ఉదయం 11గంటలు దాటితే సరుకుల కొనుగోలుకు నో: తేల్చేసిన ఏపీ సర్కార్

By narsimha lode  |  First Published Mar 29, 2020, 1:51 PM IST

ప్రతి రోజూ ఉదయం 11 గంటల తర్వాత ఇళ్ల నుండి బయటకు రావొద్దని ఏపీ ప్రభుత్వం ప్రజలను కోరింది. నిత్యావసర సరుకులను ఉదయం 11 గంటలలోపుగానే తీసుకోవాలని ఏపీ డిప్యూటీ సీఎం ఆళ్ల నాని చెప్పారు.
 


అమరావతి:ప్రతి రోజూ ఉదయం 11 గంటల తర్వాత ఇళ్ల నుండి బయటకు రావొద్దని ఏపీ ప్రభుత్వం ప్రజలను కోరింది. నిత్యావసర సరుకులను ఉదయం 11 గంటలలోపుగానే తీసుకోవాలని ఏపీ డిప్యూటీ సీఎం ఆళ్ల నాని చెప్పారు.

కరోనాపై ఏపీ సీఎం జగన్ ఆదివారం నాడు కేబినెట్ సబ్ కమిటి, ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో తీసుకొన్న నిర్ణయాలను ఏపీ డిప్యూటీ సీఎం ఆళ్లనాని మీడియాకు వివరించారు.

Latest Videos

ప్రతి జిల్లాలో మంత్రులు ఆయా నియోజకవర్గాలకు చెందిన ఎమ్మెల్యేలతో సమన్వయం చేసుకొంటూ కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండాలని సీఎం ఆదేశించారని ఆయన తెలిపారు.

నిత్యావసర సరకుల కొనుగోలు కోసం గతంలో మధ్యాహ్నం 1 గంట వరకు సమయం ఉండేది. కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న తరుణంలో ఈ వెసులుబాటును కుదించినట్టుగా డిప్యూటీ సీఎం చెప్పారు. ఉదయం 11 గంటల వరకే ప్రజలు తమకు కావాల్సిన వస్తువులను మార్కెట్లో నుండి కొనుగోలు చేసుకోవాలని ఆయన సూచించారు. నిత్యావసర సరకుల కోసమని ఉదయం 11 గంటల తర్వాత బయటకు వస్తే చర్యలు తప్పవని ప్రభుత్వం హెచ్చరించింది.

రాష్ట్రంలో నిత్యావసర సరుకుల కొరత లేదని  డిప్యూటీ సీఎం చెప్పారు. ఏపీ రాష్ట్ర సరిహద్దుల్లో నిలిచిపోయిన ప్రజలకు అన్ని రకాల సదుపాయాలు కల్పించాలని అధికారులను ఆదేశించినట్టుగా ఆళ్లనాని చెప్పారు. 

also read:ఏపీలో ఒక్క రోజే ఆరు కేసులు: 19కి పెరిగిన కరోనా పాజిటివ్ కేసులు

నిత్యావసర సరుకుల ధరలు పెంచితే కఠిన చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశాలు జారీ చేశారని ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు చెప్పారు. ప్రతి దుకాణం ముందు కాల్ సెంటర్ నెంబర్ ను కూడ ఏర్పాటు చేయాలని సూచించారు. ప్రభుత్వం నిర్ణయించిన ధర కంటే ఎక్కువ ధరకు విక్రయిస్తే చర్యలు తీసుకొంటామని మంత్రి తెలిపారు.

నిత్యావసర సరుకులు ఏ మేరకు స్టాక్స్ ఉన్నాయనే విషయమై కూడ ఆరా తీయాలని సీఎం ఆదేశించినట్టుగా చెప్పారు. మార్కెట్లో ఏ సరుకులు ఏ మేరకు రాష్ట్రంలో ఉన్నాయనే విషయమై సర్వే నిర్వహించినట్టుగా చెప్పారు. ఎన్ని రోజుల వరకు సరుకులు ఉంటాయనే విషయాన్ని గుర్తించి చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశాలు జారీ చేశారని ఆయన తెలిపారు.

మొబైల్ మార్కెట్లను కూడ పెంచాలని కూడ నిర్ణయం తీసుకొన్నట్టుగా మంత్రి కన్నబాబు చెప్పారు.  వ్యాపారులు సరుకులను బ్లాక్ మార్కెట్ కు తరలిస్తే కఠిన చర్యలు తీసుకొంటామని మంత్రి కన్నబాబు హెచ్చరించారు. 


 

click me!