కారు కొనాలంటే కొత్త పద్దతి...కొన్ని వారాల్లో దేశవ్యాప్తంగా...

By Sandra Ashok Kumar  |  First Published Mar 16, 2020, 12:40 PM IST

కరోనా వైరస్ విస్తరిస్తుండటంతో ఆటోమొబైల్ సంస్థలు పలు జాగ్రత్తలు తీసుకుంటున్నాయి. హ్యుండాయ్ మోటార్స్ ఆన్‌లైన్ విక్రయాల దిశగా అడుగులేస్తున్నది. ఇంటి వద్ద నుంచే పని చేయాలని టాటా మోటార్స్ తన సిబ్బందిని కోరింది. ఫెరారీ రెండు నెలల పాటు ఉత్పత్తిని నిలిపేసింది.


న్యూఢిల్లీ: కరోనా వైరస్‌ వ్యాప్తి చెందుతుండటంతో ఎక్కువగా ప్రజలు ఉన్న ప్రాంతాలకు వెళ్లేందుకు చాలా మంది సంశయిస్తున్నారు. ప్రయాణాల్లోనూ ఒంటరిగానే వెళ్లడానికి ప్రాధాన్యం ఇస్తున్నారు. మరోవైపు దేశంలోని అగ్రశ్రేణి ఆటోమొబైల్ సంస్థలు మారుతి సుజుకి, హ్యుండాయ్ మోటార్స్, టయోటా కిర్లోస్కర్ మోటార్స్ తమ సిబ్బందికి పలు ఆంక్షలు విధించాయి. థర్మల్ స్క్రీనింగ్, బిజినెస్ సమావేశాలపై ఆంక్షలు విధించాయి. 

క్లిక్ టు బై ఆప్షన్ అందుబాటులోకి తెచ్చిన హ్యుండాయ్
కార్లు కొనుగోలు చేయాలనుకునే వారు కూడా డీలర్‌షిప్‌కు వెళ్లడానికి వెనుకంజ వేస్తున్నారు. ఈ నేపథ్యంలో దక్షిణ కొరియా ఆటోమొబైల్ దిగ్గజం హ్యుండాయ్‌ మోటార్‌ ఇండియా తన ‘క్లిక్‌ టు బై’ ఆన్‌లైన్‌ సదుపాయాన్ని మరింతగా విస్తరించడంపై దృష్టి సారిస్తోంది.

Latest Videos

undefined

also read టయోటా కార్ల ఉత్పత్తి నిలిపివేత...బిఎస్ 6 అప్ డేట్ ఉండదు...

ఆటో ఎక్స్ పోలో ప్రయోగాత్మకంగా క్లిక్ టు బై
గత నెలలో ఢిల్లీలో నిర్వహించిన ఆటోమొబైల్ ఎక్స్ పోలో ‘క్లిక్ టు బై’ కార్యక్రమాన్ని ప్రయోగాత్మకంగా నిర్వహించింది. దీన్ని ఇప్పుడు దేవవ్యాప్తంగా విస్తరించాలని నిర్ణయించినట్లు హ్యుండాయ్ మోటార్స్ ఇండియా ఎండీ ఎస్ఎస్ కిమ్ తెలిపారు. 

బుకింగ్, ఫైనాన్స్, బీమా కూడా ఆన్ లైన్ లోనే
కారు బుకింగ్, ఫైనాన్స్, బీమా వంటివి ఆన్ లైన్‌లో అందిస్తామని, కోరుకున్న చోటికి వాహనాలను డెలివరీ చేయడమే తమ ప్రణాళిక అని హ్యుండాయ్ మోటార్స్ ఇండియా ఎండీ ఎస్ఎస్ కిమ్ చెప్పారు. కొన్ని వారాల్లో దేశవ్యాప్తంగా ఈ ప్రణాళికను అమలు చేస్తామని కిమ్ తెలిపారు. 

హ్యుండాయ్ ఎగ్జిక్యూటివ్‌ల విదేశీయానం కట్
అంతేకాకుండా ఇప్పటికే ఈ కంపెనీ పలు అంతర్గత చర్యలు తీసుకుంది. ఇందులో భాగంగా ఉద్యోగులతోపాటు  చెన్నై ప్లాంట్‌, కార్యాలయంలోకి వచ్చే సందర్శకుల శరీర ఉష్ణోగ్రతను పరిశీలిస్తోంది. ఎగ్జిక్యూటివ్‌ల విదేశీ ప్రయాణాలను నిషేధించింది. అత్యంత ముఖ్యం అయితే తప్ప దేశీయంగా బిజినెస్‌ ట్రిప్‌లకు అనుమతించడం లేదు. 

ఉత్పత్తి నిలిపివేసిన ఫెరారీ
ఇటలీ లగ్జరీ కార్ల దిగ్గజం ఫెరారీ తన రెండు ఫ్యాక్టరీల్లో రెండు వారాల పాటు ఉత్పత్తిని నిలిపివేసింది. మార్చి 27వ తేదీ వరకు ఈ ఫ్యాక్టరీల్లో ఉత్పత్తి ఉండదని కంపెనీ తెలిపింది. ఉద్యోగుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఉత్పత్తి నిలిపివేత నిర్ణయం తీసుకున్నట్టు పేర్కొంది. కంపెనీ కార్యకలాపాలకు ఉత్పత్తికి సంబంధం లేదని కంపెనీ సీఈఓ లూయిస్‌ కామిలెరి తెలిపారు. సాధ్యమైనంత త్వరగా ఉత్పత్తిని పునఃప్రారంభించేందుకు ప్రయత్నం చేస్తామన్నారు. 

also read కోలుకొని ఆటోమొబైల్ పరిశ్రమ... ఫిబ్రవరిలో కూడా తగ్గిన సేల్స్...

ఇంటి వద్ద నుంచి పని చేయండి: టాటా మోటార్స్
ప్రధాన, రీజనల్ కార్యాలయాల సిబ్బంది సోమవారం నుంచి వర్క్ ఫ్రం హోమ్ (ఇంటి వద్ద నుంచే పని చేయొచ్చని) టాటా మోటార్స్ తెలిపింది. 20 మంది కంటే ఎక్కువ మంది హాజరు కావాల్సిన సమావేశాలను కూడా రద్దు చేసింది.

మారుతి సుజుకి తన సిబ్బంది కోసం సరిపడా శానిటైజర్లు అందుబాటులో ఉంచింది. విదేశీయానానికి సిబ్బందికి అనుమతించడం లేదు. రెండు వారాలుగా విదేశీ పర్యటనకు వెళ్లి వచ్చిన వారిని స్వీయ క్వారంటైన్ సెంటర్‌కు తరలిస్తోంది మారుతి సుజుకి. 

ఏప్రిల్ 17 తర్వాతే ఎన్సీఎల్ఏటీ విచారణ  
కరోనా వైరస్ విస్తరణ నేపథ్యంలో ఈ నెల 17-31 తేదీల మధ్య విచారించాల్సిన కేసులను వచ్చేనెల 17 తర్వాత విచారిస్తామని జాతీయ కంపెనీ లా అప్పిలేట్ ట్రిబ్యునల్ (ఎన్సీఎల్ఏటీ) తెలిపింది. అయితే అత్యవసర కేసులను మాత్రమే విచారిస్తామన్నది. ఈ ఫిర్యాదులను మధ్యాహ్నం ఒంటి గంట వరకు స్వీకరిస్తామని వెల్లడించింది. 
 

click me!