ఆడీ, వోక్స్ వ్యాగన్ కార్ల తయారీ నిలిపివేత....

By Sandra Ashok KumarFirst Published Mar 20, 2020, 2:53 PM IST
Highlights

యూరప్ దేశాల్లో ఉత్పాదకత నిలిపేయాలని అంతర్జాతీయ కార్ల తయారీ సంస్థ వోక్స్ వ్యాగన్ నిర్ణయించింది. ఇందులో ఆడీ, లంబోర్ఘినీ, వోక్స్ వ్యాగన్ తదితర బ్రాండ్లు ఉన్నాయి. 

ఫ్రాంక్‌ఫర్ట్: అంతర్జాతీయంగా అతిపెద్ద కార్ల తయారీ సంస్థ వోక్స్ వ్యాగన్ యూరప్ దేశాల్లోని ఉత్పాదక యూనిట్లలో కొంత కాలం కార్ల ఉత్పత్తిని నిలిపివేయనున్నది. ఈ సంగతి స్వయంగా కంపెనీ ప్రకటించింది. శరవేగంగా విస్తరిస్తున్న కరోనా మహమ్మారిని అడ్డుకోవడానికే ఈ నిర్ణయం తీసుకున్నామని వోక్స్ వ్యాగన్ తెలిపింది. 2020 ఆర్థిక సంవత్సరం ఆటోమొబైల్ రంగానికి కష్ట కాలం అని అభివర్ణించింది.

ప్రస్తుతం కార్ల విక్రయాల్లో కనిపిస్తున్న క్షీణత, ఉత్పాదక యూనిట్లకు అవసరమైన విడి భాగాల సరఫరాలో నెలకొన్న అనిశ్చితిని పరిగణనలోకి తీసుకుని తమ గ్రూపులోని బ్రాండ్లకు చెందిన ఫ్యాక్టరీల్లో ఉత్పత్తిని నిలిపివేస్తాం’ అని వోక్స్ వ్యాగన్ సీఈఓ హెర్బెర్డ్ డైసీ తెలిపారు.

స్పెయిన్, పోర్చుగల్, స్లావేకియా దేశాల్లోని ఉత్పాదక యూనిట్లలో ఇప్పటికే ఉత్పత్తిని వోక్స్ వ్యాగన్ నిలిపివేసింది. దీంతోపాటు ఇటలీలోని లంబోర్ఘినీ, డుకాటీ ప్లాంట్లలో ఉత్పత్తిని కూడా ఈ వారాంతానికి నిలిపివేస్తామని హెర్బెర్ట్ డైసీ తెలిపారు. 

also read  విపణిలోకి వోక్స్ వ్యాగన్ టీ-రాక్.. టీవీఎస్ ఎక్స్ఎల్ బైక్స్ ...

దీంతోపాటు యూరప్, జర్మనీలలో ఉన్న ఉత్పాదక యూనిట్లలో రెండు నుంచి మూడు వారాల పాటు ఉత్పత్తి నిలిపివేస్తున్నట్లు వెల్లడించారు. కార్మికులకు పూర్తిస్థాయిలో నష్ట పరిహారం చెల్లిస్తామని తెలిపింది. 

వోక్స్ వ్యాగన్ కంపెనీ చీఫ్ ఫైనాన్సియల్ అధికారి ఫ్రాంక్ విట్టర్ మాట్లాడుతూ కరోనా వైరస్ వల్ల అనుకోని పలు సమస్యలు తలెత్తుతున్నాయని చెప్పారు. 2020 ఆర్థిక సంవత్సరం తమకు చాలా క్లిష్టమైన సంవత్సరం అని పేర్కొన్నారు. ఇవన్నీ సంస్థ ఆర్థిక పరిస్థితిపై ప్రతికూల ప్రభావం చూపుతాయని ఆందోళన వ్యక్తం చేశారు. 

ఆడీ, బెంట్లీ, బుగాట్టి, డుకాటీ, లంబోర్ఘినీ, పోర్షే తదితర మోడల్ కార్లన్నీ వోక్స్ వ్యాగన్ బ్రాండ్ కార్లే. ప్రపంచ వ్యాప్తంగా వోక్స్ వ్యాగన్ సంస్థకు 124 ఉత్పాదక యూనిట్లు కలిగి ఉన్నది. వాటిలో 72 యూనిట్లు యూరప్ దేశాల్లోనూ, జర్మనీలో 28 యూనిట్లు ఉన్నాయి. 

also read  కరోనా ఎఫెక్ట్: బీఎస్-4 వెహికల్స్ కు 2 నెలల గడువివ్వాలి ప్లీజ్

మెక్సికోలోని పౌబ్లాలో వోక్స్ వ్యాగన్ అతిపెద్ద ఉత్పాదక యూనిట్ కలిగి ఉంటుంది. బ్రెజిల్, అమెరికాల్లో ఉత్పాదక యూనిట్లు ఉన్నాయి. గతేడాది వోక్స్ వ్యాగన్ 10.96 మిలియన్ల కార్లను విక్రయించింది. ప్రపంచ వ్యాప్తంగా 6.71 లక్షల మంది ఉద్యోగులు ఉన్నారు.  

వోక్స్ వ్యాగన్ సారథ్యంలో నడుస్తున్న కెఫేటేరియాలు, రెస్టారెంట్లు, సెల్ఫ్ సర్వీస్ షాపులు కూడా మూసివేస్తారు. ప్రధాన ఈవెంట్లు రద్దు చేస్తారు. సమావేశాలన్నీ వీడియో కాన్ఫరెన్సుల ద్వారా నిర్వహించాలని డిసైడయ్యారు. 

అమెరికాలో యునైటెడ్ ఆటో వర్కర్స్ యూనియన్ సంబంధిత కార్ల తయారీ సంస్థలతో సంప్రదింపులు జరిపింది. రెండు వారాల పాటు ఉత్పత్తిని నిలిపివేయాలని యూనియన్ కూడా అభ్యర్థించింది. జనరల్ మోటార్స్, ఫోర్డ్, ఫియట్ కిర్లోస్కర్ వంటి కార్ల తయారీ సంస్థలు తమ ఉత్పత్తిని పాక్షికంగా, రొటేషనల్‌గా నిలిపేయడానికి అంగీకరించాయి. ఆయా సంస్థల ఉత్పాదక యూనిట్లలో క్లీనింగ్ ప్రక్రియ కొనసాగుతున్నది. 
 

click me!