దుల్లో ఉన్నవారి కోసం భోజన వసతి ఏర్పాట్లు చేశామన్నారు. ఆకలితో ఏ ఒక్కరూ అలమటించకూడదని సీఎం భావిస్తున్నారని చెప్పారు.
also read :నిజాముద్దీన్‌కు వెళ్లిన వారంతా స్వచ్ఛంధంగా పరీక్షలు చేసుకోవాలి: బొత్స
950 రైతు బజార్లు, మొబైల్ రైతు బజార్లను ఏర్పాటు చేశామన్నారు. 2000 క్వారంటైన్ బెడ్లను ప్రభుత్వం ఏర్పాటు చేసిందని మంత్రి తెలిపారు. నియోజకవర్గాల్లో కూడ కరోనా రోగులకు చికిత్స కోసం ప్రత్యేక సదుపాయాలతో ఆసుపత్రులను ఏర్పాటు చేసినట్టుగా బొత్స తెలిపారు.