ఏపి లాక్ డౌన్... ఇతర రాష్ట్రాల్లో చిక్కుకున్నవారికోసం జగన్ కీలక నిర్ణయం

By Arun Kumar PFirst Published Mar 28, 2020, 2:52 PM IST
Highlights

యావత్ దేశం లాక్ డౌన్ కావడంలో ఇతర ప్రాంతాల్లో చిక్కుకున్న ఆంధ్రుల కోసం ముఖ్యమంత్రి జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. 

అమరావతి: కరోనా వైరస్ కారణంగా ఏపిని లాక్ డౌన్ చేయడంతో ఇతరరాష్ట్రాల్లో చిక్కుకుపోయిన ప్రజలు సొంతరాష్ట్రానికి రాలేకపోతున్నారు. మరీముఖ్యంగా హైదరాబాద్ లో చదువులు, ఉద్యోగం, ఇతర పనులపై వుంటున్న ఆంధ్రులను ప్రభుత్వం అనుమతించడం లేదు. కానీ ఏపి హైకోర్టు మాత్రం ఇతర రాష్ట్రాల్లో చిక్కుకుపోయి సమస్యలు ఎదుర్కొంటున్న వారికి వైద్యపరీక్షలు నిర్వహించి ఆరోగ్యంగా వుంటే అనుమతించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. దీంతో ఈ విషయంపై చర్చించేందుకు ముఖ్యమంత్రి జగన్ ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. 

ఇతర రాష్ట్రాలనుంచి వస్తున్నవారికి సరిహద్దుల్లోనే వసతులను ఏర్పాటు చేయాలని సీఎం అధికారులకు సూచించారు. రాష్ట్రంలోకి వచ్చాక 14రోజుల క్వారంటైన్‌కు సిద్ధపడే వారికి మాత్రమే అనుమతి ఇవ్వాలన్నారు. వారికి భోజనం, వసతి సదుపాయాలు కల్పించాలని... చాలా బాగా చూసుకోవాలి ఆదేశిచారు. ఈ క్యాంపుల్లో ఖచ్చితంగా ఒక అధికారిని పెట్టాలని...ఈ అధికారిని రెసిడెంట్‌ అధికారిగా నియమించాలని తెలిపారు. 

రాష్ట్రం వెలుపల కూడా రాష్ట్రానికి చెందిన కూలీలు, కార్మికుల స్థితిగతులను తెలుసుకోడానికి... ఎప్పటికప్పుడు స్పందించడానికి రాష్ట్రస్థాయిలో ఒక ఐఏఎస్‌ అధికారికి బాధ్యతలు అప్పగించాలని ఆదేశించారు. అలాగే సరిహద్దుల్లో ఏర్పాటుచేసిన, ఏర్పాటు చేయాల్సిన క్యాంపులు, అక్కడ క్వారంటైన్‌ సదుపాయాలు, అందులో ఉన్నవారికి భోజన, వసతి సదుపాయాలను పర్యవేక్షించేందుకు మరొక ఐఏఎస్‌ అధికారికి బాధ్యతలు అప్పగించాలని సూచించారు. సరిహద్దు రాష్ట్రాల్లో కలెక్టర్లతో కూడా దీనిపై చర్చించాలని సూచించారు. 

కొన్ని ఘటనల్లో ప్రభుత్వం, అధికారులపై చాలా నెగెటివ్‌ ప్రచారం జరిగిందని ఈ సందర్భంగా  సీఎం గుర్తుచేశారు.  ఈ క్రమంలో ఇతర రాష్ట్రాలవారికి వసతి కల్పించడంలో మాట రాకూడదని అన్నారు. సరిహద్దుల్లో అందుబాటులో ఉన్న  కళ్యాణ మండపాలు, హోటళ్లు తదితర వాటిని గుర్తించాలని... వాటిని శానిటైజ్‌ చేసి అందుబాటులోకి తీసుకురావాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. 

లాక్ డౌన్  సందర్భంగా ప్రస్తుతం ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకూ ఉన్న సమయాన్ని తగ్గించాలని అధికారులు సీఎం కు తెలిపారు. నగరాలు, పట్టణాల్లో ఉన్న ప్రజలు, వారి సంఖ్యకు తగినట్టుగా రైతు బజార్లు, నిత్యావసర వస్తువుల దుకాణాలు ఉన్నాయా?లేవా? అన్నదానిపై పరిశీలన చేయాలని... శాస్త్రీయంగా పరిశీలించి మ్యాపింగ్‌ చేయాలని ఆదేశించారు.  

ప్రజలకు సరిపడా రైతుజార్లు, నిత్యావసర దుకాణాలు అందుబాటులోకి తెచ్చిన తర్వాత సమయాన్ని తగ్గించే ఆలోచనలు చేయాలని అధికారులకు సూచించారు. ఆ ఆలోచన చేసేముందు ప్రజలకు ఇబ్బందులు రాకుండా అన్ని రకాల చర్యలు తీసుకోవాలని....ఏర్పాట్లపై సంతృప్తి వ్యక్తంచేసిన తర్వాత మాత్రమే సమయం తగ్గించడంపై నిర్ణయాలు తీసుకోవాలని జగన్ అధికారులకు సూచించారు. 

click me!